సాక్షి ప్రతినిధి, అనంతపురం: మనోభావాలు దెబ్బ తినేలా, కుట్ర రాజకీయాలు చేస్తే వదిలే సమస్యే లేదని ప్రధాని మోదీని ఉద్దేశించి సీఎం చంద్రబాబు ఘాటు వ్యాఖ్యలు చేశారు. బుధవారం అనంతపురం జిల్లా పేరూరు డ్యాంకు నీళ్లిచ్చే కార్యక్రమానికి శంకుస్థాపన చేసేందుకు వచ్చిన ఆయన పేరూరులో గ్రామదర్శిని నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు.
నాకు రాజకీయాలు నేర్పిస్తారా?
‘నాకు మెచ్యూరిటీ లేదని ప్రధాని మోదీ విమర్శిస్తున్నారు. ఆయనకేదో ఉన్నట్లు! ఎక్కడికి పోతున్నామని అడుగుతున్నా. హుందాతనాన్ని కోల్పోయే స్థితికి వచ్చారు. నేనేదో వైఎస్సార్ సీపీ ట్రాప్‌లో పడ్డానని అంటున్నారు. బీజేపీ, ఎన్డీఏనే కుడితిలో పడ్డాయి. నా తర్వాతే వీరంతా రాజకీయాల్లోకి వచ్చారు. వీరందరికంటే ముందే నేనే ముఖ్యమంత్రిని అయ్యా. నాకు రాజకీయాలు నేర్పిస్తున్నారు.మీకు అవకాశాలొచ్చాయి. కేంద్రంలో ఉన్నారు. ప్రజాహితం కోసం పనిచేయండి. నిన్న కూడా ప్రధాని విమర్శించారు. నేనేదో హైదరాబాద్‌లోని ఆస్తులు కావాలనుకుంటున్నానని. ఇది వాస్తవం కాదు. హైదరాబాద్ కంటే భిన్నంగా ప్రపంచంలోని ఐదు అగ్రనిర్మాణాలో ఒకటిగా ఉండేలా రాజధానిని అభివృద్ధి చేస్తున్నాం. నేను అన్యాయంపై పోరాడుతున్నా. పోరాడాల్సి వస్తే నా తర్వాతే ఎవరైనా.
అవినీతి ప్రక్షాళన ఏమైంది?
స్విస్‌బ్యాంక్‌లోని నల్లధనం వెనక్కి తెచ్చి ఒక్కో ఖాతాలో రూ.15 లక్షలు చొప్పున వేస్తామని, అవినీతిని ప్రక్షాళన చేస్తామని 2014 ఎన్నికలకు ముందు మోదీ హామీ ఇచ్చారు. కానీ ఏం చేశారు? కర్నాటక ఎన్నికల్లో నేను ఇచ్చిన పిలుపుతో బీజేపీకి వ్యతిరేకంగా ఓటేశారు. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారంటే అది తెలుగువారికి తెలుగుగడ్డపై ఉన్న ప్రేమే కారణం.
జనసేన ఉందా?
జనసేన ఉందా? అని అడుగుతున్నా. నిజ నిర్ధారణ కమిటీ అన్నారు. ఏం చేశారు? కేంద్రంపై అవిశ్వాసం పెట్టండి, నేను అన్ని రాష్ట్రాల ఎంపీలను సమన్వయం చేసి కలుపుతానని పవన్ చెప్పారు. సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం నాకు తెలుసు. నాది యూటర్న్ అంటున్నారు. నాదే రైట్‌టర్న్! మీది యూటర్న్! ప్రత్యేకహోదా కచ్చితంగా సాధిస్తాం. ఇకపై వారానికి రెండు మూడురోజులు ప్రజల మధ్యలోనే ఉంటా’ అని చంద్రబాబు పేర్కొన్నారు. పేరూరుకు నీళ్లిచ్చే కాలువకు పరిటాల రవీంద్ర కాలువగా నామకరణం చేశారు. అంతకు ముందు చంద్రబాబు అంగన్‌వాడీ భవనాన్ని ప్రారంభించి గ్రామస్తులను కలుసుకున్నారు.
సెంట్రల్ వర్సిటీ వచ్చేదాకా వదలను!
అనంతపురం జిల్లాలో పర్యటన సందర్భంగా సీఎం చంద్రబాబు సెంట్రల్ యూనివర్సిటీ ఏర్పాటుపై అవగాహన లేకుండా మాట్లాడారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ‘సెంట్రల్ యూనివర్సిటీ ఇస్తామని ఇప్పటిదాకా సహకరించలేదు. యూనివర్సిటీ వచ్చేదాకా వదిలే సమస్యే లేదు. అనంతకు సెంట్రల్ యూనివర్సిటీ వచ్చి తీరుతుందని హామీ ఇస్తున్నా’ అని ప్రసంగంలో చంద్రబాబు చెప్పారు. అయితే అనంతపురానికి సెంట్రల్ యూనివర్సిటీ ఇప్పటికే మంజూరై జీవో కూడా వచ్చింది. ఈ ఏడాది నుంచే జేఎన్‌టీయూ ఇంక్యుబేషన్ సెంటర్‌లో తాత్కాలికంగా తరగతులు కూడా ప్రారంభం కానుండటం గమనార్హం.
నాలుగేళ్లవుతున్నా రుణమాఫీ కాలేదు
కనగానపల్లి: ‘నాలుగేళ్లు అవుతున్నా ఈ ప్రభుత్వంలో నాకు ఒక్క రూపాయి కూడా రుణమాఫీ కాలేదు. టీడీపీ కార్యకర్తనని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉంది’ అని సీఎం చంద్రబాబు ఎదుట టీడీపీ కార్యకర్త ఒకరు వాపోయారు. బుధవారం పేరూరులో గ్రామదర్శిని సందర్భంగా రైతులు, మహిళలతో సీఎం ముఖాముఖి కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.ప్రభుత్వ పథకాల ద్వారా అందరినీ సంతృప్తిపరుస్తున్నామని సీఎం అంటుండగా కుందుర్పి మండలం బెస్తరపల్లికి చెందిన రామాంజనేయులు అనే రైతు లేచి అభ్యంతరం తెలిపాడు. తనకు రూపాయి కూడా రుణమాఫీ కాలేదని, టీడీపీ కార్యకర్తనని చెప్పుకోవడానికి కూడా సిగ్గుగా ఉందనడంతో సీఎం జోక్యం చేసుకుంటూ భూ రికార్డులన్నీ సక్రమంగా ఉంటే కచ్చితంగా రుణమాఫీ వర్తిస్తుందని, దీన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. – చంద్రబాబు ఎదుట టీడీపీ కార్యకర్త ఆవేదన
కుట్ర రాజకీయాలు చేస్తే వదలం
Published Thu, Aug 2 2018 4:01 AM | Last Updated on Tue, Aug 21 2018 9:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment