
రాజకీయాలకు, సినీరంగానికి ఉన్న అనుబంధం విడదీయలేనిది.. సినీ గ్లామరే పెట్టుబడిగా పెట్టి రాజకీయాల్లో నాలుగు ఓట్లు రాబట్టుకోవడం అన్ని పార్టీల్లోనూ మామూలే. ఎన్నికల ప్రచారానికి ఒక ఊపు రావాలన్నా, ఊరూవాడా ఈస్ట్‌మన్ కలర్‌లో ప్రచారం హోరెత్తిపోవాలన్నా సినీ తారల వల్లే సాధ్యమవుతుందని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. బీజేపీ ఈ విషయంలో అందరికంటే ముందుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ కూడా విడుదల కావడంతో కమలనాథులు పార్టీకి సినీ సొగసులు అద్దే పనిలో పడ్డారు. బీజేపీ అధిష్టానం ఎందరో తారల్ని పార్టీలోకి లాగడానికి ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తోంది. కేవలం సినీ గ్లామర్ మాత్రమే కాదు, క్రీడాకారులు, మేధావులు, కళాకారులు ఇలా జనాన్ని ఆకర్షించే సత్తా ఉన్నవాళ్లని తీసుకువచ్చి పార్టీకి కొత్త హంగుల్ని అద్దడానికి వ్యూహరచన చేస్తోంది.
దీదీని ఎదుర్కోవడానికి
పశ్చిమ బెంగాల్‌లో పార్టీని బలోపేతం చేసి వీలైనన్ని ఎక్కువ లోక్‌సభ స్థానాలను దక్కించుకోవడానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా చాలా కాలంగా వ్యూహాలు రచిస్తున్నారు. బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని దీటుగా ఎదుర్కోవడానికి ఏ చిన్న అవకాశాన్నీ వదలడం లేదు. మొత్తం 42 లోక్‌సభ స్థానాలున్న పశ్చిమబెంగాల్‌లో 22 స్థానాల్లోనైనా నెగ్గాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అందుకోసం బెంగాల్‌లో బాగా పేరున్న వారు, పార్టీకి వెన్నుదన్నుగా ఉంటారని భావిస్తున్న ఎవరినైనా లాగేయడానికి సిద్ధంగా ఉన్నారు. మహాభారతంలో ద్రౌపది వేషంతో పాపులర్ అయిన రూపాగంగూలీని 2015లోనే పార్టీలో చేర్చుకున్నారు. ప్రముఖ బెంగాలీ గాయకుడు బాబూల్ సుప్రియో ఇప్పటికే అసనోల్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఉన్నారు. కాంగ్రెస్‌లో తగిన ప్రాధాన్యం దక్కక అసంతృప్తితో ఉన్న హిందీ తార మౌసమీ ఛటర్జీ బెంగాల్ బీజేపీకి కొత్త హంగులు తెచ్చారు.
సినీ తారలు, క్రికెటర్లపై గురి
భారతీయ జనతా పార్టీ తన గూటిలోకి లాగాలనుకునే తారల జాబితా చాలా పెద్దదే. గత ఏడాది జూన్‌లో అమిత్ షా బాలీవుడ్ నటి మాధురీ దీక్షిత్‌ను ముంబైలో స్వయంగా కలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం సాధించిన విజయాల గురించి ఆమెకు వివరించారు. మాధురిని మహారాష్ట్రలోని పుణే నుంచి ఎన్నికల బరిలోకి దింపుతారనే వార్తలు అప్పట్లోనే హల్ చల్ చేశాయి. అయితే మాధురి నుంచి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదు. మాధురీయే కాదు కంగనా రనౌత్, ప్రీతి జింటా, పల్లవి జోషీ, రవీనా టాండన్, అక్షయ్ కుమార్‌లను కూడా ఎన్నికల వేళ పార్టీ తీర్థం పుచ్చుకునేలా బీజేపీ వ్యూహాలకు పదును పెడుతోంది. క్రికెటర్లు కపిల్‌దేవ్, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌లు పొలిటికల్ పిచ్‌లో తమ సత్తా చాటుతారన్న నమ్మకంతో ఉన్న బీజేపీ వారికి కూడా గాలం వేస్తోంది. ఇక కేరళ బీజేపీ ట్రంప్‌కార్డుగా మలయాళం సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ను తిరువనంతపురం బరి నుంచి దింపుతారని వార్తలు వచ్చాయి. గతంలో మోహన్‌లాల్ స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకోవడంతో ఊహాగానాలు చెలరేగాయి. మోహన్‌లాల్‌కి పద్మభూషణ్ అవార్డు ఇవ్వడం కూడా ఈ ఊహాగానాలకు ఊతమిచ్చింది. అయితే మోహన్‌లాల్ అభిమానులే ఆయన బీజేపీలోకి వెళతారన్న వార్తలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో మోహన్‌లాల్ వెనకడుగు వేశారు. రాజకీయాల్లో చేరాలనే ఉద్దేశం తనకు లేదని, నటుడిగా తన జీవితం సంతృప్తినిస్తోందని మోహన్‌లాల్ తేల్చి చెప్పేశారు.అయినా రాజకీయాల్లో ఏ నిమిషం ఏదైనా జరగవచ్చునన్న విశ్లేషణలైతేవినిపిస్తున్నాయి.
సుమలత రూటు ఎటు ?
సుమలత.. ఈ పేరు చెబితే చాలు.. తెరపై సంప్రదాయమైన చీరకట్టుతో హుందా పాత్రలే మన కళ్ల ముందు కదులుతాయి. తెలుగు ఆడపడుచు, కన్నడ కోడలు అయిన సుమలత భర్త, నటుడు, కాంగ్రెస్ ఎంపీ అంబరీష్ ఇటీవల ఆకస్మికంగా మరణించడంతో ఆయన అభిమానులు సుమలతను పోటీ చేయాలంటూ డిమాండ్లు చేస్తున్నారు. కర్ణాటకలో మండ్యా నియోజకవర్గానికి ఇన్నాళ్లూ ఆయన ప్రాతినిధ్యం వహించారు. భర్త పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్నప్పటికీ సుమలత అభిమానుల కోరిక మేరకు రాజకీయ అరంగేట్రం చేయాలని భావించారు. కాంగ్రెస్ పార్టీ మండ్యా టికెట్ ఇస్తే పోటీకి దిగుతానని మీడియా ముందే ప్రకటించారు. కానీ ఇక్కడే రాజకీయం రసవత్తరంగా మారింది. కర్ణాటకలో కాంగ్రెస్, జేడీ(ఎస్) మధ్య పొత్తు ఉంది. ఈ పొత్తులో భాగంగా పాండ్యా సీటు జేడీ(ఎస్)కే ఇవ్వాలన్న నిర్ణయం కూడా జరిగిపోయింది. అందుకే అంబరీష్‌ను అప్పట్లోనే మంత్రి పదవి నుంచి తప్పించారన్న ప్రచారం కూడా జరిగింది. సుమలత మండ్యా నుంచి తప్ప మరో చోట నుంచి బరిలోకి దిగనని పట్టు పట్టడంతో కాంగ్రెస్ అధిష్టానం ఏమీ చేయలేని స్థితిలో పడిపోయింది.. మరోవైపు కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి తన కుమారుడు నిఖిల్ గౌడను మండ్యా బరిలోకి దింపాలని యోచిస్తున్నారు. మండ్యాలో వక్కళిగ ఓట్లు ఎక్కువగా ఉన్నాయి. ఆ నియోజవవర్గంలో అరంగేట్రం చేస్తే వక్కళిగ సామాజిక వర్గానికి చెందిన తన కుమారుడు నిఖిల్ గెలుపు నల్లేరు మీద బండి నడకని కుమారస్వామి భావిస్తున్నారు.
పిట్ట పోరు పిట్ట పోరు పిల్లి తీర్చినట్టుగా కాంగ్రెస్, జేడీ(ఎస్)మధ్య అంతర్గత పోరుని తమకు అనుకూలంగా మార్చుకునే పనిలో బీజేపీ పడింది. సుమలతను పార్టీలోకి తీసుకురావాలని వ్యూహాలు కూడా పన్నుతోంది. కానీ సుమలత కాంగ్రెస్ టికెట్ దక్కకపోతే స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగాలని భావిస్తున్నట్టుగా తెలిసింది. అయినా సుమలతకున్న సినీ గ్లామర్‌ను వినియోగించుకోవడానికి కమలనాథులు ఆ నియోజకవర్గంలో తమ పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా, పరోక్షంగా సుమలతకు మద్దతు ఇవ్వాలని నిర్ణయానికి వచ్చారు. దీంతో జేడీ(ఎస్)సుమలతపై రాజకీయ దాడి మొదలు పెట్టింది. ‘‘భర్త పోయి నెల తిరక్కుండానే రాజకీయాలు కావాల్సి వచ్చాయా‘‘అంటూ కుమారస్వామి సోదరుడు, కర్ణాటక మంత్రి హెచ్‌డీ రేవణ్ణ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అంబరీష్‌కు కన్నడనాట మంచి ఫాలోయింగ్ ఉంది. రెబెల్ స్టార్ అన్న ఇమేజ్ కూడా ఉంది. దీంతో రేవణ్ణ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో రచ్చ రచ్చ జరిగింది. భర్తను కోల్పోయిన ఒక మహిళపై ఇలాంటి నీచ వ్యాఖ్యలు చేస్తారా అంటూ సుమలత, అంబరీష్ అభిమానులు సోషల్ మీడియాలో విరుచుకుపడ్డారు. ఎన్నికల వేళ తమ ఇమేజ్ ఎక్కడ డ్యామేజ్ అవుతుందోనని భావించిన కుమారస్వామి, నిఖిల్‌లు రేవణ్ణ తరఫున క్షమాపణలు కోరారు. ఇన్ని మలుపుల మధ్య సుమలత రాజకీయ భవితవ్యం ఎటు తిరుగుతుందో చూడాలి.
2014లో బీజేపీ సినీ ఫార్ములా సక్సెస్
2014లోనూ బీజేపీ పెద్ద ఎత్తున సినీ తారల్ని ఆకర్షించి పొలిటికల్ బాక్సాఫీస్ వద్ద వారి గ్లామర్‌ని క్యాష్ చేసుకోవడంలో సక్సెస్ కొట్టింది. గత లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్‌గాంధీపై టెలివిజన్ స్టార్, ఇంటింటి కోడలుగా అందరి మన్ననలు పొందిన స్మృతి ఇరానీని పోటీకి నిలిపింది. స్మృతి ఓడిపోయినప్పటికీ బీజేపీకి ఒక ఊపు తీసుకురావడంలో విజయం సాధించారు. ఇక చాలా మంది తారలు విజయం సాధించి పార్లమెంటుకి గ్లామర్ తళుకులు అద్దారు.హేమమాలిని (మథుర నియోజకవర్గం), మనోజ్‌తివారీ (ఈశాన్య ఢిల్లీ), పరేష్ రావల్ (తూర్పు అహ్మదాబాద్), కిరణ్‌ఖేర్ (చండీగఢ్), శత్రుఘ్నసిన్హా (పట్నా సాహిబ్) బాబూల్ సుప్రియో (అసనోల్)లు గత ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే శత్రుఘ్నసిన్హా ఇప్పుడు అధిష్టానంపై తిరుగుబాటు బావుటాఎగురవేశారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీని వీలైనప్పుడల్లా విమర్శిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. మరి ఈ ఎన్నికల్లో కమల వికాసానికి తారల తళుకుబెళుకులు ఎంతవరకు కలిసొస్తాయో మరి.
పక్కాగా సర్వే చేసి మరీ..
సినీ గ్లామర్ అన్నివేళలా ఓట్లను రాలుస్తుందని చెప్పలేం. అందుకే సినీతారలు, క్రికెటర్లపై గాలం వేయడానికి ముందే బీజేపీ ఓ పక్కా సర్వే నిర్వహించినట్టు సమాచారం. ఏ నియోజకవర్గంలో ఏ తారని దింపితే ఫలితం ఉంటుందాఅన్న సర్వే చేయించినట్టు తెలుస్తోంది. ఈ సర్వేలో మాధురీ దీక్షిత్, క్రికెటర్లు వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్‌లు విజయం సాధించడానికి ఎక్కువగాఅవకాశాలు ఉన్నట్టు తేలింది. మహారాష్ట్రలో ముంబై లేదా పుణె నుంచిమాధురీ దీక్షిత్, హరియాణాలోని రోహ్‌తక్ నుంచి వీరేంద్ర సెహ్వాగ్, న్యూఢిల్లీ నుంచి గౌతమ్ గంభీర్ గెలుపు గుర్రాలేనని ఆ సర్వేలో వెల్లడైంది. గౌతమ్ గంభీర్ ఎప్పుడూ జాతివ్యతిరేక శక్తుల్ని ఎండగడుతూ ఉంటారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌తో ట్విట్టర్ వేదికగా ఢీ అంటే ఢీ అంటూ గంభీర్ ఎందరో ఫాలోయర్లను పెంచుకున్నారు.ఇక పంజాబ్‌లో గురుదాస్‌పూర్ నియోజకవర్గం నుంచి చాలా ఏళ్లు బీజేపీ తరఫున గెలిచిన నటుడువినోద్‌ఖన్నా మృతితో ఆ నియోజకవర్గం నుంచి ఎవరిని నిలపాలా అన్నదికమలనాథులు ముందు సవాల్‌గానే ఉంది. ఇప్పటికే ప్రధానమంత్రినరేంద్రమోదీతో అత్యంత సన్నిహితంగా ఉన్న అక్షయ్‌కుమార్‌నుగురుదాస్‌పూర్ నుంచి పోటీకి నిలిపితే బాగుంటుందని బీజేపీ అధిష్టానం భావించింది కానీ ఆయనకు పౌరసత్వమే పెద్ద అడ్డంకిగా ఉంది.కెనడా పౌరుడు అయిన అక్షయ్‌కుమార్ భారత్‌లో ఎన్నికల్లో పోటీచేయడానికి వీలులేదు.
Comments
Please login to add a commentAdd a comment