
సాక్షి, అమరావతి : ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఈనెల 10వ తేదీన మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంతో ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం సమాలోచనలు ప్రారంభించారు. సీఎం కార్యదర్శి సాయిప్రసాద్, జీఏడీ పొలిటికల్ కార్యదర్శి శ్రీకాంత్‌తో ఆయన మంగళవారం తన చాంబర్‌లో భేటీ అయ్యారు. ఇదే విషయమై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి గోపాలకృష్ణ ద్వివేదితోనూ ఆయన భేటీ అయి సమాలోచనలు జరిపారు. ఈ నెల 10వ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు చేయాలంటూ సీఎస్‌కు ముఖ్యమంత్రి కార్యాలయం నోట్ పంపించిన సంగతి తెలిసిందే. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నప్పటికీ ఆ రోజు ఉదయం 10.35 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహణకు ఏర్పాట్లు చేయాలంటూ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ) నుంచి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ఎల్వీ సుబ్మహ్యణ్యంకు నోట్ వచ్చింది. దీనిని ఆయన సాధారణ పరిపాలన (పొలిటికల్) శాఖ కార్యదర్శి శ్రీకాంత్ నాగులాపల్లికి పంపించారు.
ఈ అంశం సచివాలయంలోని అఖిల భారత సర్వీసు (ఐఏఎస్) సీనియర్ అధికారుల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల నిబంధనావళి అమలులో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని సీఎం నిర్ణయించడం సహేతుకమేనా? అసలు ఈ సమావేశం జరుగుతుందా? జరగదా? అనే అంశాలు ప్రస్తుతం ఐఏఎస్‌ల మధ్య తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈనెల 10న కేబినెట్ సమావేశం జరుగుతుందా? జరగదా? అని సీనియర్ ఐఏఎస్ అధికారులను ‘సాక్షి’ సంప్రదించగా జరిగే అవకాశం లేనేలేదని కుండబద్దలు కొట్టారు. సీఎం తీసుకున్న నిర్ణయం సమంజసమైనది కాకపోవడం, నిబంధనలను పాటించకపోవడమే ఇందుకు కారణాలని వారు విశ్లేషిస్తున్నారు.