
సాక్షి, బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీజేపీకి ఊహించని పరిణామం ఎదురైంది. బీజేపీ రూపొందించిన మూడు యాడ్లను నిషేధిస్తూ ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించి బీజేపీ వీటిని రూపకల్పన చేసిందని ఈసీ తెలిపింది. ‘జన విరోధి సర్కార, విఫల సర్కార్, మూరు భాగ్య’ పేరుతో బీజేపీ యాడ్లను రూపొందించింది. ఏప్రిల్ 22న వాటిని ప్రసారం చేసుకునేందుకు అనుమతిస్తూ బీజేపీ కార్యదర్శి గణేశ్ యాజీకి మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీ(ఎంసీఎంసీ) క్లియరెన్స్ ఇచ్చింది.
అయితే ఆ యాడ్‌లపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్సీ వీఎస్ ఉగ్రప్ప ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. అసత్యప్రచారాలతో బీజేపీ ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిందని ఆయన ఫిర్యాదులో తెలిపారు. వాటిని పరిశీలించిన ఈసీ.. ఉగ్రప్ప వాదనతో ఏకీభవించింది. ప్రజాప్రతినిధుల చట్టం, ఐపీసీ సెక్షన్‌లను అనుసరించి ఆ యాడ్‌లపై నిషేధం విధిస్తున్నట్లు తెలిపింది. దీంతో తక్షణమే ఆ యాడ్‌లను నిలుపుదల చేయాలని ఎంసీఎంసీకి ప్రసార శాఖ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కాంగ్రెస్ మాత్రం వినూత్న రీతిలో యాడ్లను రూపొందిస్తూ దూసుకెళ్తోంది. త్రీ సినిమాలో వై దిస్ కొలవెరి సాంగ్‌ను.. వై దిస్ యడ్యూరప్ప... అంటూ కాంగ్రెస్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.
Comments
Please login to add a commentAdd a comment