
కూకట్‌పల్లి రోడ్ షోలో చంద్రబాబు నాయుడు
సాక్షి, హైదరాబాద్ : గత 35 ఏళ్లుగా చెప్పిచెప్పి అలవాటైన మాట.. ‘కాంగ్రెస్‌ను ఓడించండి.. తరమికొట్టండి’ అని.. కొన్ని వేల సభలో చెప్పి ఉంటారు. ఇప్పుడు ఉన్న పలానా ఆ మాట మార్చాలంటే.. ఆ నాలుక సహకరించాలి కదా!.. ఎంత జాగ్రత్తపడినా ఫ్లోలో అలా అనుకోకుండా వచ్చేస్తోంది. తన రాజకీయ అవసరాల కోసం ఎంత దూరమైన వెళ్లడానికి సిద్దపడే వ్యక్తి చంద్రబాబు నాయుడు. పైగా ఎన్నికల్లో ఏనాడు ఒంటరిగా పోటీ చేసిన దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో బీజేపీ, జనసేనతో జతకట్టి.. కాంగ్రెస్ పార్టీని తిట్టని తిట్టు తిట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అదే కాంగ్రెస్‌తో కలిసి మహాకూటమి ఏర్పాటు చేశారు. వారి పక్కనే నిల్చొని టీఆర్‌ఎస్, బీజేపీలను పొట్టు పొట్టు తిడుతున్నారు.
అనూహ్యంగా నందమూరి కుటుంబాన్ని తెరపైకి తీసుకొచ్చిన చంద్రబాబు.. కూకట్‌పల్లి టికెట్‌ను దివంగత నేత నందమూరి హరికృష్ణ కూతురు సుహాసినికి కేటాయించారు. ఆమెను గెలిపించడానికి.. బావా, బామ్మర్ధులు (చంద్రబాబు.. బాలయ్య) తెగ కష్టపడుతున్నారు. నియోజకవర్గాల్లో రోడ్ షోలో పాల్గొంటూ.. సుహాసిని గెలుపు కోసం కృషి చేస్తున్నారు. అయితే శనివారం కూకట్‌పల్లిలో నిర్వహించిన రోడ్ షోలో చంద్రబాబు.. కాంగ్రెస్‌ను ఓడించాలని పిలుపునిచ్చారు. దీంతో అక్కడున్న కార్యకర్తలు, మహాకూటమి నేతలంతా షాక్‌కు గురయ్యారు. వెంటనే నాలుక కర్చుకున్న చంద్రబాబు బీజేపీ అని బుకాయించే ప్రయత్నం చేశారు. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. తెలంగాణ ఆపద్ధర్మ సీఎం కేసీఆర్ ఆదివారం చేవేళ్ల ప్రజాశీర్వాద సభలో చంద్రబాబును ఎద్దేవా చేస్తూ ఈ విషయాన్ని ప్రస్తావించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment