
సాక్షి,న్యూఢిల్లీ: ఎన్నికల కమిషన్ పనితీరులో బీజేపీ జోక్యం చేసుకోదని గుజరాత్ సీఎం విజయ్ రూపానీ అన్నారు. రాష్ర్టంలో ఎన్నికల తేదీలను ప్రకటించే వ్యవహారం పూర్తిగా ఈసీ పరిథిలోనిదేనని స్పష్టం చేశారు. ఎన్నికల తేదీల ప్రకటనల్లో తాము జోక్యం చేసుకోమని, ఇది పూర్తిగా ఈసీ విచక్షణాధికారమని ఆయన పేర్కొన్నారు. గుజరాత్‌లో సకాలంలోనే ఎన్నికలు జరుగుతాయని, తాము ఈ విషయంలో ఎలాంటి జాప్యం చేయడం లేదని చెప్పారు. ప్రభుత్వ కార్యక్రమాలను అమలు చేయడం తప్పా అని విపక్షాల విమర్శలను ప్రస్తావిస్తూ రూపానీ వ్యాఖ్యానించారు.
తాము ఎన్నికల తేదీలను పట్టించుకోవడం లేదని, ప్రజల డిమాండ్లను నెరవేర్చడంలో నిమగ్నమయ్యామని తెలిపారు. కాగా, హిమాచల్ ప్రదేశ్‌కు ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన సందర్భంలో గుజరాత్ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించకపోవడంపై విపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. గుజరాత్‌లో ఓటర్లకు ప్రధాని తాయిలాలు, వరాలు కురిపించేందుకే ఎన్నికల షెడ్యూల్ వెల్లడించకుండా ఈసీ జాప్యం చేసిందని కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఎన్నికల కమిషన్ వ్యవహారాల్లో మోదీ సర్కార్ మితిమీరిన జోక్యానికి ఇది నిదర్శనమని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment