మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ
విజయనగరం , డెంకాడ: రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక జిల్లాకు ఒరిగింది శూన్యమని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. పార్టీ నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు ఆధ్వర్యంలో మోపాడ గ్రామంలోని ఓ లేఅవుట్‌లో డెంకాడ, భోగాపురం మండలాలకు చెందిన పార్టీ బూత్ కన్వీనర్లు, సభ్యులు, నాయకులకు శిక్షణ కార్యక్రమం బుధవారం జరిగింది. ముందుగా దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్ర మంత్రిగా అశోక్‌గజపతిరాజు, రాష్ట్ర మంత్రిగా మృణాళిని పని చేశారని, ఇప్పుడు రాష్ట్ర మంత్రిగా సుజయ్‌కృష్ణ రంగారావు పని చేస్తున్నారని వీరి హయాంలో జిల్లాలో ప్రజలు గుర్తించుకునే మంచి పని ఒక్కటి కూడా చేయలేదన్నారు. వీరంతా డొల్ల నాయకులన్నారు. భోగాపురం ఎయిపోర్టుకు అవసరాన్ని మించి భూములను సేకరించాలని చూసిందని, దీనిపై రాష్ట్ర ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రైతులకు మద్దతుగా భోగాపురం వచ్చి పోరాడటంతో భూ సేకరణను 18 వేల ఎకరాల నుంచి 2వేల 6 వందల ఎకరాలకు ప్రభుత్వం తగ్గించుకుందన్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబు మళ్లీ తనకు వచ్చిన గజకర్ణ, గోకర్ణ విద్యలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తాడని అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎన్నికల్లో బూత్ కన్వీనర్లు పాత్ర చాలా కీలకమన్నారు. అందరి ఓట్లు ఓటర్ల జాబితాల్లో ఉన్నాయో లేదో చూసి లేకపోతే చేర్పించాలన్నారు.
బూత్ కన్వీనర్ల పాత్ర కీలకం
ఎన్నికల గెలుపులో బూత్ కన్వీనర్లు పాత్ర చాలా కీలకమని వైఎస్సార్ సీపీ కేంద్ర పాలక మండలి సభ్యుడు పెనుమత్స సాంబశివరాజు అన్నారు. నెల్లిమర్ల నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లోని బూత్ కన్వీనర్లు చాలా అప్రమత్తంగా పని చేయాలన్నారు. ఓటర్ల జాబితాలను బూత్ కన్వీనరు చాలా జాగ్రత్తగా పరిశీలించాలని, కొన్ని చోట్ల ప్రతిపక్ష పార్టీకి చెందిన వారి ఓట్లను కూడా తొలగించారని వైఎస్సార్ సీపీ విజయనగరం పార్లమెంటరీ అధ్యక్షుడు బెల్లాన చంద్రశేఖర్ అన్నారు. ఇప్పటికే చేర్పులు, మార్పులకు సంబంధించిన ధరఖాస్తులను నాయకులకు అందించామన్నారు. అధికార టీడీపీ నాయకులు అధికారం కోసం అడ్డదారులు తొక్కే ప్రయత్నం చేస్తున్నారని, దీనిలో భాగంగా ఓట్లు తొలగింపు, మార్పులు వంటి అక్రమాలకు పాల్పడుతున్నారని, అందువలన బూత్ కన్వీనర్లు, సభ్యులు చాలా అప్రమత్తంగా ఉండాలని నెల్లిమర్ల నియోజకవర్గ సమన్వయకర్త బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు.
ప్రతీ కుటుంబాన్ని కలవాలి
ప్రతీ ఎన్నికల బూత్‌కి వైఎస్సార్‌సీపీ ఒక కన్వీనర్, పది మంది సభ్యులను నియమించిందని, వీరు ప్రతీ కుటుంబాన్ని కలిసి ఓటర్ల జాబితాల్లో ఓట్లు ఉన్నయో లేదో తెలుసుకోవడంతో పాటు నవరత్నాలు పథకాలను ప్రతీ ఇంటికీ వెళ్లి అందరికీ వివరించాలని కార్యక్రమం పరిశీలకుడు ఆదిత్య మనోహర్ అన్నారు. గతంలో ఇలాంటి వ్యవస్థ వైఎస్సార్ సీపీకి లేకపోవడం వలన ఎలాంటి నష్టం జరిగిందో వివరించారు. బూత్ కమిటీలు ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించాలన్న దానిపై తెలియజేశారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కార్యక్రమం పరిశీలకుడు బాబిరెడ్డి, నాయకులు అంబళ్ల శ్రీరాములనాయుడు, జెడ్పీటీసీ గదల సన్యాశినాయుడు, డెంకాడ, నెల్లిమర్ల, భోగాపురం, పూసపాటిరేగ మండలాల పార్టీ అధ్యక్షులు బంటుపల్లి వాసుదేవరావు, చనుమల్లు వెంకటరమణ, ఉప్పాడ సూర్యనారాయణ, పతివాడ అప్పలనాయుడు, డెంకాడ, భోగాపురం మండలాలకు చెందిన మాజీ సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, బూత్ కన్వీనర్లు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment