చిత్తూరు అర్బన్: చిత్తూరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలోపేతమవుతోంది. నియోజకవర్గంలో పార్టీ పటిష్టత కోసం రాజంపేట మాజీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి అనుసరిస్తున్న వ్యూహాలు కలిసి వస్తున్నాయి. ఇందులో భాగంగా చిత్తూరుకు చెందిన పలువురు టీడీపీ, స్వతంత్ర కార్పొరేటర్లు శుక్రవారం హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిసమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.
చేరికలు ఇలా..
రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘ కోర్ కమిటీ అధ్యక్షుడు బుల్లెట్ సురేష్, టీడీపీ నగర అధ్యక్షులు మాపాక్షి మోహన్, టీడీపీ కార్పొరేటర్లు ఆర్‌జి.శ్రీకాంత్ (1వ డివిజన్), ఏజి.సంపత్ (50వ డివిజన్), ఇ.ఇందు (27వ డివిజన్), చంద్రయ్య (13వ డివిజన్) వైఎస్సార్‌సీపీలో చేరారు. 20వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ రంజితంకు అనారోగ్యం కారణంగా ఆమె కుమారుడు ఇరువారం డేవిడ్, 42వ డివిజన్ టీడీపీ కార్పొరేటర్ ముత్తమ్మ తరఫున ఆమె తమ్ముడు ఆర్ముగం, స్వతంత్ర కార్పొరేటర్లు పి.నవీన్‌కుమార్ (2వ డివిజన్), ఎస్‌కె.పుష్పలత (35వ డివిజన్)లకు వైఎస్.జగన్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఇక చిత్తూరు మున్సిపల్ మాజీ చైర్మన్ భాస్కరన్, గుడిపాల మండలం కొత్తపల్లె ఎంపీటీసీ సభ్యురాలు రాజమ్మ తరఫున ఆమె కుమారుడు రాజ, రాసనపల్లె వైస్ ఎంపీపీ వేలాంగని తరఫున ఆమె భర్త రాసనపల్లె ప్రకాష్, కాంగ్రెస్ పార్టీ నగర మాజీ అధ్యక్షుడు కెపి.శ్రీధర్, దొడ్డిపల్లె మాజీ సర్పంచ్ దళవాయి శివకుమార్ తదితరులు సైతం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరిని వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో పార్టీ చిత్తూరు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లె శ్రీనివాసులు ఇతర నాయకులు అభినందించారు. టీడీపీ నేతలు ఆ పార్టీ సభ్యత్వానికి రాజీమానా చేసిన తర్వాతే వైఎస్సార్‌సీపీలో చేరడం పట్ల రాజకీయవేత్తలు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు.
టీడీపీ నేతల్లో ఆందోళన..
టీడీపీ నగర అధ్యక్షుడితో పాటు ఆరుగురు కార్పొరేటర్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో చిత్తూరు టీడీపీ నేతల్లో ఆందోళన మొదలయ్యింది. చిత్తూరు టీడీపీలో ఏకపక్ష ధోరణి ఒకే సామాజికవర్గానికి పదవులను కట్టబెట్టడం లాంటి అంశాలను పార్టీలోని సొంత నేతలే అంగీకరించడం లేదు. ఇటీవల విడుదలైన వ్యవసాయ శాఖ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో చైర్మన్, వైస్ చైర్మన్ పోస్టులు రెండూ ఒకే సామాజిక వర్గానికి కట్టబెడుతూ స్థానిక ప్రజాప్రతినిధి సిఫారసు చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి తరుణంలో బీసీ సామాజిక వర్గానికి చెందిన పార్టీ నగర అధ్యక్షుడితో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ కార్పొరేటర్లు వైఎస్సార్‌సీపీలోకి వెళ్లడం టీడీపీకి భారీ నష్టాన్ని చేకూర్చనుంది. పైగా తమిళ ఓటర్లను ప్రభావితం చేసే బుల్లెట్ సురేష్ పార్టీలోకి వెళ్లడం అధికార పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరికొందరు టీడీపీ నేతలు సైతం వైఎస్సార్‌సీపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారంటూ పార్టీలో చేరిన కార్పొరేటర్లు ప్రకటించడంతో చెదిరిపోతున్న క్యాడర్‌ను కాపాడుకోవడంతో పాటు వలసలు వెళ్లకుండా ఉండటానికి నానా తంటాలు పడుతున్నారు. అయితే వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిపై ప్రజల్లో రోజురోజుకూ పెరుగుతున్న ఆదరణ, ఇదే సమయంలో ప్రభుత్వ వ్యతిరేకత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కలిసొచ్చే అంశాలుగా మారుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment