టీడీపీపై సోము వీర్రాజు ఫైర్‌..! | bjp mlc somu virraju fires on tdp | Sakshi
Sakshi News home page

Published Tue, Feb 13 2018 11:36 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

bjp mlc somu virraju fires on tdp - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న సోము వీర్రాజు

సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వ నిధుల విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మాట మారుస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ, సీనియర్‌ నేత సోము వీర్రాజు మండిపడ్డారు. ఏపీకి కేంద్రం ఎక్కువసాయం చేసిందని స్వయంగా సీఎం చంద్రబాబే చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడెందుకు ఆయన మాట మారుస్తున్నారని ప్రశ్నించారు. కేంద్రం నిధుల విషయంలో టీడీపీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారానికి తెరదించుతామని ఆయన అన్నారు. విజయవాడలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

ఏపీకి ప్రత్యేక హోదాను ఐదేళ్లు ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ ఎందుకు విభజన బిల్లులో చేర్చలేదని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని విభజన బిల్లులో చేర్చలేదని, కేవలం పరిశీలిస్తామని మాత్రమే చెప్పారని, అందుకే కేంద్రం ఆర్థిక సాయం చేసేందుకు ముందుకొచ్చిందని అన్నారు. విభజన బిల్లులో పేర్కొన్న కేంద్ర సంస్థలను ఏపీలో నెలకొల్పామన్నారు. ప్రత్యేక ప్యాకేజీపై చంద్రబాబు మాటమారుస్తున్నారని తెలిపారు. కేంద్రం అన్నీ ఇచ్చిందని, సంతృప్తిగా ఉన్నామని సీఎం చంద్రబాబుతోపాటు కేంద్రమంత్రి సుజనా చౌదరి గతంలో పేర్కొన్నారని, కేంద్రాన్ని ఇంతకంటే అడగలేమని సుజనా చౌదరి చెప్పారని గుర్తుచేశారు.

ఇంకా ఆయన ఏమన్నారంటే..

  • ఏపీకి 16 యూనివర్సిటీలు మంజూరు చేశాం
  • రాజధాని నిర్మాణానికి రూ. 2500 కోట్లు ఇచ్చాం
  • ప్రత్యేక హోదాకు బదులుగా ఇచ్చే నిధులను రాష్ట్రవ్యాప్తంగా వినియోగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వద్ద ప్రణాళిక ఉందా?
  • ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రణాళికను విడుదల చేయాలి
  • ప్రత్యేక హోదా లేదని పెట్టుబడిదారులెవరూ వెనక్కి వెళ్లడం లేదు
  • రాష్ట్రానికి వేలకోట్ల పెట్టుబడులు వచ్చాయని స్వయంగా చంద్రబాబే చెప్పారు
  • విశాఖలో రైల్వేజోన్‌ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది
  • దుగరాజుపట్నం పోర్టు విషయంలో స్థలం చూపించాలని కేంద్రం రాష్ట్రాన్ని ఎప్పుడో కోరింది
  • కానీ రాష్ట్ర ప్రభుత్వమే ఇప్పటివరకు స్పందించలేదు
  • కడపలో స్టీల్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు అంశం కేంద్రం పరిశీలనలో ఉంది
  • దీనిపై కేంద్రం ఇప్పటికే కొంత కసరత్తు ప్రారంభించింది
  • విభజన చట్టంలో ఉన్నదానికంటే కేంద్రం ఎక్కువే చేస్తోంది
  • రాష్ట్రంలో నిరంతర విద్యుత్‌ సరఫరా కేంద్రం వల్లే సాధ్యమైంది
  • వెనుకబడిన జిల్లాలకు కేంద్రం ఇప్పటివరకు రూ. 1500 కోట్లు ఇచ్చింది
  • వాటిని ఎక్కడెక్కడ ఖర్చు పెట్టారో రాష్ట్ర ప్రభుత్వం చెప్పలేదు
  • విభజన చట్టంలోని హామీలను పదేళ్లలో పూర్తి చేయాల్సి ఉంది
  • కానీ కేంద్రం ఇప్పటికే చాలా చేసేసింది
  • పోలవరం నిర్మాణానికి కేంద్రం కట్టుబడి ఉంది
  • కాంగ్రెస్‌ ఒప్పుకోకపోయినా.. పోలవరం కోసం ముంపు మండలాలను మేం ఏపీలో కలిపాం
  • 2019 కల్లా పోలవరాన్ని పూర్తి చేస్తామని గడ్కరీ చెప్పారు..
  • ఈ విషయంలో ఎవరికీ అనుమానాలు అక్కరలేదు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement