
సాక్షి, న్యూఢిల్లీ: రాజకీయ నాటకాల్లో ఏపీ సీఎం చంద్రబాబును మించినవారు ఎవరూ లేరని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ ఎద్దేవా చేశారు. సోమవారం ఢిల్లీలో ఆయన ఓ వార్తా ఏజెన్సీతో మాట్లాడుతూ సొంత మామకే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్రబాబుదని విమర్శించారు. ఇన్నేళ్లుగా రాజకీయ గిమ్మిక్కులు చేసిన చరిత్ర చంద్రబాబుదన్నారు. ఆంధ్రప్రదేశ్ డిమాండ్లపై తామెప్పుడూ సానుకూలంగా ఉన్నా చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ రాజకీయ నాటకాలు ఆడుతోందని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తామున్నామని రాంమాధవ్ పేర్కొన్నారు. ‘అవిశ్వాస తీర్మానానికి మేం భయపడడం లేదు. మాకు పార్లమెంటులో సరిపడా బలం ఉంది. ఏ చర్చకైనా మేం సిద్ధం. టీడీపీ నిర్ణయం కేవలం రాజకీయపరమైనది. మాతో చాలా ఏళ్లుగా కలిసి ఉన్నారు. మా భాగస్వాములుగా ఉన్నారు. కలిసి పనిచేశాం. అకస్మాత్తుగా వాళ్లు కొన్ని సెంటిమెంట్ అంశాలను లేవనెత్తుతూ అవిశ్వాస తీర్మానం తెచ్చారు. దీనికి వాళ్లే ఏపీ ప్రజలకు, దేశానికి వివరణ ఇవ్వాలి’ అని రాంమాధవ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలను కాపాడుతామని తెలిపారు. ‘హోదా కంటే ఎక్కువ ప్రయోజనాలను అందిస్తాం. కానీ టీడీపీ సెంటిమెంట్ పేరుతో డ్రామాలు ఆడుతోంది’ అని పేర్కొన్నారు.