సాక్షి, న్యూఢిల్లీ : గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది ఘట్టంలో మతం ప్రాతిపదిక ఎన్నికల ప్రచారం చేయడం వల్ల ఫలితాలు కలసి వచ్చాయని భావిస్తున్న భారతీయ జనతా పార్టీ దక్షిణాదిలో అతి పెద్ద రాష్ట్రమైన కర్ణాటకలో కాంగ్రెస్ నుంచి ప్రభుత్వాన్ని కైవసం చేసుకునేందుకు మతం ప్రాతిపదికన హిందూత్వ అస్త్రంతో ముందుకు వస్తోంది. అప్పుడే సంఘ్ పరివార్ సంస్థలు హిందూత్వ పేరిట ఓట్ల సమీకరణకు కర్ణాటక రాష్ట్రంలో తిష్టవేశాయి.
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలోకి అడుగుపెడుతూనే మతం ప్రాతిపదిక ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలో హిందువుల ప్రయోజనాలను పరిరక్షించడంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విఫలమయ్యారని, అసలు ఆయన హిందువే కాదని అమిత్ షా ఆరోపించారు. గోమాంసం గురించి మాట్లాడిన సిద్ధరామయ్య రాష్ట్రంలో గోమాంసాన్ని ఎందుకు నిషేధించడం లేదని యోగి ఆదిత్యనాథ్ ప్రశ్నించారు. ప్రతి అంశాన్ని హిందుత్వ వర్సెస్ ముస్లింలుగా చూసే సంఘ్ పరివార్ సంఘాలు రాష్ట్రంలో విద్వేషాలను రెచ్చగొడుతున్నాయి. ఫలితంగానే మొన్న మంగళూరులో మత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
‘నేను ముస్లింలను ప్రేమిస్తాన’ని ఓ 20 ఏళ్ల యువతి వ్యాఖ్యానించినందుకు హిందూత్వ శక్తులు ఆమెను తీవ్రంగా కొట్టాయి. ఆ అవమానాన్ని భరించలేక ఆమె ఆత్మహత్య చేసుకుంది. ఫలితంగా కర్ణాటక ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. అభివృద్ధి ఎజెండాను పక్కనపెట్టి మతం ప్రాతిపదికగానే ఎన్నికల ప్రచారంపై దృష్టి ఎక్కువ పెడితే ఎలాంటి పరిస్థితులు తలెత్తుతాయోమోనని రాష్ట్రానికి చెందిన బీజీపీ నాయకులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment