
సాక్షి, అమరావతి: కృష్ణానది కరకట్టపై గత తెలుగుదేశం ప్రభుత్వం ఎటువంటి అనుమతుల్లేకుండా ప్రజావేదికను అక్రమంగా నిర్మించిందని మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖల మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. అయినా అది ప్రభుత్వానిది కావడం, అన్ని వసతులుండడంతో అక్కడ కలెక్టర్ల సదస్సు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవడాన్ని టీడీపీ నాయకులు తప్పుపడుతూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో శనివారం దానికి సంబంధించి పూర్తి నివేదికను సీఆర్‌డీఏ ద్వారా ఆయన తెప్పించుకుని అందులో జరిగిన అవకతవకలను గుర్తించారు. వాటిని ‘సాక్షి’కి వివరిస్తూ.. కరకట్టపై సీఎం క్యాంపు కార్యాలయం వద్ద ప్రజావేదిక నిర్మాణానికి అనుమతివ్వడం సాధ్యంకాదని 2016 సెప్టెంబరు ఆరో తేదీన నీటిపారుదల శాఖ కృష్ణా సెంట్రల్ డివిజన్ చీఫ్ ఇంజినీర్ స్పష్టంచేసినట్లు తెలిపారు. ప్రతిపాదిత ప్రాంతం కృష్ణా నది కరకట్టపై ఉండడం, వరద ప్రభావిత ప్రాంతంగా ఉండడంతోపాటు కరకట్టపై నిర్మించిన నిర్మాణాలను తొలగించాలని లోకాయుక్త ఆదేశించిందని చెప్పారు. ప్రజావేదిక ప్లాన్‌కు సీఆర్‌డీఏగానీ, టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగం అనుమతిగానీ లేవని ధృవీకరించినట్లు మంత్రి తెలిపారు. ఎటువంటి అనుమతులు లేకపోయినా అప్పటి మున్సిపల్ మంత్రి నారాయణ నోటి మాటతో ఈ కట్టడాన్ని నిర్మించారని.. అది కూడా అంచనాలు భారీగా పెంచేశారని తెలిపారు. ఎన్‌సీసీ కంపెనీకి తొలుత రూ.4.34 కోట్ల అంచనాతో ఈ నిర్మాణ పని అప్పగించగా ఆ తర్వాత దాన్ని రూ.8.90 కోట్లకు పెంచేశారని, చివరికి రూ.7.59 కోట్లు నిర్మాణ కంపెనీకి చెల్లించారని తెలి¯పారు. ఇది కూడా అప్పటి మంత్రి నారాయణ నోటి మాటగా జరిగిందని తెలిపారు. ప్రజావేదిక నిర్మాణం ఏ రకంగా చూసినా అక్రమ నిర్మాణమేనని, దాని పక్కనే ఉన్న చంద్రబాబు నివాసం కూడా అక్రమమేనని బొత్స స్పష్టంచేశారు.
టీడీపీ రాద్ధాంతం సిగ్గుచేటు
ఈ అక్రమ నిర్మాణం గురించి టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. గత ప్రభుత్వం ప్రజావేదికను అక్రమంగా నిర్మించినా ప్రస్తుతానికి అన్ని వసతులతో అందుబాటులో ఉండడంవల్లే అక్కడ కలెక్టర్ల సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు చెప్పారు. గత ప్రభుత్వం మాదిరిగా వారి సామాజికవర్గానికి చెందిన వారి స్టార్ హోటళ్లలో కలెక్టర్ల సదస్సు నిర్వహించడంలేదని ప్రభుత్వానికి చెందిన భవనంలోనే నిర్వహిస్తున్నామని తెలిపారు. అంతకుముందు ఉండవల్లి వెళ్లి ప్రజావేదికను పరిశీలించిన మంత్రి బొత్స సత్యనారాయణ.. ప్రభుత్వ ధనంతో నిర్మించిన ప్రజావేదిక తమదంటూ టీడీపీ నేతలు గొడవ చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం మారినప్పుడు ప్రభుత్వ కార్యాలయాలు కొత్త ప్రభుత్వం అధీనంలోకి వస్తాయనే విషయాన్ని టీడీపీ నేతలు గుర్తించుకోవాలన్నారు. ప్రజావేదికలో సమావేశాలు నిర్వహించొద్దని టీడీపీ నేతలు అనడం సరికాదన్నారు. అది చంద్రబాబు డబ్బులతోనో లేక ఆయన తాత ఆస్తులతోనో కట్టింది కాదన్నారు. ప్రజావేదికపై అధికారులతో టీడీపీ నేతలు గొడవ పెట్టుకోవడం వారి విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. అధికారులపై దాడులు చేస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని బొత్స హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment