
సాక్షి, హైదరాబాద్: త్వరలో జరగబోయే మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని బీజేపీ కోర్ కమిటీ పిలుపునిచ్చింది. ఆదివారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ అధ్యక్షతన కోర్‌కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కోర్‌కమిటీ పలు నిర్ణయాలు తీసుకుంది. ఈ మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి నాయకుడు పనిచేయాలని సమావేశం నిర్ణయించింది. ప్రతి పార్లమెంటు పరిధిలో మున్సిపల్ ఎలక్షన్స్ మేనేజ్‌మెంట్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు తీర్మానించింది.
అలాగే పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ప్రధాని మోదీని ఉద్దేశించి రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సమావేశం తప్పుబట్టింది. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీద పెట్టిన కేసులను, పోలీసుల పక్షపాత వైఖరిని సమావేశం ఖండించింది. సమావేశంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా, కిషన్‌రెడ్డి సమక్షంలో పలు పార్టీలకు చెందిన నేతలు ఆదివారం బీజేపీలో చేరారు.
Comments
Please login to add a commentAdd a comment