సాక్షి, తిరుపతి : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సొంత జిల్లాలో పోలీసుల అరాచకం శ్రుతిమించింది. దొంగ ఓట్ల నమోదును అడ్డుకుంటున్న ప్రతిపక్ష పార్టీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. దీంతో చిత్తూరు జిల్లా సత్యవేడు పోలీస్ స్టేషన్ వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్‌ను నిరసిస్తూ సోమవారం ఉదయం పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సత్యవీడు పోలీస్ స్టేషన్ వద్దకు తరలివచ్చి ఆందోళనకు దిగారు.
గత అర్థరాత్రి ఎమ్మెల్యే చెవిరెడ్డి సహా సుమారు 100మందిని పోలీసులు అరెస్ట్ చేసి, రాత్రంతా పలు ప్రాంతాల్లో తప్పి...చివరకు తెల్లవారుజామున సత్యవీడు పోలీస్ స్టేషన్ తరలించారు. అప్పటి నుంచి ఆయన పీఎస్‌లోనే ఆందోళన కొనసాగిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వ దుర్మార్గాలను ఎన్నికల సంఘం అధికారుల దృష్టికి తీసుకు వెళతామన్నారు. పోలీసుల వేధింపులకు తాము సిద్ధంగా ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. మంత్రి నారా లోకేష్ ప్రమేయంతోనే వైఎస్సార్ సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని చెవిరెడ్డి వ్యాఖ్యానించారు. ఎస్పీ భార్య చంద్రబాబు నాయుడు బంధువు అని, అందుకే ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగారన్నారు. అరెస్ట్ తర్వాత పోలీసులు తమిళనాడుతో పాటు చాలాచోట్ల వాహనంలో తిప్పారని, తన ఆరోగ్యం బాగోలేదని, బీపీ టాబ్లెట్ ఇవ్వాలని అడిగినా పోలీసులు ఇవ్వలేదన్నారు. అంతేకాకుండా తన భార్య, బిడ్డలతో ఫోన్ లో మాట్లాడేందుకు కూడా అనుమతి ఇవ్వలేదన్నారు.
పోలీస్ ట్రైనింగ్ సెంటర్ వద్ద గతరాత్రి ధర్నాకు దిగిన చెవిరెడ్డితో పాటు వందమందికి పైగా కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం వైఎస్సార్ సీపీ కార్యకర్తలను బంగారుపాళ్యం, గంగవరం, కార్వేటినగరం, గుడిపాల పోలీస్ స్టేషన్లకు తరలించారు. మరోవైపు ఎమ్మెల్యే చెవిరెడ్డితో పాటు మరో ఏడుగురిపై 143, 341, 353, 188తో పాటు రెడ్ విత్ 149 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. A1 చెవిరెడ్డి, A2గా చిత్తూరు ఇన్‌ఛార్జ్ అరణి శ్రీనివాసులు, A3 బాబురెడ్డి, A4 చిట్టి, A5 పురుషోత్తం, A6 జగదీష్, A7 నారాయణ, A8 కపిలేశ్వర్ రెడ్డిపై కేసులు నమోదు అయ్యాయి. (ఓట్ల దొంగలను వదిలేసి గ్రామస్థులపై పోలీసుల దాడి)
అయితే పోలీసుల వైఖరిని ఖండిస్తూ... చెవిరెడ్డిని ఎందుకు అరెస్ట్ చేశారంటూ పార్టీ నేతలు, కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు. చెవిరెడ్డి ఆరోగ్యం బాగోలేదని, మందుబిళ్లలు ఇవ్వకుండా పోలీసులు ఇబ్బంది పెడుతున్నారన్నారు. మరోవైపు పీఎస్ వద్దకు భారీగా వైఎస్‌ఆర్ సీపీ శ్రేణులను పోలీసులు అడ్డుకోవడంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. దాంతో పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతాల్లో 144 సెక్షన్‌ను విధించారు.
చెవిరెడ్డి అరెస్ట్ దారుణం...
చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అప్రజాస్వామికమని వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యే నారాయణ స‍్వామి వ్యాఖ్యానించారు. సోమవారం ఉదయం సత్యవీడు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్న ఆయనను లోనికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నారాయణ స్వామి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతోందని మండిపడ్డారు. పరిస్థితి చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే అనుమానం కలుగుతోందన్నారు. టెర్రరిస్టుల మాదిరిగా చెవిరెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమని, సర్వేల పేరుతో టీడీపీకి వ్యతిరేకంగా మాట్లాడినవారి ఓట్లు తొలగిస్తున్నారని నారాయణ స్వామి విమర్శించారు. ప్రశ్నించినవారిపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని ఆయన మండిపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment