సాక్షి, అమరావతి : ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యే ఓటుకు రూ.5 కోట్లు ఆఫర్ ఇస్తూ ఆడియో వీడియో టేపులతో సహా అడ్డంగా దొరికిపోయిన సీఎంను ఈ దేశ చరిత్రలో ఇంతకుముందు ఎప్పుడైనా చూశారా? ఇంత అడ్డంగా దొరికిపోయినప్పటికీ వ్యవస్థలను మేనేజ్ చేస్తూ నిస్సిగ్గుగా పదవిని పట్టుకుని వేళ్లాడుతున్న బరితెగించిన ఓ వింతజీవిని ఈ ప్రపంచంలో ఇంతకుముందు ఎక్కడైనా ఎవరైనా చూశారా!? గోప్యంగా ఉంచాల్సిన రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్ సంస్థలకు అమ్ముకుని సాక్ష్యాలతో సహా దొరికిపోయిన ప్రభుత్వం గురించి ఇంతకుముందు ఎప్పుడైనా విన్నారా!? ఇలాంటి దిగజారుడు రాజకీయాల గురించి మన రాష్ట్రంలో ఇప్పుడు వింటున్నాం.. కళ్లారా చూస్తున్నాం.
కొండలాంటి తండ్రిని కోల్పోయిన యువకుడు... తన తండ్రి కోసం పగిలిన గుండెలను పలకరించదలిచాడు. అధిష్టానం ఒప్పుకోలేదు. అయినా మాట తప్పనన్నాడు. పార్టీ నుంచి వెళ్లగొట్టినా వెరవలేదు. ప్రజల కోసం మొండిగా నిలబడ్డాడు. ఈ యువకుడిని రాష్ట రాజకీయాల నుంచి తప్పిస్తే ఇక తమకు తిరుగుండదని భావించిన తెలుగుదేశం పార్టీ కాంగ్రెస్ పార్టీతో జత కలిసింది. కుట్రలకు తెరలేచింది. పుంఖానుపుంఖాలుగా తప్పుడు కేసులు బనాయించారు. అయినా ఆయన భయపడలేదు. ట్రక్కుల కొద్దీ న్యూస్ ప్రింట్‌పై విష ప్రచారాన్ని గుప్పించారు. ప్రేమించే ప్రజలపై, పూజించే దైవంపై భారం వేసి ఆ యువకుడు నిబ్బరంగా ముందుకే సాగాడు. ఆర్థిక మూలాలు నరకబోయారు. అయినా ధైర్యం వీడలేదు. కపటంతో హత్య చేయాలని చూశారు. అయినా ఎవరికీ తలవంచలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు మరోసారి పాత కథలకు సానబెట్టి మళ్లీ విష ప్రచార వ్వూహాలకు తెరతీస్తున్నారు. సర్వ శక్తిమంతురాలైన సోనియా గాంధీని ఇచ్చిన మాట కోసం ఎదిరించిన ధీరుడిపై అధికార టీడీపీ దుష్ప్రచారాన్ని ప్రారంభించింది. కేసుల భయంతో మోదీకి లొంగిపోయాడంటూ విష ప్రచారం సాగిస్తోంది. ఆరు మాసాల క్రితమే కదా జగన్ భార్య భారతి పేరును కూడా ఈడీ చార్జిషీట్‌లో చేర్చింది. నిజంగా లొంగిపోయి ఉంటే ఇలా జరుగుతుందా? ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్న వారైనా ఇలాంటి కారుకూతలు కూస్తారా!?
ఎన్నికలంటేనే హడలిపోతున్న ఏపీ సీఎం చంద్రబాబు మరో రాజకీయ కుట్రకు తెరతీస్తున్నారు. తన ప్రభుత్వంపై వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతతో బెంబేలెత్తుతున్న ఆయన ఈడీ, సీబీఐ వంటి సంస్థల్లో ఉన్న తమ అస్మదీయ అధికారులతో కలిసి మరో పన్నాగం పన్నారు. గతంలో టీడీపీ, కాంగ్రెస్ కలిసి కుట్ర చేసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై పెట్టించిన అక్రమ కేసులను ప్రధానాంశంగా చేసుకుని మరోసారి పెద్ద ఎత్తున అసత్య ప్రచారానికి ఒడిగట్టారు. వైఎస్ జగన్ ప్రధాని నరేంద్ర మోదీకి లొంగిపోయారనే దుష్ప్రచారాన్ని తెరపైకి తెచ్చారు. దాన్ని తన అనుకూల మీడియా ద్వారా వ్యాప్తిలోకి తెచ్చి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై బురద జల్లేందుకు ఉపక్రమించారు. రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించనుందని జాతీయ చానళ్ల సర్వేలు తేల్చి చెప్పడంతో బాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. ఆయనలోని అసలు మనిషి బయటికొస్తున్నాడు. దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజల్ని తప్పుదారి పట్టించాలన్నదే చంద్రబాబు అండ్ కో మొదలుపెట్టిన కుట్ర. ఈ మేరకు చంద్రబాబు, ఆయన అస్మదీయ అధికారులు, అనుకూల మీడియా పెద్దలు చర్చించుకుని ‘పచ్చ’కుట్రకు రూపకల్పన చేశారు. రానున్న కొద్ది రోజుల్లో రాష్ట్రంలో భారీ దుష్ప్రచారంతో ప్రజల్ని మోసగించాలన్న చంద్రబాబు కుట్ర ఇలా ఉంది.
ప్రజా వ్యతిరేకతతో బెంబేలు
తన ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత తీవ్రస్థాయిలో ఉందని గుర్తించిన చంద్రబాబు హడలిపోతున్నారు. గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం, ప్రత్యేక హోదా విషయంలో రాజీపడటం, రాజధాని నిర్మాణంలో వైఫల్యం, సంక్షేమ పథకాలు అమల్లో చేతులేత్తేయడం, యథేచ్ఛగా అవినీతి, అక్రమాలకు పాల్పడ్డ టీడీపీ ప్రభుత్వం అంటేనే ప్రజలు మండిపడుతున్నారు. దాంతో రాష్ట్రంలో చంద్రబాబు గ్రాఫ్ పూర్తిగా పడిపోయిందని ఇంటలిజెన్స్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. దీంతో తనకు అలవాటైన రీతిలో రాజకీయ కుట్రకు బాబు తెరతీశారు. తాము గతంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై చేసిన దుష్ప్రచార కుట్రను మరోసారి అమలు చేయాలని నిర్ణయించారు. ఎన్నికల సమయంలో ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు పకడ్బందీగా స్కెచ్ వేశారు.
మోదీకి లొంగిపోయారంటూ విష ప్రచారం
వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ పాలనపై మరోసారి తప్పుడు ప్రచారం, వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై తాము పెట్టించిన అక్రమ కేసుల్లో కదలిక అంటూ హడావుడి చేయడం.. ఆ కేసుల వల్లే ప్రధాని నరేంద్రమోదీకి జగన్ లొంగిపోయారనే దుష్ప్రచారాన్ని తీవ్రస్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పన్నాగం పన్నారు. జగన్‌పై గతంలో తాము పెట్టించిన అక్రమ కేసుల అంశాన్ని ప్రస్తావిస్తూ తమ మీడియాలో అసత్య ప్రచారంతో ఊదరగొట్టాలని నిర్ణయానికొచ్చారు. గతంలో ఈడీ సీబీఐకి రాసినట్లుగా చెబుతూ ఓ లేఖను హఠాత్తుగా టీడీపీ తెరపైకి తెచ్చింది. ఆ లేఖను టీడీపీ సోషల్ మీడియా విభాగం మంగళవారం రాత్రి నుంచి విస్తృతంగా ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఈ అసత్య ప్రచారాన్ని తమ రాజకీయ స్వార్థానికి అనుకూలంగా చేసుకుంటూ వై.ఎస్.జగన్‌పై విషం చిమ్మేందుకు పన్నాగం పన్నారు. జగన్‌పై నమోదైన కేసుల విచారణ అంశాలు 2017లోనే కేంద్రానికి చేరినట్లుగా ఓ కథను వినిపిస్తున్నారు. అందుకు భయపడే మోదీకి జగన్ లొంగిపోయారని ప్రజల్ని తప్పుదారి పట్టించాలని భావిస్తున్నారు. ఈ మేరకు తమ మీడియాలో నెలరోజుల పాటు అంటే ఎన్నికల వరకూ రోజుకో రీతిలో పెద్ద ఎత్తున తప్పుడు వార్తలతో ఊదరగొట్టాలన్నదే చంద్రబాబు పన్నాగమని స్పష్టమవుతోంది.
బీజేపీతో కలిసి కాపురం చేసింది బాబు కాదా?
వాస్తవానికి రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏమాత్రం వెరవకుండా ఆనాడు యూపీఏ ప్రభుత్వంతోనూ, ఈనాడు ఎన్టీయే ప్రభుత్వంతోనూ పోరాడుతోంది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే. రాష్ట్ర ప్రగతికి సంజీవని వంటి ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా జగన్ 2014 నుంచి ప్రజా ఉద్యమాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ప్రత్యేక హోదా సాధన కోసం కేంద్రాన్ని నిలదీస్తూ తమ ఎంపీలతో రాజీనామా చేయించారు. మోదీకి భయపడితే తమ ఎంపీలతో రాజీనామా చేయిస్తారా!? తెలంగాణలో ఓటుకు కోట్లు కేసులో ఇరుక్కున్న చంద్రబాబు హడావుడిగా హైదరాబాద్‌ను విడిచి అమరావతికి వచ్చేశారు. ఇక పోలవరం, రాజధాని నిర్మాణ పనుల్లో అక్రమాలు, అవినీతిపై కేంద్రం చర్యలు తీసుకుంటుందనే భయంతో ప్రత్యేక హోదా అంశాన్ని తాకట్టు పెట్టారు. కేంద్రంలో బీజేపీతో నాలుగేళ్లు కలిసి కాపురం చేశారు. అయినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఏనాడూ నోరు విప్పిన పాపానపోలేదు. తాజాగా రాష్ట్ర ప్రజల వ్యక్తిగత సమచారాన్ని ప్రైవేటు సంస్థలకు అమ్ముకుని మరోసారి అడ్డంగా దొరికిపోయారు. ఇక ఈడీ గానీ, సీబీఐ గానీ జగన్‌పై పెట్టిన అక్రమ కేసుల విచారణన ఏమాత్రం నెమ్మదించలేదు. జగన్ భార్య భారతికి కొన్ని నెలల క్రితమే ఈడీ నోటీసులు జారీ చేసింది. మోదీకి లొంగి ఉంటే జగన్ భార్యకు నోటీసులు వస్తాయా? ఆ వాస్తవాలను కప్పిపుచ్చుతూ జగన్ ప్రధాని మోదీకి లొంగిపోయారనే దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున తెరపైకి తేవాలని చంద్రబాబు నిర్ణయించారు.
ముసుగు తొలగించి లక్ష్మీనారాయణ టీడీపీలోకి...
జగన్‌పై దుష్ప్రచారాన్ని మరింత తీవ్రతరం చేసేందుకు చంద్రబాబు పన్నాగం పన్నారు. కాంగ్రెస్‌తో కుమ్మక్కై జగన్‌పై పెట్టించిన అక్రమ కేసుల విచారణలో తమ చేతిలో కీలుబొమ్మగా వ్యవహరించిన సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్(జేడీ) లక్ష్మీనారాయణను అధికారికంగా టీడీపీలోకి చేర్చుకోవాలని నిర్ణయించారు. జగన్ గురించి రాష్ట్రంలో తప్పుడు ప్రచారం చేయించడంలో చంద్రబాబుకు పూర్తిగా సహకరించింది లక్ష్మీనారాయణే. ఆ కేసుల విచారణలో ఆయన ఏమాత్రం నిబంధనలను పాటించలేదు. జగన్ నివాసంలో తనిఖీల పేరిట ఆయన చేసిన హడావుడి అంతా ఇంతా కాదు. గోరంత విషయాన్ని కొండంతలుగా చేసి టీడీపీ అనుకూల మీడియాకు లీకులిచ్చారు. నిబంధనల ప్రకారం సీబీఐ విచారణ అధికారులు మీడియాతో దర్యాప్తు అంశాలు వెల్లడించకూడదు. కానీ లక్ష్మీ నారాయణ మాత్రం టీడీపీ అనుకూల మీడియాతో రోజూ లెక్కలేనన్నిసార్లు మాట్లాడినట్లు ఆయన కాల్‌డేటా అప్పట్లోనే వెల్లడించింది. మరోవైపు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వైఎస్ జగన్ 16 నెలలు జైల్లో ఉండేలా లక్ష్మీనారాయణ చేయాల్సిందంతా చేశారు. బెయిల్ పిటిషన్ విచారణకు వస్తే అడ్డుకునేలా ఉద్దేశపూర్వకంగానే 13 చార్ట్‌షీట్లు వేశారు.
లక్ష్మీనారాయణ తన దర్యాప్తు సందర్భంగా కనీస నిబంధనలను పాటించలేదని అప్పట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన రమాకాంత్‌రెడ్డి కొంతకాలం క్రితం వెల్లడించడం గమనార్హం. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వంలో భాగస్వామి కాని...కనీసం 2004–09 మధ్య కాలంలో ప్రజాప్రతినిధి కాదు కదా కనీసం ఏనాడూ సెక్రటేరియట్‌కు కూడా రాని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఎలా అక్రమ కేసులు పెడతారని నిపుణులు ప్రశ్నించారు. అందుకు తగ్గట్టుగానే జగన్‌పై పెట్టిన అక్రమ కేసులు ఒక్కొక్కటిగా వీగిపోతుండటం ప్రాధాన్యం సంతరించుకుంది. టీడీపీ, కాంగ్రెస్ చేతుల్లో కీలుబొమ్మగా మారిన లక్ష్మీనారాయణ కుట్ర పూరితంగానే వ్యవహరించారని స్పష్టమవుతోంది. కానీ, ఆ కుట్రలనే ఆధారంగా చేసుకుని ప్రజల్ని తప్పుదారి పట్టించి టీడీపీ 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అనంతరం లక్ష్మీనారాయణతో చంద్రబాబు స్వచ్ఛందంగా పదవీ విరమణచేయించారు. కానీ నేరుగా ఆయన్ని టీడీపీలో చేర్చుకోకుండా వ్యూహాత్మకంగా వ్యవహరించారు. చంద్రబాబు డైరెక్షన్‌లోనే లక్ష్మీనారాయణ దాదాపు రెండేళ్లపాటు తటస్థ ముసుగు వేసుకుని రాష్ట్రంలో పర్యటించారు.
ఆహార్యం మార్చుకుని రైతుల కోసం పనిచేస్తానని చెబుతూ ప్రజల్ని ఏమార్చేందుకు యత్నించారు. అనంతరం లక్ష్మీనారాయణతో మరో రాజకీయ నాటకం చంద్రబాబు ఆడించారు. తాను రాజకీయ పార్టీ నెలకొల్పబోతున్నట్లు లక్ష్మీనారాయణ ఏడాది క్రితం ప్రకటించారు. కానీ నెలలు గడుస్తున్నా పార్టీ ఊసే ఎత్తలేదు. చివరికి కొన్ని నెలలక్రితం జయప్రకాశ్ నారాయణ నెలకొల్పిన లోక్‌సత్తా పార్టీకి లక్ష్మీనారాయణ ఇక నుంచి నాయకత్వం వహిస్తారని టీడీపీ అనుకూల మీడియాలో లీకులు ఇచ్చారు. అదీ కార్యరూపం దాల్చలేదు. ఇక త్వరలో ఎన్నికలు రానుండటంతో చంద్రబాబు అసలు విషయానికి వచ్చారు. లక్ష్మీ నారాయణ ముసుగు తొలగిస్తూ ఆయన్ని టీడీపీలోకి అధికారికంగా చేర్చుకోవాలని నిర్ణయించారు. కానీ, ఆ విషయాన్ని టీడీపీ నేరుగా ప్రకటించకుండా తమ అనుకూల మీడియాలో లీకులు ఇచ్చింది. ‘‘ఏదైనా ఎత్తుగడ వేస్తే ఆ విషయాన్ని మీడియా ద్వారా లీకులు ఇవ్వడం చంద్రబాబుకు అలవాటు.
దానిపై స్పందనను గమనించిన అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటారు’’అని రిటైర్డ్ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు గతంలోనే చంద్రబాబు నైజాన్ని వెల్లడించిన సంగతి తెలిసిందే. లక్ష్మీనారాయణను టీడీపీలో చేర్చుకునే విషయంలోనూ చంద్రబాబు అదే పంథా అనుసరించారు. లక్ష్మీనారాయణను టీడీపీలో అధికారికంగా చేర్చుకున్న అనంతరం ఆయనను మరోసారి ముందుంచి వైఎస్ జగన్‌పై విష ప్రచారం హోరెత్తించాలన్నది చంద్రబాబు ప్లాన్. అందుకు టీడీపీ అనుకూల మీడియా ఎలాగూ వంతపాడుతుందని బహిరంగ రహస్యమే. ఆ పన్నాగంలో భాగంగానే తాజాగా వైఎస్ జగన్ ప్రధానమంత్రి మోదీకి లొంగిపోయారనే దుష్ప్రచారాన్ని హఠాత్తుగా తెరపైకి తెచ్చారు. ఎన్నికలు ముగిసేంతవరకు అంటే దాదాపు నెలరోజులపాటు ఇదే అసత్య ప్రచారాన్ని పదేపదే ప్రచారం చేసి రాష్ట్ర ప్రజలను మోసగించాలన్నది చంద్రబాబు కుతంత్రం.
Comments
Please login to add a commentAdd a comment