
సాక్షి, అమరావతి : బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీలో గుండాలకు, రౌడీలకు మాత్రమే పదవులు ఇస్తున్నారని ఆయన విమర్శించారు. రూ.5 లక్షలు ఇస్తే హత్య చేసేవారిని ప్రోత్సహిస్తున్నారని విష్ణుకుమార్ రాజు మంగళవారమిక్కడ అన్నారు. ఆయన మంగళవారం అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ.. ‘ రూ.10 లక్షలను ఇస్తే నన్ను కూడా చంపేస్తారు. టీడీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ హుందాగా నిరసన చేస్తే బాగుండేది. మోదీ మెడలు వంచినట్లు ఆయన నిరసన తెలిపారు. రౌడీలను అద్దెకు తెచ్చి టీడీపీ ధర్నాలు చేయిస్తోంది.
హత్యకేసులో నేరస్తుడు ...ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి వ్యతిరేకంగా నిరసన చేయడమా?. అటువంటి వారికి నగర ఉపాధ్యక్ష పదవి ఎలా ఇచ్చారు. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే సహించం. గవర్నర్ ప్రసంగానికి ఎమ్మెల్యే డుమ్మా కొట్టి ప్రధానిపై నీచంగా నిరసన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది. మోదీపై నిరసన చేపట్టిన వారిని అరెస్ట్ చేయాలి. ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌పై ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలి. వారిపై కేసులు నమోదు చేయాలి. ఇటువంటి వ్యక్తులు ఉన్న టీడీపీ చాలా దారుణంగా ఉంది. మేము నోరు విప్పతే టీడీపీ బండారం బయటపడుతుంది. మిత్ర ధర్మాన్ని పాటిస్తున్నాం కాబట్టే సంయమనంతో ఉన్నాం. మేము నోరు తెరిస్తే చాలా చెప్పాల్సి ఉంటుంది’ అని ధ్వజమెత్తారు.