బీజేపీకి ఝలక్‌! | BJP Worry About Vice Chairman Election In Nalgonda Municipality | Sakshi
Sakshi News home page

బీజేపీకి ఝలక్‌!

Published Mon, Feb 10 2020 8:49 AM | Last Updated on Mon, Feb 10 2020 8:50 AM

BJP Worry About Vice Chairman Election In Nalgonda Municipality - Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : నల్లగొండ మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ పదవి విషయంలో బీజేపీకి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఝలక్‌ ఇవ్వనుంది. వైస్‌ చైర్మన్‌ పదవిపై ఆశపడిన బీజేపీకి భంగపాటు తప్పేలాలేదు. మున్సిపల్‌ చైర్మన్‌ పదవి ఎన్నిక సందర్భంలో తటస్థంగా ఉన్న బీజేపీకి వైస్‌ చైర్మన్‌ పదవి ఇవ్వాలని అనుకున్నారు. ప్రస్తుతం అధికార పార్టీ ఆ పదవిని కూడా దక్కించుకునేందుకు పావులు కదుపుతోంది. అందులో భాగంగా తమ పార్టీ కౌన్సిలర్లను నాగార్జునసాగర్‌ క్యాంపునకు తరలించింది. వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా ఏ విధంగా వ్యవహరించాలి, ఎవరిని ఎన్నిక చేయాలనే విషయాన్ని చర్చించనున్నారు.

సోమవారం జరగనున్న వైస్‌ చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కౌన్సిలర్‌కే వైస్‌ చైర్మన్‌ పదవి దక్కించుకునే విధంగా అధికార పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. మారిన పరిణామాలు.. మున్సిపాలిటీలో మొత్తం 48 వార్డులు ఉన్నాయి. ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ ఒంటరిగా పోటీ చేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఒంటరిగా పోటీ చేసినా.. చైర్మన్‌ ఎన్నిక విషయంలో సహకరిస్తారని.. బీజేపీతో లోపాయికారి ఒప్పందంతో బరిలోకి దిగింది. టీడీపీ, సీపీఎం ఒంటరిగానే పోటీచేశాయి. కాగా మొత్తం వార్డుల్లో 20 వార్డులు అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ దక్కించుకోగా, కాంగ్రెస్‌ 20, బీజేపీ 6 వార్డులో విజయం సాధించగా, ఒక వార్డులో టీఆర్‌ఎస్‌ రెబల్‌ అభ్యర్థి విజయం సాధించగా, మరో వార్డులో ఎంఐఎం అభ్యర్థి విజయం గెలుపొందారు.

టీఆర్‌ఎస్‌ రెబల్‌ కౌన్సిలర్‌తోపాటు ఎంఐఎం కౌన్సిలర్‌ కూడా టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గుచూపారు. మున్సిపల్‌ చైర్మన్‌ స్థానాన్ని దక్కించుకోవాలంటే బీజేపీ కౌన్సిలర్లు కీలకమయ్యారు. ముందస్తు ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్, బీజేపీ కలిసి చైర్మన్‌ స్థానాన్ని దక్కించుకునేందుకు ప్రయత్నాలు చేశాయి. ఇరు పార్టీలు క్యాంపులు నిర్వహించాయి. అయితే అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ ఎక్స్‌అఫీషియో సభ్యులతో చైర్మన్‌ స్థానాలను కైవసం చేసుకునేందుకు ప్రయత్నాలు జరిపింది. కాగా అటు కాంగ్రెస్, బీజేపీ కౌన్సిలర్లు కలిపి, ఇటు టీఆర్‌ఎస్‌ కౌన్సిలర్లు, ఎక్స్‌అఫీషియో సభ్యుల సంఖ్య సమానం అయ్యే పరిస్థితులు కనిపించాయి. అయితే బీజేపీ కౌన్సిలర్లు కాంగ్రెస్‌కు కాకుండా టీఆర్‌ఎస్‌కే మద్దతు ఇచ్చే విధంగా ఆ పార్టీ నేతలు పావులు కదిపారు.

రాష్ట్రస్థాయిలోనే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరిపి మున్సిపల్‌ చైర్మన్‌ ఎన్నిక విషయంలో బీజేపీ కౌన్సిలర్లు తటస్థంగా ఉండేలా చూశారు. అయితే కాంగ్రెస్‌ ఇచ్చే వైస్‌ చైర్మన్‌ పదవిని తామే ఇస్తామంటూ స్థానిక బీజేపీ నాయత్వాన్ని ఒప్పించారు. దీంతో చైర్మన్‌ ఎన్నిక సందర్భంగా బీజేపీ కౌన్సిలర్లు తటస్థంగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ ఎక్స్‌అఫీషియో సభ్యుల బలంతో చైర్మన్‌ స్థానాన్ని దక్కించున్న విషయం తెలిసిందే.

ఆ తర్వాత వైస్‌ చైర్మన్‌ ఎన్నికను వాయిదా వేశారు. ప్రస్తుతం బీజేపీకి వైస్‌ చైర్మన్‌ పదవి ఇస్తేపార్టీకి నష్టం జరుగుతుందని టీఆర్‌ఎస్‌లోని కొందరు.. ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం బీజేపీకి వైస్‌ చైర్మన్‌ పదవిని ఇవ్వాలని మరికొందరు వాదన వినిపించారు. ఈ పరిస్థితిలో బీజేపీ వైస్‌ చైర్మన్‌ పదవి తీసుకునేందుకు సుముఖంగా లేదని ఆ పార్టీకి చెందిన నేతలే పేర్కొంటున్నారు. ఇటు టీఆర్‌ఎస్‌ బీజేపీకి ఇవ్వడం లేదని చెప్పుకుంటుండగా, బీజేపీ జిల్లాస్థాయి నేతలు కొందరు తమ పార్టీకి అవసరం లేదని పేర్కొంటూ వస్తున్నారు.

టీఆర్‌ఎస్‌లోనూ వైస్‌ చైర్మన్‌కు పోటీ
టీఆర్‌ఎస్‌ పార్టీలోనూ వైస్‌ చైర్మన్‌ పదవికి పోటీ పెరిగింది. చైర్మన్‌ రెడ్డి సామాజిక వర్గానికి ఇవ్వడంతో వైస్‌ చైర్మన్‌ పదవిని బీసీల్లోని పలువురు దక్కించుకునేందుకు పావులు కదుపుతున్నారు.

బీజేపీకి మొండిచెయ్యి...?
మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ పని రెంటికీ చెడ్డ రేవడయ్యింది. అటు కాంగ్రెస్‌తో కలిసిపోయి వైస్‌ చైర్మన్‌ దక్కించుకునే పరిస్థితి లేదు. టీఆర్‌ఎస్‌ అగ్రనాయకత్వం బీజేపీకి ఇవ్వకూడదని సూచించినట్లుగా జిల్లా నేతలు పేర్కొంటున్నారు. దీంతో వైస్‌ చైర్మన్‌ పదవి బీజేపీకి ఆశగానే మిగిలిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.

చదవండి: ఆ మాటలకు చాలా బాధపడ్డాను: కేజ్రీవాల్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement