'నా చురుకుదనం మరిచిపోవద్దు'
రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ పార్టీ తమ ప్రాంతంలో అడ్రసు లేకుండా పోతుందని ముందే ఊహించి ఎంతోకాలంగా కొనసాగుతున్న 'హస్తం' పార్టీకి హ్యాండిచ్చి సైకిల్ ఎక్కేశారు. అంతేవేగంగా పచ్చ పార్టీ ఎంపీ టిక్కెట్ అందుకుని ఎంపీ అయిపోయారు. అంతేనా జాతీయ స్థాయిలో ఆహార, వినియోగదారుల వ్యవహారాల స్థాయి సంఘం ఛైర్మన్గా నియమితులయ్యారు. అంతటితో ఆగకుండా కేంద్రమంత్రి పదవిపై కన్నేశారు... అందుకోసం తన ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇంతకీ నిన్నకాక మొన్న సైకిల్ ఎక్కి ఆగకుండా సవారీ చేస్తుంది ఎవరు అని అనుకుంటున్నారా ? ఆయనేనండి జేసీ దివాకర్ రెడ్డి.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో అనంతపురం లోక్సభ సభ్యుడిగా టీడీపీ తరపున బరిలోకి దిగి జేసీ దివాకర్ రెడ్డి విజయకేతనం ఎగరవేశారు. ఇప్పుడు కేంద్రమంత్రి కావాలని ఆయన తహతహలాడుతున్నారు. ఇటీవలే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని కూడా కలసి తన మనసులోని మాట అధినేత ముందుంచారు. పార్టీకి ఎంతో కాలంగా సేవ చేస్తున్న వారికి ప్రాధాన్యత ఇవ్వాలని జేసీకి బాబు వివరించారని సమాచారం. అయితే టీడీపీలోకి కొత్తగా వచ్చిన తమ పాత పార్టీ వారికి అత్యంత ప్రాధాన్యత పొస్ట్లు కట్టబెట్టారంటూ వారి జాబితాను బాబు ముందు జేసి ఉంచారు. అంతేకాకుండా జిల్లాలో మొత్తం 14 అసెంబ్లీ స్థానాల్లో 12 టీడీపీ రావడం వెనక తన చురుకుదనం మరిచిపోవద్దని బాబుకు జేసీ సూచించారట. దాంతో బాబుగారు కొద్దిగా డైలమాలో పడ్డారని సమాచారం.
అదికాక ప్రధానమంత్రిగా మోడీ బాధ్యతలు స్వీకరించి 100 రోజుల పాలన పూర్తి అయింది. మోడీ ప్రభుత్వం మరోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టనుందని వార్తలు వెల్లువెత్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర పదవి చాన్స్ కొట్టేయాలని జేసీ ప్రయత్నాలు చేస్తున్నారు. మోడీ కేబినెట్లో ఏపీకి ఒకే ఒక్క మంత్రి పదవిని దక్కింది. విజయనగరం జిల్లాకు చెందినఎంపీ అశోక్ గజపతి రాజు పౌర విమానయాశాఖను కట్టబెట్టారు. దాంతో రాయలసీమ కోటాలో తనకు కేంద్రమంత్రి పదవి ఇప్పించేందుకు బాబును ఒప్పించేందుకు టీడీపీ నేతలను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు జేసీ. పార్టీ మారిన వెంటనే తనకే కాకుండా తన తమ్ముడు జేసీ ప్రభాకర్ రెడ్డికి తాడిపత్రి అసెంబ్లీ టికెట్ ఇప్పించుకోవడంతోపాటు ఎమ్మెల్యేగా గెలిపించుకోవడంలో సఫలీకృతుడైన జేసీ... కేంద్రమంత్రి బెర్తు సాధిస్తారో, లేదో చూడాలి.