చండీగఢ్ : ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు భిన్నంగా హరియాణాలో హంగ్ అసెంబ్లీ ఏర‍్పడటంతో దుష్యంత్ చౌతాలా నేతృత్వంలోని జేజేపీ, ఇండిపెండెట్లు కీలకంగా మారారు. జేజేపీకి అటు బీజేపీ ఇటు కాంగ్రెస్‌లు గాలం వేస్తుండటంతో ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరికి సహకరిస్తారనే విషయంలో దుష్యంత్ చౌతాలా ఇంకా సస్పెన్స్‌ను కొనసాగిస్తున్నారు. ఇక జేజేపీ మద్దతు లభించని పక్షంలో స్వతంత్రుల సహకారంతో రెండోసారి పాలనాపగ్గాలు చేపట్టేందుకు ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ సన్నాహాలు ముమ్మరం చేశారు. 90 మంది సభ్యులు కలిగిన హరియాణా అసెంబ్లీలో ప్రభుత్వ ఏర్పాటుకు మేజిక్ ఫిగర్ 46 కాగా, బీజేపీకి 40 స్ధానాలే దక్కిన విషయం తెలిసిందే. ఇక కాంగ్రెస్‌కు 31 స్ధానాలు లభించగా, జేజేపీకి 10 స్ధానాలు, 8 మంది ఇండిపెండెంట్లు గెలుపొందారు. ఒక స్ధానం ఐఎన్‌ఎల్డీ దక్కించుకుంది. ఆరుగురు స్వతంత్ర అభ్యర్ధులు బీజేపీకి మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉండగా బీజేపీ అగ్రనేతలను కలిసేందుకు పలువురు ఢిల్లీకి క్యూ కట్టినట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ నిరాకరించడంతో తిరుగుబాటు అభ్యర్ధులుగా పోటీచేసిన ముగ్గురు బీజేపీ నేతలు స్వతంత్ర అభ్యర్ధులుగా గెలుపొందడంతో కాషాయ పార్టీకి వారి మద్దతు ఖాయమైంది.
Comments
Please login to add a commentAdd a comment