ప్రజాసంకల్ప యాత్రంలో భాగంగా 2018 జనవరి 16న నగరి నియోజకవర్గం అమ్మగుంటలో వృద్ధులను ఆప్యాయంగా పలకరిస్తున్న వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి (ఫైల్)
నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. పాదయాత్రలో ప్రజలకిచ్చిన నవరత్నాల హామీల్లో అవ్వాతాతల పింఛన్ పెంపుపై మొదటి సంతకం చేశారు. రెండువేల పింఛన్‌ను రూ.2,250లకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై అవ్వాతాతలు హర్షం వ్యక్తంచేస్తున్నారు. తమ బతుకులకు భరోసా ఇచ్చే మనవడు వచ్చాడని ఆనందపడుతున్నారు.
చిత్తూరు అగ్రికల్చర్: అవ్వాతాతలకు కొండంత భరోసానిచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రమాణ స్వీకారం అనంతరం మొదటి సంతకం పింఛను పెంపుపై పెట్టడం పలువురిని ఆకట్టుకుంది. నవరత్న హామీల్లో వైఎస్సార్ పింఛన్ పెంపు పథకాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్లు ప్రకటించారు. ఆ పింఛను జూలై నెల నుంచి అందనుంది. ఏటా రూ.250 చొప్పున పెంచుకుంటూ వెళ్తామని, నాలుగేళ్లు వచ్చేసరికి ప్రతి అవ్వాతాతకు రూ.3 వేలు పింఛన్ వచ్చేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. పింఛన్ పెంపుతో జిల్లాలో మొత్తం 2,08,475 మంది వృద్ధులకు లబ్ధి చేకూరనుంది. దీనిపై సర్వాత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
జిల్లాలో సామాజిక పింఛన్లు పొందుతున్న వృద్ధులు 2,08,475 మంది ఉన్నారు. అవసాన దశలో అవ్వాతాతలు ఆర్థికపరంగా ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు పింఛన్ల మొత్తాన్ని పెంచుతామని ఎన్నికల సమయంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. ఈ అంశాన్ని నవరత్నాల్లో భాగం చేస్తూ మేనిఫెస్టోలో కూడా చేర్చారు. ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవిని చేపట్టిన వెంటనే అవ్వాతాతలకు భరోసా ఇస్తూ తొలి సంతకం చేశారు. వైఎస్సార్ పింఛన్ల కానుక కింద సామాజిక పింఛన్ల మొత్తాలను దశల వారీగా పెంచుకుంటూ పోతామని ప్రకటించారు. జూలై నుంచి∙ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తూ మొదటి ఏడాదిలో నెలకు రూ.250 పెంపుదల చేశారు. ప్రతి లబ్ధిదారునికీ నెలకు రూ.2,250 చొప్పున అందిస్తారు. రెండో ఏడాది నుంచి నాలుగేళ్ల వరకు ఏటా అదనంగా మరో రూ.250 చొప్పున పెంచుతారు. ఈ ప్రక్రియ ద్వారా నాలుగో ఏట నుంచి ప్రతి లబ్ధిదారునికీ నెలకు రూ.3 వేల చొప్పున పింఛను అందనుంది
లబ్ధి ఇలా..
సామాజిక పింఛన్లు పొందుతున్న 2,08,475 మంది వృద్ధులకు ఒక్కొక్కరికీ ప్రస్తుతం నెలకు రూ.2 వేలు మాత్రమే ప్రభుత్వం అందిస్తోంది. ఈ పింఛను పెంపుదల చేసి నెలకు రూ.3 వేలు అందించే విధంగా ప్రస్తుత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఏటా ప్రతి లబ్ధిదారునికి రూ.250 చొప్పున పెంచనుంది. జూలై నుంచి అమల్లోకి రానున్న ఈ విధానంతో జిల్లావ్యాప్తంగా లబ్ధిదారులకు ఈ ఏడాది నెలకు రూ.5.21 కోట్ల లబ్ధి చేకూరనుంది. రెండో ఏడాది నెలకు రూ.10.42 కోట్లు, మూడో ఏడాది నెలకు రూ.15.63 కోట్లు లబ్ధి చేకూరుతుంది. నాలుగో ఏడాది నుంచి ప్రతి నెలా రూ.20.84 కోట్ల మేరకు జిల్లాలోని వృద్ధులకు అదనంగా లబ్ధి చేకూరనుంది. దీంతో నాలుగో ఏట నుంచి ప్రతి వృద్ధునికి సామాజిక పింఛను ద్వారా నెలకు రూ.3 వేల చొప్పున ప్రభుత్వం అందిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment