ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగింది ? | Cold War Between Jogu Ramanna And Soyam Bapurao In Adilabad | Sakshi
Sakshi News home page

ఈ ఇద్దరి మధ్య అసలేం జరిగింది ?

Published Sun, Nov 3 2019 7:29 AM | Last Updated on Sun, Nov 3 2019 7:31 AM

Cold War Between Jogu Ramanna And Soyam Bapurao In Adilabad - Sakshi

సాక్షి, ఆదిలాబాద్‌ : ఈ ఇరువురు ప్రజాప్రతినిధుల మధ్య ప్రస్తుత వైరం రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. భిన్న సిద్ధాంతాలు ఉన్న వేర్వేరు పార్టీలకు చెందిన నేతలు కావడంతో సహజంగానే పార్టీల పరంగా చోటుచేసుకున్న విభేదాలా అన్న అనుమానాలు ఉన్నా అటువంటిది కాదనేది వారి మాటలను బట్టే స్పష్టమైంది. ఇరువురు నేతలు ఇటీవల ఐటీడీఏ పాలకవర్గ సమావేశం సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ.. తమకు వ్యక్తిగతంగా ఎలాంటి పొరపొచ్చాలు లేవని స్పష్టం చేశారు. అయినా మాటల యుద్ధం మాత్రం ఆగడం లేదు. దీంతో ఈ రచ్చకు ఆజ్యం ఏమై ఉంటుందోనని అందరిని తొలుస్తుంది.

కొనసాగుతున్న పర్వం..
గత నెల వివిధ వేదికల ద్వారా ఈ ఇరువురు నేతలు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకోవడం ద్వారా మొదలైన పర్వం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలు వేర్వేరుగా ప్రెస్‌మీట్‌లు పెట్టి మరీ ఒకరి వ్యాఖ్యలను మరొకరు ఖండిస్తూ నిరంతరంగా వ్యవహారం సాగుతోంది. అయితే ఇరువురు నేతల ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. బీసీ సంక్షేమశాఖ మంత్రిగా జోగు రామన్న ఉన్న సమయంలో ఆ శాఖకు రూ.వెయ్యి కోట్లు కేటాయింపులు ఉండగా, పూర్తిస్థాయిలో ఖర్చు చేసినట్లు నిరూపిస్తే తాను ముక్కు నేలకు రాస్తానని సోయం బాపురావు సవాల్‌ విసిరారు. సోయం బాపురావు తాను గెలిచిన వెంటనే ఢిల్లీకి వెళ్లి సంతకం పెడితే ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించడం జరుగుతుందని చెప్పడం జరిగిందని, ఇప్పుడు నెలలు దాటినా తాను ఎందుకు ఆ పని చేయలేకపోతున్నారంటూ ఎమ్మెల్యే జోగు రామన్న ప్రతిసవాల్‌ విసిరారు. ఇలా ఈ ఇద్దరు నేతలు ఒకరిపై మరొకరు ఆరోపణలు సంధించుకోవడం గమనార్హం. 

ఆజ్యం ఎక్కడ?
ఆదివాసీలను తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఎంపీ సోయం బాపురావు తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తుండగా, ఎస్టీ జాబితా నుంచి లంబాడీల తొలగింపు విషయంలో బీజేపీ రాష్ట్ర నేతలతో చెప్పిస్తే తన పదవికి రాజీనామా చేస్తానంటూ రామన్న పేర్కొనడం గమనార్హం. అయితే ఈ ఇరువురు నేతల మధ్య ఇంతటి రగడకు ఆజ్యం ఎక్కడ పడిందన్న సందేహం ఇరు పార్టీల నాయకులు, కార్యకర్తలను తొలుస్తుంది. తొలుత ఆగస్టు చివరిలో జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశంలో వీరిద్దరి మధ్య మాటల యుద్ధం కనబడింది.

అయితే అది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న కిసాన్‌ సమ్మాన్, రైతుబంధు విషయంలో కొనసాగడంతో అది ప్రభుత్వాల పరంగా సమావేశంలో వాడివేడిగా చర్చ జరిగిందన్న అభిప్రాయం వ్యక్తమైంది. అక్కడ విభేదాల స్థాయి అంతగా కనిపించలేదు. అంతకు ముందు స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత టీఆర్‌ఎస్‌ 9 జెడ్పీటీసీలను గెలవడం, బీజేపీ 5, కాంగ్రెస్‌ 3 స్థానాల్లో గెలవడం అప్పట్లో ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ క్రమంలో 17 జెడ్పీటీసీల్లో 9 మంది మెజార్టీ ఉన్న టీఆర్‌ఎస్‌ జెడ్పీ చైర్మన్‌ పదవిని కైవసం చేసుకోవడం ఖాయమే అయినా అనూహ్యంగా బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యులు జత కట్టడం ఆసక్తి కలిగించింది. దీనికి ఎంపీ సోయం బాపురావు నేతృత్వం వహించారు.

ఇక టీఆర్‌ఎస్‌ నుంచి ఎవరినైన ఒకరిని ఇటువైపు తిప్పుకుంటే పరిణామాలు వేరుగా ఉంటాయన్న రాజకీయ వేడి జెడ్పీచైర్మన్‌ ఎన్నిక రోజు కనిపించింది. అయితే ఈ వ్యవహారంలో ముందు జాగ్రత్త పడ్డ టీఆర్‌ఎస్‌ ముఖ్యంగా ఎమ్మెల్యే జోగు రామన్న, బోథ్‌ ఎమ్మెల్యే రాథోడ్‌ బాపురావులు ఉట్నూర్‌ కాంగ్రెస్‌ జెడ్పీటీసీ చారులతను టీఆర్‌ఎస్‌ వైపు తిప్పుకున్నారు. జెడ్పీచైర్మన్‌ ఎన్నికలో చారులత టీఆర్‌ఎస్‌కు మద్దతిచ్చారు. బీజేపీ నుంచి ఆదివాసీ అభ్యర్థిని జెడ్పీచైర్మన్‌ పదవి కోసం పేరు ప్రతిపాదించాక  ఈ వ్యవహారం చోటుచేసుకుంది. ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే జోగు రామన్నకు విభేదాలు అప్పటి నుంచే పొడసూపాయా అన్న అభిప్రాయం వ్యక్తమైనా ఆ సమావేశం చివరిలో ఇరువురు నేతలు కలిసి నవ్వుతూ మాట్లాడుకోవడం ఆసక్తి కలిగించింది. 

పట్టున్న నేతలే..
ఈ నేతల రాజకీయ అనుభవాన్ని పరిశీలించినా ఇరువురు పట్టున్న నేతలే. ఎంపీ సోయం బాపురావు ఆదివాసీ ఉద్యమం పరంగా తన జాతి కోసం పోరాటం చేస్తూ ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే డిమాండ్‌కు కట్టుబడి ఉన్నారు. అదేవిధంగా గతంలో బోథ్‌ ఎమ్మెల్యేగా ఆయన వ్యవహరించారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలను చూశారు. ఇక ఎమ్మెల్యే జోగు రామన్న బీసీల ఆదరణతో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో పట్టు కలిగి ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పూర్తిస్థాయిలో మంత్రిగా పనిచేశారు.

రాజకీయ అడుగులకు విరోధం కావడంతో ఇరువురి మధ్య ఈ విభేదాలు తలెత్తాయా.. లేదంటే మరేమైనా అయి ఉంటుందా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. అదే సమయంలో కేంద్రం నక్సల్‌ బాధిత జిల్లాలకు ఇచ్చే నిధులను మళ్లించారని జోగు రామన్నతోపాటు మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి, ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌పై కూడా సోయం బాపురావు విమర్శలు సంధించారు. అలాంటప్పుడు నిధుల మళ్లింపు విషయంలో ఈ విభేదాలా.. లేనిపక్షంలో సామాజిక కోణంలో హక్కులు, నిధుల విషయంలో ఒకరిపై మరొకరి ఆరోపణలు అగ్నికి ఆజ్యం పోసిందా? అన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా మున్సిపల్‌ ఎన్నికల ముందు టీఆర్‌ఎస్, బీజేపీ పార్టీల్లో ఇది రాజకీయ వేడి పుట్టిస్తోంది.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement