సాక్షి, హైదరాబాద్: ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ప్రయత్నాలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విరుచుకుపడ్డారు. హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా కేసీఆర్ సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్‌తో భేటీ సందర్భంగా లక్ష్మణ్ విమర్శల వర్షం కురిపించారు. టీఆర్‌ఎస్ కాంగ్రెస్ తోక పార్టీ అంటూ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, బీజేపీరహితంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటైతే స్వాగతిస్తామని తెలిపారు. కానీ, కేసీఆర్ చేసే పర్యటనలన్నీ కాంగ్రెస్‌తో సంబంధాలున్న పార్టీల నేతలతో సాగుతున్నాయని విమర్శించారు.
కేసీఆర్ పర్యటనలు కాంగ్రెస్‌కు లాభం చేసేలా ఉన్నాయని లక్ష్మణ్ వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ అనుమతి లేనిదే అఖిలేష్ యాదవ్ కేసీఆర్‌తో భేటీ అయ్యారా? అని ప్రశ్నించారు. దమ్ము, ధైర్యముంటే కాంగ్రెస్‌తో అంటకాగే పార్టీలతో కాకుండా.. కేవలం ప్రాంతీయ పార్టీల మద్ధతుతో ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేయాలని కేసీఆర్‌కు సవాల్ విసిరారు. ముందుగా రాష్ట్రంలో తన అధికారాన్ని కోల్పోకుండా కేసీఆర్ జాగ్రత్త పడితే మంచిదని సూచించారు. గతంలో ఎన్టీఆర్ ఇలాంటి హాడావిడే చేసి సొంత రాష్ట్రంలో ఓటమి పాలయ్యారని గుర్తుచేశారు.
Comments
Please login to add a commentAdd a comment