దేశంలో ఫస్ట్‌.. దక్షిణాదిలోలాస్ట్‌! | Chandrababu comments on Narednra Modi | Sakshi
Sakshi News home page

దేశంలో ఫస్ట్‌.. దక్షిణాదిలోలాస్ట్‌!

Published Tue, Dec 25 2018 4:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Chandrababu comments on Narednra Modi - Sakshi

సాక్షి, అమరావతి : నాలుగేళ్లలో రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టామని, అయితే దక్షిణాదిలో మిగిలిన రాష్ట్రాల కంటే ఇప్పటికీ వెనుకబడ్డామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. వృద్ధి రేటులో మిగిలిన రాష్ట్రాలను అధిగమించి మొదటి స్థానంలో ఉన్నా తలసరి ఆదాయంలో వెనుకబడ్డామన్నారు. ఉండవల్లిలోని గ్రీవెన్స్‌ హాలులో సోమవారం సుపరిపాలన (గవర్నెన్స్‌)పై రెండో శ్వేతపత్రాన్ని ఆయన విడుదల చేశారు. ఈ సందర్భంగా అందులోని అంశాలను వివరించడంతోపాటు రాజకీయాలపైనా మాట్లాడారు. కాంగ్రెస్‌ను ఎన్టీఆర్‌ వ్యతిరేకిస్తే తాను ఇప్పుడు అదే పార్టీతో కలిశానని ప్రధాని మోడీ చేసిన విమర్శపై స్పందిస్తూ.. కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తే తప్పేమిటని ప్రశ్నించారు. కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీల్లో ఏదో ఒక పార్టీ వైపు ఉండాల్సిందేనని, ఈ రెండు కాకుండా కొత్త సృష్టి చేయలేమన్నారు. కేసీఆర్‌ ప్రతిపాదిస్తున్న ఫెడరల్‌ ఫ్రంట్‌ విఫలమవుతుందని చెబుతున్నారా అని అడిగిన ప్రశ్నకు తాను అలా అనడంలేదని సమాధానమిచ్చారు.

మమతా బెనర్జీని ఆయన కలవడం సాధారణమేనన్నారు. ధనిక పార్టీలన్నీ కూటమిగా ఏర్పాటయ్యాయని మోడీ చేసిన విమర్శపై మాట్లాడుతూ ఆయన పార్టీ కంటే సంపన్న పార్టీ మరొకటి ఉందా అన్నారు. టన్నుల కొద్ది డబ్బును దగ్గర పెట్టుకుని ఎన్నికల్లో ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. డబ్బుతో ఎన్నికల్లో ప్రజల్ని ప్రభావితం చేయాలనుకుంటున్నారని, ఈవీఎంలతో ప్రజాస్వామ్యాన్ని చిప్‌ మేనేజ్‌మెంట్‌ కంపెనీలకు అప్పగిస్తారా? అని ప్రశ్నించారు. దేశంలో అందరి కంటె ఎక్కువ అభివృద్ధి చేస్తున్నానని మోడీ తనను చూసి అసూయపడుతున్నారన్నారు. మోడీ హయాంలో స్వేచ్ఛ లేకుండా పోయిందని అన్నింటినీ ట్యాప్‌ చేస్తున్నారని, భార్యాభర్తలు మాట్లాడుకున్నా బయటకు తెలిసిపోయే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రధాన ప్రతిపక్షం ఆ పార్టీ పంచన చేరి అడుగడుగునా అడ్డంకులు కల్పిస్తోందని విమర్శించారు. 

పోలవరం నిర్మాణానికి నిధులివ్వడంలేదు
కేంద్రం పోలవరానికి నిధులివ్వడంలేదని, అందులో అవినీతి జరిగిందని ఆరోపణలు చేస్తున్నారని, అదే సమయంలో బాగా చేశామని అవార్డు ఇచ్చారని ఇదే తమ పనితీరుకు నిదర్శనమన్నారు. నిధుల్ని ఆపినా అవార్డులను ఆపలేకపోతున్నారన్నారు. పోలవరం ప్రాజెక్టుకు తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం చెప్పడంలో అర్థం లేదని, వాళ్లు ఎగువన కాళేశ్వరం కడితే దిగువన పోలవరం కడుతున్నామన్నారు. సుపరిపాలనతో దేశంలో అగ్రస్థానానికి వచ్చామని, దేశంలో ఏపీకి మించి సంక్షేమం ఇచ్చిన రాష్ట్రం మరొకటి లేదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు తుది దశకు వచ్చిందని, డిసెంబర్‌ కల్లా దాన్ని పూర్తి చేస్తామన్నారు. డ్యామ్‌కు గేటు పెట్టే కార్యక్రమాన్ని ప్రతిపక్షం ఎగతాళి చేస్తోందని, కడపలో స్టీల్‌ ప్లాంట్‌కు శంకుస్థాపన చేస్తామంటే రియల్‌ ఎస్టేట్‌ కోసం చేస్తున్నామంటున్నారని, వారికి కనీస జ్ఞానం లేదని విమర్శించారు. దేశ చరిత్రలో ఇంత త్వరగా పూర్తవుతున్న సాగునీటి ప్రాజెక్టు పోలవరమేనన్నారు. త్వరలో అన్ని వ్యవసాయ పంపుసెట్లను సోలార్‌ విద్యుత్‌కు మారుస్తామని, రైతులకు ఖర్చు లేకుండా అవసరమైన విద్యుత్‌ వాడుకుని మిగిలిన దాన్ని ప్రభుత్వానికి రూ.1.50లకు ఇస్తారని తెలిపారు. రాబోయే రోజుల్లో అన్ని వాహనాలను విద్యుత్‌కు మార్చి కాలుష్యం లేకుండా చేస్తామన్నారు. విజయవాడకు వచ్చిన వారు స్వచ్ఛమైన గాలి పీల్చుకుని సంతోషంగా ఫీలవుతున్నారని, అది తమ ఘనతన్నారు. తుపానులను కూడా అంచనా వేస్తున్నామని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement