
విజయవాడ లీగల్ : నామినేషన్ వేసే సమయంలో రిటర్నింగ్ అధికారి వద్ద చేయాల్సిన ప్రమాణాన్ని సీఎం చంద్రబాబు శనివారం విజయవాడలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ యు.ఇందిరా ప్రియదర్శిని ఎదుట చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజవర్గం నుంచి పోటీ చేస్తున్న చంద్రబాబు.. శుక్రవారం అక్కడ తనవారితో నామినేషన్ దాఖలు చేయించారు. అయితే నామినేషన్ పత్రాలు సమర్పించే సమయంలో రిటర్నింగ్ అధికారుల వద్ద ప్రమాణం చేయాల్సి ఉంటుంది. ఎన్నికల ప్రచారంలో ఉన్నందున ఆయన శనివారం విజయవాడలోని 4వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరై ఈ ప్రమాణం చేశారు. ఈ ప్రమాణ పత్రాన్ని.. నామినేషన్ దాఖలు చేసిన 48 గంటల్లోగా రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుంది.
కరకట్టను ‘కర్ణాటక’ కట్టగా మార్చేసిన చంద్రబాబు
మేజిస్ట్రేట్ ముందు ప్రమాణం చేసేటప్పుడు చంద్రబాబు తన ఇంటి అడ్రస్ అయిన కరకట్టను కాస్తా ‘కర్ణాటక కట్ట’ అంటూ చదివారు. ఆ తర్వాత మళ్లీ సరిదిద్దుకొని కరకట్టగా పలికారు. ఈ సందర్భంలో కోర్టు హాల్‌లో ఉన్న న్యాయవాదులు, సిబ్బంది ఒక్కసారిగా నవ్వేశారు.