చంద్రబాబు సరికొత్త కాపురం కాంగ్రెస్‌తో.. | Chandrababu Naidu And Rahul Gandhi Join Hands | Sakshi
Sakshi News home page

ఈ వీణకు శ్రుతి లేదు..

Published Fri, Nov 2 2018 2:44 AM | Last Updated on Fri, Nov 2 2018 8:08 AM

Chandrababu Naidu And Rahul Gandhi Join Hands - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  పరస్పరం బద్ధ శత్రువులైన అఖిల భారత కాంగ్రెస్‌ పార్టీ, తెలుగుదేశం పార్టీల పొత్తుకు రంగం సిద్ధమైంది. కాంగ్రెస్‌ పెత్తనాన్ని వ్యతిరేకిస్తూ పురుడు పోసుకున్న తెలుగుదేశం ఇప్పుడు అదే పార్టీతో కలిసి కాపురం చేసేందుకు సన్నద్ధమైంది. ఇన్నాళ్లూ నరనరాన జీర్ణించుకున్న కాంగ్రెస్‌ వ్యతిరేకతకు ఇక మంగళం పాడేయాలని తెలుగుదేశం నిర్ణయించుకుంది. గతంలో ఉన్న వైరుధ్యాలను మరిచిపోవాలని, ఇకపై కలిసి నడవాలని ఇరు పార్టీలు నిర్ణయానికొచ్చాయి.

తమ మధ్య గతాన్ని మరిచిపోయి, ఇద్దరం కలిసి పనిచేస్తామని కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సంయుక్తంగా ప్రకటించారు. చంద్రబాబు గురువారం ఢిల్లీలో రాహుల్‌ గాంధీని ఆయన నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా బాబు వెంట టీడీపీ ఎంపీలు, పలువురు రాష్ట్ర మంత్రులు, సీనియర్‌ నేతలు ఉన్నారు. రాహుల్‌ గాంధీతో పరిచయాలు అయ్యాక ఎంపీలు, మంత్రులు, ఇతర నేతలు బయటకు వచ్చేశారు. తర్వాత రాహుల్, చంద్రబాబు గంటకుపైగా ఏకాంతంగా భేటీ అయ్యారు. పలు కీలక అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. భేటీ తర్వాత రాహుల్, చంద్రబాబు కలిసి మీడియాతో మాట్లాడారు.  

దేశ రక్షణకు విపక్షాలన్నీ ఏకం కావాలి  
‘‘ప్రస్తుత పరిస్థితుల్లో దేశ భవిష్యత్తు కోసం మేం కలిసి పని చేయాలని నిర్ణయించుకున్నాం. గతంలో మా మధ్య చాలానే వైరుధ్యాలు ఉన్న మాట వాస్తవమే. దాన్ని మేం కూడా అంగీకరిస్తాం. ఎన్ని ఉన్నా ప్రస్తుతానికి పాత విషయాల జోలికి వెళ్లడం లేదు. వాటిని మరిచిపోయి కలిసి పనిచేయాలని నిర్ణయించాం. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. దేశ పరిరక్షణ కోసం విపక్షాలు అన్ని ఒక్కతాటిపైకి వచ్చి కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. దేశంలో రాజ్యాంగ వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది.


సమాజ్‌వాదీ పార్టీ నేత ములాయం సింగ్‌ యాదవ్‌, అఖిలేశ్‌తో చంద్రబాబు

యువతకు ఉపాధి లేదు. రాఫెల్‌ కుంభకోణంలో అనిల్‌ అంబానీకి రూ.30,000 కోట్లు దోచిపెట్టారు. ఈ పరిస్థితుల్లో దేశ రక్షణకు, ప్రజాస్వామ్య బలోపేతానికి అన్ని విపక్షాలు కలిసి పని చేయాలి. దానికి అనుగుణంగా చంద్రబాబు, నేను కలిసి పనిచేస్తాం. వచ్చే ఎన్నికల్లో బీజేపీని ఓడించే పనిలో పడతాం. ఇక విపక్షాల తరఫున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరుంటారన్నది ప్రస్తుతానికి అనవసరం. మీడియాకు దీనిపైనే ఆసక్తి ఎక్కువ. కానీ, మాకు మాత్రం దేశ రక్షణపైనే ఆసక్తి. ముందు బీజేపీకి వ్యతిరేకంగా అన్ని పక్షాలను ఏకంచేసి ముందుకెళ్లడంపై ప్రణాళికలు రచిస్తాం. వాటిని త్వరలోనే వెల్లడిస్తాం’’అని రాహుల్‌గాంధీ ఉద్ఘాటించారు.  

వ్యవస్థలను నాశనం చేశారు  
‘‘ఎన్డీయే ప్రభుత్వం దేశంలో వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోంది. దేశ రక్షణ కోసం రాహుల్‌ గాంధీ, నేను కలిసి పనిచేయాలని నిర్ణయించాం. అన్ని విపక్షాలను కలుపుకొనిపోతాం. దేశంలో ప్రస్తుతంæ సాగుతున్న అరాచక పరిపాలనను గతంలో ఎన్నడూ చూడలేదు. వ్యవస్థలను నాశనం చేశారు. సీబీఐ, ఈడీ, ఐటీ, ఆర్బీఐ, గవర్నర్ల వ్యవస్థ, సుప్రీంకోర్టు వ్యవస్థలను నాశనం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో అందరం కలసి పనిచేయాల్సిన అవసరం ఉంది. విపక్షాల ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరనేది ప్రస్తుతానికి అనవసరం. రాఫెల్‌ కుంభకోణాన్ని రాహుల్‌ గాంధీ ప్రజల్లోకి బాగా తీసుకెళ్లారు. దీనిపై మేము కూడా మాట్లాడుతున్నాం. బీజేపీయేతర పార్టీలను ఏకం చేసేందుకు ప్రయత్నిస్తాం. అన్ని పార్టీలతో చర్చించి, ఒక ఉమ్మడి సమావేశం ఏర్పాటు చేసి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందిస్తాం’’అని చంద్రబాబు నాయుడు వెల్లడించారు.

పవార్, ఫరూక్‌ కంటే చిన్నవాడినే.. 
నేషనలిస్టు కాంగ్రెస్‌ పార్టీ అధినేత శరద్‌ పవార్, జమ్మూకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి ఫరూక్‌ అబ్దుల్లా దేశంలో చాలా సీనియర్‌ నేతలని, తాను వారికంటే చిన్నవాడినేనని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఆయన గురువారం ఢిల్లీలో శరద్‌ పవార్, ఫరూక్‌ అబ్దుల్లాతో సమావేశమయ్యారు. అనంతరం ముగ్గురు నేతలు మీడియాతో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని విమర్శించారు. ఈ నేపథ్యంలో దేశాన్ని రక్షించేందుకు ఎన్డీయేయేతర పక్షాలను ఎలా కలుపుకొని ముందుకెళ్లాలన్న దానిపై చర్చించినట్టు తెలిపారు.


శరద్‌ పవార్‌, ఫరూఖ్‌ అబ్దుల్లాతో చంద్రబాబు

దీనిపై ఇంకా ప్రాథమిక స్థాయిలోనే చర్చలు జరిగాయని పేర్కొన్నారు. మున్ముందు బీజేపీకి వ్యతిరేకంగా అన్ని రాష్ట్రాల నాయకులతో మాట్లాడిన తరువాత భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామని, ప్రస్తుతానికి ఇంతకుమించి ఏమీ చర్చించలేదని శరద్‌ పవార్‌ వెల్లడించారు. భావసారూప్యం గల పార్టీలను ఏకం చేసేందుకు త్వరలో బీజేపీయేతర పక్షాలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామని, దానికి తాము ముగ్గురం కన్వీనర్లుగా ఉంటామని ఫరూక్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. ఇతర పార్టీలతో మాట్లాడే బాధ్యతను పవార్, ఫరూక్‌ తనకు అప్పగించారని చంద్రబాబు అన్నారు.

చంద్రబాబు మీడియాతో మాట్లాడేందుకు సిద్ధం కాగానే, తనకు ఫ్లైట్‌ టైం అయిందంటూ ఫరూక్‌ అబ్దుల్లా లేచి వెళ్లిపోయారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయంసింగ్‌ యాదవ్, ఉత్తరప్రదేశ్‌ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌లతో వారి నివాసంలో చంద్రబాబు సమావేశమయ్యారు. చంద్రబాబును బీజేపీ తిరుగుబాటు నేత అరుణ్‌ శౌరీ ఏపీ భవన్‌లో కలిశారు. అలాగే సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరితోనూ చంద్రబాబు సమావేశమయ్యారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement