శుక్రవారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో బీజేవైఎం మహాసమ్మేళనం ఏర్పాట్లను పరిశీలిస్తున్న లక్ష్మణ్, కిషన్‌రెడ్డి తదితరులు. పక్కన మహాసమ్మేళన వేదిక వద్ద ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: జాతీయస్థాయిలో భవిష్యత్తు కార్యాచరణ ఖరారు చేసేందుకు భారతీయ జనతా యువ మోర్చా (బీజేవైఎం) తొలిసారి హైదరాబాద్‌లో జాతీయ యువ సమ్మేళనం నిర్వహించనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇప్పటికే పూర్తి చేసింది. ‘విజయ్‌లక్ష్య 2019 యువ మహా ఆదివిశేషణ్’ పేరుతో సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో శని, ఆదివారాల్లో నిర్వహించనున్న ఈ సమ్మేళనాన్ని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ప్రారంభించనున్నారు. మూడేళ్లకోసారి నిర్వహించే ఈ సదస్సులో యువతకు ఉపాధి అవకాశాలు పెంచడం, నైపుణ్య కల్పనకు ప్రధాని మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు, యువతకు ఇస్తున్న ప్రాధాన్యాన్ని ఆయన వివరించనున్నారు.
తొలిరోజైన శనివారం ఉదయం 10 గంటలకు మొదలయ్యే సమావేశాల్లో రాజ్‌నాథ్‌తోపాటు అస్సాం ముఖ్యమంత్రి సర్వానంద సోనోవాల్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవిస్, త్రిపుర ముఖ్యమంత్రి విప్లవ్ కుమార్‌దేవ్, కేంద్ర రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ, కేంద్ర పెట్రోలియంశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్, రక్షణ మంత్రి నిర్మలా సీతారామన్, బీజేవైఎం జాతీయ అధ్యక్షురాలు పూనమ్ మహాజన్, పార్టీ జాతీయ, రాష్ట్ర నేతలు ప్రసంగించనున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈ సభలను హైదరాబాద్‌లో నిర్వహిస్తుండటంతో ఈ సమావేశాలకు రాజకీయ ప్రాధాన్యం ఏర్పడింది.
ఈ సమ్మేళనంలో పార్టీ రాజకీయ వ్యూహాల గురించి కూడా చర్చించే అవకాశం ఉంది. రాష్ట్రంలో పార్టీని అధికారంలోకి తేవాలన్న లక్ష్యంతో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఉన్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో సమ్మేళనం నిర్వహణకు చర్యలు చేపట్టారు. సమ్మేళనాన్ని తెలంగాణలో నిర్వహించడం ద్వారా పార్టీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపవచ్చని, ముఖ్యంగా యువతను పార్టీ వైపు ఎక్కువగా ఆకర్షించవచ్చని భావిస్తున్నారు. ఈ సమావేశాలకు దేశవ్యాప్తంగా 50 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నారు.
ఇక రెండో రోజైన ఆదివారం ముగింపు కార్యక్రమంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాతోపాటు రైల్వే మంత్రి పీయూష్ గోయల్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తదితరులు ప్రసంగించనున్నారు. అలాగే రెండో రోజు మధ్యాహ్నం భారీగా బైక్ ర్యాలీ నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 3 గంటలకు పరేడ్ గ్రౌండ్స్‌లోనే నిర్వహించే భారీ బహిరంగ సభలో అమిత్ షా ప్రసంగించనున్నారు. ఈ సభకు దాదాపు 2 లక్షల మంది పాల్గొంటారని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
యువతకు స్ఫూర్తినిచ్చేలా కార్యక్రమాలు: లక్ష్మణ్
రానున్న పార్లమెంటు ఎన్నికలకు యువత ను సమాయత్తం చేయడానికి ఈ మహాసభలు ఉపయోగపడతాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ తెలిపారు. యువతను మేల్కొలిపేలా, వారికి స్ఫూర్తినిచ్చేలా 2రోజుల కార్యక్రమాలు ఉంటాయన్నారు. మాజీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి, బీజేవైఎం నాయకులతో కలసి లక్ష్మణ్ శుక్ర వారం బీజేవైఎం సమ్మేళనం ఏర్పాట్లను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ ప్రధాని మోదీ అమలు చేస్తున్న అభివృద్ధి, ప్రజాకర్షక పథకాలను దేశవ్యాప్తంగా విస్తృతపరిచేలా భవిష్యత్తు కార్యాచరణ ఉంటుందన్నారు.
టీఆర్‌ఎస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామన్నారు. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశ యువత మోదీ నాయకత్వా న్ని నమ్ముతోందని, మోదీ అభివృద్ధిని, మార్గానిర్దేశకత్వం గురించి ఈ సభల్లో యువతకు వివరిస్తామని చెప్పారు. బీజేవైఎం సమావేశాలు నిర్వహించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. 2014లో మోదీ నిజాం కళాశాల నుంచి ఎన్నికల శంఖారావం పూరించారని, 2019 పార్లమెంట్ ఎన్నికలకు ఇక్కడినుంచే విజయభేరిని మోగించి విజయం అందుకుంటామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment