
వి. విజయసాయిరెడ్డి
సాక్షి, న్యూఢిల్లీ: ప్రత్యేక హోదాపై సీఎం చంద్రబాబు రంగులు మారుస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి విమర్శించారు. సోమవారం ఆయన పార్లమెంట్ వెలుపల విలేకరులతో మాట్లాడారు. అవసరాన్ని బట్టి పూటకో మాట మార్చడం చంద్రబాబు నైజమని ఆరోపించారు. చంద్రబాబు రాజకీయ విన్యాసాలను ప్రజలంతా గమనిస్తున్నారని చెప్పారు. రాత్రికి రాత్రే ప్రెస్‌మీట్ పెట్టి అరుణ్ జైట్లీ ప్రకటనను స్వాగతించిన విషయాన్ని గుర్తుచేశారు.
నాలుగేళ్లుగా ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నది తామేనని తెలిపారు. అవిశ్వాసంపై చంద్రబాబు ఎలా మాట మార్చారో అందరికీ తెలుసునని అన్నారు. తన నీడను తానే నమ్మలేరని, లోకేశ్ కూడా ఆయన నమ్మడం లేదని.. అటువంటి వ్యక్తి ఏపీ ముఖ్యమంత్రి కావడం ప్రజల దురదృష్టమని వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే తమతో కలిసి రావాలన్నారు. వైఎస్సార్‌సీపీ ఎంపీలతో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి డిమాండ్ చేశారు.