మీ నాయకత్వంపై నమ్మకముంది | CM YS Jagan Comments at an all-party meeting hosted by PM Modi | Sakshi
Sakshi News home page

మీ నాయకత్వంపై నమ్మకముంది

Published Sat, Jun 20 2020 3:22 AM | Last Updated on Sat, Jun 20 2020 8:14 AM

CM YS Jagan Comments at an all-party meeting hosted by PM Modi - Sakshi

ఈ పరీక్షా సమయంలో, క్లిష్ట పరిస్థితుల్లో వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడిగానే కాదు.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ (ప్రధాని) వెనుక ఉంటాను. మా రాష్ట్రంలోని 6 కోట్ల మంది ప్రజలు కూడా మనస్ఫూర్తిగా మీకు మద్దతు తెలుపుతున్నారు. మీ సమర్థ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది.

ఈ పరీక్షా సమయాలను ఎదుర్కొని అన్ని సమస్యలనూ అధిగమించి భారత్‌ మరింత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాను. ఈ సంక్షోభ సమయంలో ఏ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నా మేము దానికి కట్టుబడి ఉంటాం. 

సాక్షి, అమరావతి: గాల్వాన్‌ లోయ వద్ద జూన్‌ 15న జరిగిన ఘటనలో మన దేశ సార్వభౌమాధికారాన్ని పరిరక్షించడానికి అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించిన సైనికులకు, వారి త్యాగాలకు మా రాష్ట్రం తరఫున సెల్యూట్‌ చేస్తున్నానని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. చైనాతో ఘర్షణల నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ శుక్రవారం ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నిర్వహించిన అఖిలపక్ష సమావేశంలో సీఎం మాట్లాడారు. 20 మంది వీర సైనికుల మరణం పట్ల తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తున్నానని, ఆ వీర సైనికులకు మా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని తెలిపారు. ‘మీ (పధాన మంత్రి మోదీ) సమర్థ నాయకత్వంపై మాకు పూర్తి నమ్మకం ఉంది. గాల్వాన్‌ సంక్షోభంలో ఈ దేశాన్ని మీరు సరైన మార్గంలో విజయవంతంగా నడిపిస్తారని నమ్ముతున్నాం’ అని సీఎం జగన్‌ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ముఖ్యమంత్రి ప్రసంగంలోని కీలక అంశాలు ఇలా ఉన్నాయి.

దేశ ప్రతిష్ట పెరిగింది
► ఇవ్వాళ్టి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులంతా భుజం భుజం కలిపి.. మరణించిన సైనికుల కుటుంబాలకు అండగా నిలవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుత అణ్వస్త్ర యుగంలో ప్రపంచం మారుతోంది. కేవలం సైన్యంతో మాత్రమే యుద్ధం చేయలేం. దౌత్యం, వ్యాపార, ఆర్థిక ఆంక్షలు, అంతర్జాతీయ ఒత్తిడి ద్వారా వివిధ రకాలుగా యుద్ధం చేయొచ్చు.
► ఈ ఘర్షణల్లో వారు ఆయుధాలను వాడలేదు. అలాగే అటువైపున కూడా సైనిక నష్టం జరిగిందనే వాస్తవాన్ని గుర్తించుకోవాలి. 2014 నుంచి అంతర్జాతీయంగా మన దేశ గౌరవం, ప్రతిష్ట ఇనుమడించిందనే విషయాన్ని ఈ అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న నాయకులు అంతా అంగీకరిస్తారనే అనుకుంటున్నా. 
► భారత్‌ను ఆర్థికంగా, దౌత్యపరంగా శక్తివంతమైన దేశంగా తీర్చి దిద్దడానికి మోదీ కృషి చేశారు. విశ్వ వ్యాప్తంగా మన దేశ ప్రతిష్టలు పెరిగాయి.
ప్రధాని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న సీఎం వైఎస్‌ జగన్, వివిధ పార్టీల నేతలు 

బలమైన దేశంగా భారత్‌
► ప్రధాని వివిధ దేశాల్లో విస్తృత పర్యటనల ద్వారా, వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా అంతర్జాతీయంగా సంబంధాలు మరింత బలపడ్డాయి. ప్రధాని మోదీ భారత్‌ను ముందు వరుసలో నడిపించారు. ప్రపంచ వ్యాప్తంగా బలమైన దేశంగా నిలిచిన భారత్‌ ఇతర దేశాలకు దారి చూపించింది. 
► ప్రధాని విజయవంతమైన విదేశీ విధానాల ద్వారా 3 రకాల ఇంటర్నేషనల్‌ కంట్రోల్‌ రిజైమ్స్‌లో భారత్‌ చోటు సాధించింది. దీని వల్ల అంతర్జాతీయంగా ప్రాముఖ్యత సాధించాం. క్షిపణులు – జీవ రసాయన ఆయుధాలు – ఆయుధాలు, వెసెనర్‌ అగ్రిమెంట్, ఆస్ట్రేలియా గ్రూపుల్లో భారత్‌ చోటు సాధించింది. 
► 192 సభ్య దేశాలున్న ఐక్యరాజ్య సమితిలో భారత్‌ 184 మంది సభ్యుల మద్దతుతో ఐక్యరాజ్యసమితి, భద్రతామండలిలో సభ్యదేశంగా ఎంపికైంది. గ్లోబల్‌ స్టేట్స్‌మన్‌గా ప్రధానమంత్రి చూపిన అసాధారణ నైపుణ్యం వల్లనే ఈ చిరస్మరణీయమైన విజయాలు సాధ్యమయ్యాయి. 

సమస్యకు పరిష్కారం కనుక్కుంటారని విశ్వసిస్తున్నాం
► ఈ అసాధారణ విజయాలు పలువురికి కంటగింపుగా మారాయి. పరోక్ష శక్తుల ద్వారా దేశాన్ని అస్థిర పరచాలని ప్రయత్నించారు. ఇన్ని శక్తులు మనకు వ్యతిరేకంగా పని చేస్తున్నప్పటికీ ప్రధాని సమర్థమైన నాయకత్వంలో విజయం సాధించి ముందుకెళ్తున్నాం.
► పలు సమస్యలు ఉత్పన్నమైనప్పుడు ప్రధాని చాలా చురుగ్గా, వేగంగా స్పందించారు. పుల్వామా దాడి, డోక్లాం సమస్య వచ్చినప్పుడు ధైర్యంగా తీసుకున్న నిర్ణయాలు, మసూద్‌ అజర్‌ను అంతర్జాతీయ తీవ్రవాదిగా ప్రకటింప చేయడంతోపాటు, అంతర్జాతీయ న్యాయస్థానంలో కులభూషణ్‌ జాదవ్‌ కేసులో 15–1 ఓట్ల తేడాతో వచ్చిన తీర్పు.. మీ నాయకత్వ పటిమకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. 
► మీ సమర్థ నాయకత్వంలో దేశ భవిష్యత్తు భద్రంగా ఉంటుందని మేం గట్టిగా నమ్ముతున్నాం. గాల్వాన్‌ లోయలో చోటు చేసుకుంటున్న పరిణామాలను ఎప్పటికప్పుడు నేను నిశితంగా గమనిస్తున్నాను. అక్కడ జరిగిన ఘటనలు, ఇరు దేశాల మధ్య సంబంధాలకు సంబంధించి, మా కంటే కేంద్రంలో ఉన్న వారికే బాగా తెలుసు కాబట్టి, ఈ విషయంలో మరింత లోతుగా వెళ్లదలచుకోలేదు. 
► ఈ పరిస్థితుల్లో ప్రధాని తన దార్శనికత, దౌత్య సంబంధాలను వినియోగించుకోవడం ద్వారా ఈ సమస్యలకు ఒక పరిష్కారం కనుక్కుంటారనే విశ్వాసంతో ఉన్నాం.
► ఈ పరీక్షా సమయాలను ఎదుర్కొని అన్ని సమస్యలనూ అధిగమించి భారత్‌ మరింత శక్తివంతమైన దేశంగా ఎదుగుతుందని గట్టిగా విశ్వసిస్తున్నాను. ఈ సంక్షోభం సమయంలో ఏ వ్యూహాత్మక నిర్ణయం తీసుకున్నా దానికి మేము కట్టుబడి ఉంటాం. 

ఘటనపై పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌
► రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ తొలుత ఘటన వివరాలను వివరించారు. విదేశాంగ శాఖ మంత్రి డా ఎస్‌.జయశంకర్‌ భారత్, చైనా సరిహద్దు వివరాల గురించి రాజకీయ పార్టీల నేతలకు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా తెలియజేశారు. కేంద్ర మంత్రి జయశంకర్‌ సరిహద్దు సమస్య పరిష్కారం కోసం దశాబ్దాలుగా జరుగుతున్న చర్చల గురించి, ఇదివరకు కుదిరిన ఒప్పందాల్లోని కీలక అంశాల గురించి  వివరించారు. 
► 1950–60 మధ్య తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో జరిగిన ఘటనలు, సరిహద్దుల్లో మౌలిక సదుపాయాలు, రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణం వివరాలు, ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి జరుగుతున్న పరిణామాల గురించి జయశంకర్‌ వివరించారు. 
► వీడియో కాన్ఫరెన్స్‌లో 20 పార్టీల  ప్రతినిధులు మాట్లాడారు. వీడియో కాన్ఫరెన్స్‌ ప్రారంభించడానికి ముందు గాల్వాన్‌ లోయ వద్ద చైనాతో జరిగిన ఘర్షణలో ప్రాణాలు కోల్పోయిన వీర సైనికులకు ప్రధాని, వివిధ పార్టీల నేతలు నివాళులు అర్పించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement