
సాక్షి, కాకినాడ: ‘మాతో పెట్టుకుంటే ఫినిష్ అయిపోతారు. బయటకు వస్తే మిమ్మల్ని వదిలి పెట్టరు. మర్యాదగా ఉండు. చాలా సమస్యలు వస్తాయి’ అంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బహిరంగంగా మహిళను హెచ్చరించారు. కాకినాడలో తన కాన్వాయ్‌ను అడ్డుకున్న బీజేపీ నాయకులను చంద్రబాబు తీవ్రస్థాయిలో బెదిరించారు. మహిళ అని కూడా చూడకుండా బీజేపీ నాయకురాలికి పబ్లిగ్గా వార్నింగ్ ఇచ్చారు.
జన్మభూమి కార్యాక్రమంలో పాల్గొనేందుకు శుక్రవారం ఇక్కడకు వచ్చిన చంద్రబాబును బీజేపీ నాయకులు అడ్డుకున్నారు. మోదీ జిందాబాద్, చంద్రబాబు డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన చంద్రబాబు ముఖ్యమంత్రినన్న సంగతి మరిచిపోయి బెదిరింపులకు దిగారు. ‘లేనిపోని ప్రాబ్లమ్స్ తెచ్చి పెట్టుకోవద్దు. పెట్టుకుంటే మీరు ఫినిష్ అయిపోతారు. బయటకు వస్తే మిమ్మల్ని పబ్లిక్ వదిలి పెట్టరు. మర్యాదగా ఉండు. చాలా సమస్యలు వస్తాయి నీకు. వెళ్లమ్మా వెళ్లు’ అంటూ బీజేపీ మహిళా నేతను హెచ్చరించారు.
బీజేపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి అక్కడి నుంచి తీసుకెళ్లారు. సీఎం చంద్రబాబు వ్యవహారశైలిలో అందరూ ముక్కున వేలేసుకున్నారు. ఆయన గురించి తెలిసిన వారు మాత్రం చంద్రబాబు మారలేదని సరిపెట్టుకున్నారు. గతంలో ‘నాయీబ్రాహ్మణులను తోకలు కత్తిరిస్తా’ అంటూ ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సీఎం వ్యవహారశైలిని బీజేపీ నాయకులు తప్పుబట్టారు. మహిళా నాయకురాలు అని కూడా చూడకుండా బెదిరించడం సరికాదన్నారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే బెదిరిస్తారా అంటూ మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment