
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి. విజయసాయిరెడ్డి
సాక్షి, తిరుపతి: తన వైఫల్యాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుపై రుద్దుతున్నారని వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి అన్నారు. ఏపీకి అన్యాయం జరుగుతున్నా నాలుగేళ్లపాటు మౌనంగా ఉన్న వ్యక్తి సీఎం చంద్రబాబు కాదా అని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే టీడీపీ ఎంపీలు పార్లమెంట్‌లో గొడవ చేశారని తెలిపారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో చంద్రబాబు ఎందుకు మాట్లాడటం లేదని ఆయన ప్రశ్నించారు.
చిత్తూరు జిల్లా తిరుపతిలో విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఏపీ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పోరాటం చేస్తూనే ఉన్నారని, కానీ అధికార టీడీపీ నేతలు మాత్రం తమ రాజకీయ లబ్ధి కోసమే పని చేస్తున్నారని మండిపడ్డారు. కేవలం పార్టీ ప్రయోజనాల కోసం పార్లమెంట్‌లో తాము కూడా పోరాడినట్లు టీడీపీ ఎంపీలు వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు. ఓ ఎంపీగా రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే క్రమంలో భాగంగా అందరినీ కలుస్తున్నామని, సీఎం చంద్రబాబు ప్రోత్సహిస్తున్న ఫిరాయింపులకు వ్యతిరేకంగా ఈసీని కలుస్తామని విజయసాయిరెడ్డి పేర్కొన్న విషయం తెలిసిందే.