సాక్షి, న్యూఢిల్లీ : బీజేపీ సీనియర్ నేత యశ్వంత్ సిన్హా సొంత పార్టీపై చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను కలకలం రేపుతున్నాయి. ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక కోసం ఆయన రాసిన ఓ కథనం ఇప్పుడు చర్చకు దారితీసింది. బీజేపీ ఆధ్వర్యంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల ద్వారా ఆర్థిక వ్యవస్థ మొత్తం నాశనం అయ్యిందంటూ ఆయన అందులో పేర్కొన్నారు.
‘ఐ నీడ్ టూ స్పీక్ అప్ నౌ’ పేరిట ఆయన రాసిన ఆర్టికల్‌లో కేంద్రం కీలకంగా భావించిన నోట్లరద్దు, జీఎస్టీలపైనే ప్రధానంగా విమర్శలు గుప్పించారు. ఆర్థిక వ్యవస్థను తన ప్రభుత్వమే నట్టేట ముంచిందని చెప్పుకొచ్చారు. కేంద్ర ఆర్థిక మంత్రి చేసిన తప్పులపై ఇప్పటికీ కూడా తాను స్పందించకపోతే భారతీయుడిగా తన ప్రాథమిక విధిని విస‍్మరించినట్లేనన్నారు. ప్రభుత్వం చేసిన తప్పిదం వల్ల సమీప భవిష్యత్తులో కోలుకోలేని పరిస్థితులు నెలకొన్నాయని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు.
అంతేకాదు జీడీపీ తగ్గిపోవటానికి సాంకేతిక కారణాలే కారణమన్న బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా వ్యాఖ్యలను యశ్వంత్ తప్పుబట్టారు. గతంలో తాము ప్రతిపక్షంలో ఉండగా దర్యాప్తు సంస్థల దాడులను ఖండించే వాళ్లమని ఆయన గుర్తు చేశారు. అధికారం అండతో ప్రత్యర్థులపైకి ఉసిగొల్పటం సరికాదంటూ ఆయన పరోక్షంగా ప్రభుత్వానికి సూచించారు. వాజ్‌పేయి హయాంలో యశ్వంత్ సిన్హా ఆర్థిక శాఖ మంత్రిగా విధులు నిర్వహించిన విషయం తెలిసిందే.
ఇక యశ్వంత్ రాసిన కథనంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఆర్థిక శాఖా మంత్రి పి. చిదంబరం ట్విట్టర్‌లో స్పందించారు. ‘ఆయన (యశ్వంత్) అధికారంలో ఉన్న వారి గురించి నిజం చెప్పారు. మరి ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారన్న ఆ నిజాన్ని అధికారం ఒప్పుకుంటుందా? అంటూ బీజేపీకి చురకలంటించారు. సొంత నేత చేసిన విమర్శలపై బీజేపీ ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.
Yashwant Sinha speaks Truth to Power. Will Power now admit the Truth that economy is sinking?
— P. Chidambaram (@PChidambaram_IN) September 27, 2017
ETERNAL TRUTH: No matter what Power does, ultimately Truth will prevail.
— P. Chidambaram (@PChidambaram_IN) September 27, 2017