సాక్షి, హైదరాబాద్: ‘జానాబాబా 40 దొంగలు’ అంటూ మంత్రి కె. తారక రామారావు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి సభలో చేసిన వ్యాఖ్యలపై సీఎల్పీ నేత జానారెడ్డి మండిపడ్డారు. కేటీఆర్‌కు కౌంటర్ ఇవ్వడం తన స్థాయికి తక్కువే అయినా మాట్లాడుతున్నానంటూ చురకలంటించారు. ‘అధికారగర్వంతో హేళన, కుసంస్కారంతో అర్థంపర్థంలేని సందర్భాల్లో మాట్లాడటం సరైంది కాదు’అని మంత్రికి హితవు పలికారు. తనకన్నా ఎక్కువ స్థాయి వాళ్ల గురించి మాట్లాడితే పెద్దవాడినయిపోతాననే భ్రమలో కేటీఆర్ ఉన్నారని జానారెడ్డి ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రజలకు కేటీఆర్ చేసిందేమీ లేకపోగా ఒక ముఠాను తయారు చేసుకొని ఊత పదాలతో ప్రజలను భ్రమింపజేస్తున్నారని విమర్శించారు.
గురువారం అసెంబ్లీ ప్రాంగణంలో విలేకరులతో జానా మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో సంస్కరణలకు తానే ఆద్యం పోశానన్నారు. లక్షా 70 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లిచ్చేలా చేశానని, ఇప్పుడు కేటీఆర్ ప్రారంభించిన పథకానికి కూడా తానే శంకుస్థాపన చేశానని గుర్తుచేశారు. పాలేరు కట్ట మీద వేసిన శిలాఫలకంపైనా తన పేరుంటుందని, కావాలంటే చూసుకోవచ్చన్నారు. ఎవరో ఇల్లు కట్టిన తర్వాత దానిపై పెంట్‌హౌస్ వేసి తామే ఇల్లంతా కట్టినట్లు టీఆర్‌ఎస్ నేతలు చెప్పుకుని తిరుగుతున్నారని, వారికి ప్రజలే బుద్ధి చెబుతారని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక్కసారి కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీఆర్‌ఎస్ ఖాళీ అవుతుందని జానా జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment