
బీజేపీ మహిళా శంఖారావం సభలో మాట్లాడుతున్న సుష్మాస్వరాజ్
సాక్షి, మేడ్చల్ జిల్లా: అమర వీరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ స్వప్నం సాకారం కాలేదని, శాసనసభ ఎన్నికల్లో బీజేపీ గెలుపుతోనే ఇది సాధ్యమవుతుందని విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మాస్వరాజ్ అన్నారు. బుధవారం మేడ్చల్ జిల్లా కీసర మండల కేంద్రంలో జరిగిన బీజేపీ మహిళా శంఖారావం ఎన్నికల సభలో ఆమె పాల్గొన్నారు. సభలో ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడితే దళితుడిని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ తానే అధికారాన్ని అనుభవిస్తున్నారని తీవ్రంగా ద్వజమెత్తారు.
తానే కాకుండా, తన కొడుకు, అల్లుడిని మంత్రులుగా, కూతురును ఎంపీగా, మరొకరిని రాజ్యసభ సభ్యుడిగా చేసి, తెలంగాణలో కుటుంబ పాలన సాగిస్తున్నారని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను కూడా అమలు చేయలేకపోయిందని, ఈ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో వారికి బుద్ధి చెప్పాలని ఆమె పిలుపునిచ్చారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బలిదానం చేసుకున్న అమరుల కుటుంబాలు ప్రతిపక్ష నాయకురాలిగా ఉన్నప్పుడు తనను కలిసి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని కోరిన విషయాన్ని ఆమె ఈ సందర్భంగా గుర్తు చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసం జరిగిన తెలంగాణ పోరాటంలో బీజేపీ ప్రధాన భూమిక పోషించిందన్నారు. తెలంగాణ కోసం ఎవరూ చనిపోవద్దని భరోసా ఇవ్వడంతోపాటు పార్లమెంట్ బయట, లోపల తాను చేసిన పోరా టాన్ని గుర్తు చేశారు. ఈ సభలో మేడ్చల్ బీజేపీ అభ్యర్థి మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment