సాక్షి, అమరావతి: కాల్‌మనీ సెక్స్ రాకెట్‌పై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని పోలీస్ ఉన్నతాధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ల రెండో రోజు సదస్సులో భాగంగా ఎస్పీలు, పోలీస్ ఉన్నతాధికారులనుద్దేశించి ఆయన ప్రసంగించారు. ‘కాల్‌మనీ సెక్స్ రాకెట్‌లో ఏ పార్టీవారున్నా విడిచిపెట్టొద్దు. పోలీస్ వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేయాలి. ఎవరికైనా ఫిర్యాదు అందితే వెంటనే చర్యలు తీసుకోవాలి. విజయవాడలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా దారుణం. ఈ రాకెట్‌లో వైఎస్సార్‌సీపీ వాళ్లు ఉన్నా సరే ఉపేక్షించొద్దు. ఈ సెక్స్ రాకెట్‌ను సమూలంగా నిర్మూలించండి.
బెల్ట్ షాప్స్ పూర్తిగా ఎత్తేయాల్సిందే..
అక్టోబర్ 1 నాటికి బెల్లుషాపులు పూర్తిగా ఎత్తేయాల్సిందే. సమాజానికి మంచే చేసే నిర్ణయాల అమల్లో త్వరగా అడుగులు ముందుకు పడాలి. జాతీయ రహదారుల వెంబడి మద్యం షాపులు ఉండవద్దు. దాబాల్లో మద్యం అమ్మకుండా చర్యలు తీసుకోవాలి. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలి. భద్రతా నిబంధనలు, నియమాలపై హోర్డింగ్‌లు పెట్టించాలి. జరిమానాలు విధించే ముందు అవగాహనకు పెద్దపీట వేయాలి. విజయవాడ ట్రాఫిక్ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలి. ట్రాఫిక్ సమస్యను తగ్గించడానికి సరైన ప్రణాళిక రూపొందించాలి. దీనిపై సబంధిత అధికారులతో సమావేశం ఏర్పాటుచేయండి. గంజాయి సాగుని పూర్తిగా నియంత్రించాలి. గంజాయి నిర్మూలన దిశగా ఆగస్టులో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించాలి. గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించి గంజాయి సాగు నుంచి దూరం చేయాలి.
పోలవరం నిర్వాసితుల కోసం..
పోలవరం నిర్వాసితుల సమస్య పై శాశ్వతంగా గ్రీవెన్సు సెల్ పెట్టాలని నిర్ణయించాం. ఒక ఐఏఎస్ అధికారిని ప్రత్యేకంగా ఇందుకోసం కేటాయించాం. నిర్వాసితుల ప్రతి సమస్యను వేగంగా పరిష్కరించాలి. పోలవరం అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్ట్. ఆర్థికంగా ఎలాంటి సహాయమైనా అందిస్తాం. పశ్చిమగోదావరి జిల్లాలో ఆక్వాసాగు వల్ల మంచి నీరు కలుషితం అవుతోంది. అలా జరగకుండా చర్యలు తీసుకోవాలి. కలెక్టర్, పంచాయతీరాజ్ శాఖలు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకోవాలి. ప్రజలకు తాగునీరు అందించలేకపోతే చాలా సమస్యలొస్తాయి’ అని వైఎస్ జగన్ అధికారులకు పలు సూచనలు చేశారు. (చదవండి: పాలకులం కాదు.. సేవకులం)
Comments
Please login to add a commentAdd a comment