సోమవారం ఉండవల్లి కరకట్ట వద్ద హంగామా చేస్తున్న టీడీపీ కార్యకర్తలకు చంద్రబాబు అభివాదం
సాక్షి, అమరావతి/విజయవాడ/జగ్గయ్యపేట/తాడేపల్లి: రెండు నెలల తర్వాత హైదరాబాద్ నుంచి ఏపీకి వచ్చిన ప్రతిపక్ష నేత చంద్రబాబు లాక్‌డౌన్ నిబంధనలు ఉల్లంఘించారు. రాష్ట్ర పోలీసు శాఖ ఇచ్చిన ప్రత్యేక అనుమతితో సోమవారం ఉదయం హైదరాబాద్‌లో బయలుదేరిన చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉండవల్లి లోని తమ నివాసానికి చేరుకున్నారు.
ఈ మార్గమధ్యంలో పలుచోట్ల టీడీపీ నాయకులు ఆయనకు స్వాగతం పలికేందుకు జనసమీకరణ చేశారు. ఎక్కడా నేతలు, కార్యకర్తలు మాస్క్‌లు పెట్టుకోకుండా, భౌతికదూరం పాటించకుండా హడావుడి చేయడంతో పోలీసులు వారిని నియంత్రించేందుకు ప్రయత్నించారు. అయినా టీడీపీ కేడర్ లెక్కచేయలేదు. తెలంగాణ స రిహద్దు దాటి ఏపీలోకి ప్రవేశించే గరిక పాడు చెక్‌పోస్టు వద్దకు మాజీ ఎమ్మెల్యే శ్రీ రాం తాతయ్య కార్యకర్తల్ని తరలించారు. నందిగామ, కంచికచర్లలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య, గొల్లపూడి సెంటర్‌లో దేవినేని ఉమ జనాలను సమీకరించారు. నిబంధనలకు విరుద్ధంగా ఆయా ప్రాంతాల్లో టీడీపీ జెండాలు పట్టుకుని మూకుమ్మడిగా అనేక మంది చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించారు. ఆయన కూడా కార్యకర్తల్ని వారించే ప్రయత్నం చేయలేదు.
హైకోర్టు జడ్జి కారుకు అడ్డంగా..
గుంటూరు జిల్లా ఉండవల్లిలో ఆయన నివాసం వద్దకు భారీగా కార్యకర్తలు చేరుకుని ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించారు. ఈ సమయంలో హైకోర్టు జడ్జి కాన్వాయ్‌కి కరకట్టపై బాబు కాన్వాయ్ అడ్డువచ్చింది. జడ్జి భద్రతా సిబ్బంది దారి క్లియర్ చేద్దామని ప్రయత్నించి విఫలమయ్యారు. న్యాయమూర్తి కారును పెనుమాక మీదుగా ఉండవల్లి మార్గంలోకి మళ్లించారు.
Comments
Please login to add a commentAdd a comment