సాక్షి, న్యూఢిల్లీ: పౌరసత్వ (సవరణ) బిల్లుపై లోక్‌సభలో వాడీవేడి చర్చ జరిగింది. ప్రతిపక్షాలు, ఈశాన్య రాష్ట్రాల ఎంపీలు ఈ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తుండగా.. కేంద్ర హోంమంత్రి, బీజేపీ చీఫ్ అమిత్ షా మాత్రం పౌరసత్వ సవరణ బిల్లుకు మద్దతుగా తన వాదనను వినిపించారు. పౌరసత్వ సవరణ బిల్లుకు 130 కోట్ల మంది భారతీయుల మద్దతు ఉందని, 2014, 2019 లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని చేర్చిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ రెండు ఎన్నికల్లో బీజేపీ ఘనవిజయం సాధించింది.
దేశ విభజనకు కాంగ్రెస్ పార్టీయే కారణమని నిందించిన అమిత్ షా.. పౌరసత్వ సవరణ బిల్లుతో ఎవరికీ అన్యాయం జరగబోదని, ఈ బిల్లు మైనారిటీలకు వ్యతిరేకం కాదని అన్నారు. ఈ బిల్లు వెనుక ఎలాంటి రాజకీయాలు, అజెండా లేదని స్పష్టం చేశారు. ఈ బిల్లు ద్వారా నిజానికి మైనారిటీలు హక్కులు పొందుతారని, విదేశాల నుంచి దేశంలోకి శరణార్థులుగా వచ్చిన మైనారిటీలు హక్కులు పొందుతారని చెప్పారు.
మరోవైపు కాంగ్రెస్ నేత మనీష్ తివారీ పౌరసత్వ సవరణ బిల్లుపై ధ్వజమెత్తారు. ఈ బిల్లు అతి పెద్ద తప్పిదమని, ఈ అసమగ్ర బిల్లు కొన్ని వర్గాలపై వివక్ష చూపేలా ఉందన్నారు. ఆర్టికల్ 14, 15, 21, 25, 26లకు వ్యతిరేకంగా బిల్లు ఉందని, రాజ్యాంగంలోని సమానత్వ హక్కును ఈ బిల్లు కాలరాస్తుందని మండిపడ్డారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, అఫ్గానిస్తాన్‌లలో మత వివక్ష కారణంగా వలసవచ్చిన ముస్లిమేతరులకు పౌరసత్వం కల్పించేందుకు ఉద్దేశించిన పౌరసత్వ బిల్లును కేంద్రం తీసుకొచ్చిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment