సిటింగులకు ఫిటింగ్‌! | Conflicts in Chittoor TDP Party | Sakshi
Sakshi News home page

సిటింగులకు ఫిటింగ్‌!

Published Wed, Jan 30 2019 12:30 PM | Last Updated on Wed, Jan 30 2019 12:30 PM

Conflicts in Chittoor TDP Party - Sakshi

టీడీపీ ఎమ్మెల్యేల సిట్టింగ్‌ స్థానాల్లో భారీ మార్పులకు చంద్రబాబు కసరత్తు చేస్తున్నారు. ఎమ్మెల్యే పనితీరుపై జనంలో తీవ్ర అసంతృప్తి ఉందని తన సర్వేలో తేలిందని లీకులు ఇచ్చారు. దీంతో జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొందరు అధినేత తనయుడు లోకేష్‌ బాబును, మరి కొందరు టీడీపీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. వారు చెప్పిందల్లా చేస్తూ అక్రమంగా సంపాదించిన డబ్బులను ఖర్చు చేసుకుంటున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది.

సాక్షి, తిరుపతి: ఎన్నికల వేడి రాజుకుంటున్న నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికపై సీఎం చంద్రబాబు సమన్వయ కమిటీ, మంత్రివర్గ సభ్యులతో తరచూ సమీక్షలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఐవీఆర్‌ఎస్‌ (ఇంట్రాక్టివ్‌ వాయిస్‌ రెస్పాన్స్‌ సిస్టం) పేరుతో సర్వే చేపట్టారు. ఇంకో వైపు ఎప్పటికప్పుడు అనుచరుల ద్వారా ఎమ్మెల్యేలపై నివేదికలు తెప్పించుకునే పనిలో పడ్డారు.  మంత్రి అమరనాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సత్యప్రభ, సుగుణమ్మ, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, తలారి ఆదిత్య, శంకర్‌యాదవ్‌పై ప్రధానంగా దృష్టి సారించినట్లు విశ్వసనీయ సమాచారం.  ఏయే నియోజక వర్గాల్లో ఎవరికి తిరిగి టికెట్‌ ఇవ్వాలో తెలుసని, తనపై ఎవ్వరూ ఒత్తిడి చెయ్యవద్దని ఆయన తేల్చిచెప్పినట్లు ఎమ్మెల్యేలు తమ అనుచరుల వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది.

పలమనేరుపై మల్లగుల్లాలు
వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ గుర్తుపై గెలిచి స్వప్రయోజనాల కోసం టీడీపీ కండువా కప్పుకున్న అమర్‌నాథ్‌రెడ్డికి పలమనేరు కేటాయించాలా? వద్దా? అని చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. నియోజక వర్గ అభివృద్ధి కోసమే టీడీపీలో చేరానని చెప్పుకుని పచ్చకండువా కప్పుకున్న అమర్‌నాథ్‌రెడ్డి మంత్రి పదవి దక్కించుకున్నా పలమనేరుకు చేసిందేమీ లేదని తేలిపోయింది. నియోజక వర్గ ప్రజలు మంత్రిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఐవీఆర్‌ఎస్, తన సొంత సర్వేలోనూ ఇదే విషయం బయటపడడంతో చంద్రబాబు సందిగ్ధంలో పడ్డారని ప్రచారం జరుగుతోంది. పలమనేరులో స్థానిక సహకారం లేనందున పుంగనూరులో పోటీకి దింపాలనే యోచనలో ఉన్నట్టు తెలిసింది.  

చిత్తూరు ఎమ్మెల్యే సత్యప్రభ స్థానికులకు అందుబాటులో ఉండడం లేదని సర్వేలో బయటపడింది.  ఎమ్మెల్యేగా ఎన్నికైన నాటి నుంచి చిత్తూరుకు చేసిందేమీ లేదని జనం తీవ్ర     ఆగ్రహంగా ఉన్నట్లు తెలిసింది.
సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి అనారోగ్య కారణంతో ఈసారిటికెట్‌ ఇవ్వటం లేదని తేలిపోయింది. బొజ్జల గోపాలకృష్ణారెడ్డి భార్య బృందమ్మ, కుమారుడు సుధీర్‌రెడ్డి టికెట్‌ కోసం తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. వీరిపైనా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో మంచి అభిప్రాయం లేదని తేలటంతో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వైపు చంద్రబాబు మొగ్గుచూపుతున్నట్లు తెలిసింది.
తంబళ్లపల్లె ఎమ్మెల్యే శంకర్‌యాదవ్‌పైనా నియోజకవర్గంలో మంచి అభిప్రాయం లేకపోవటంతో ఇక్కడ వేరొకరిని బరిలోకి దించాలని భావిస్తున్నట్లు అమరావతి సమాచారం.
సత్యవేడు ఎమెల్యే తలారి ఆదిత్య విషయానికి వస్తే అవినీతి అక్రమాల్లో పూర్తిగా కూరుకుపోవటంతో ఇక్కడ కూడా వేరొకరికి టికెట్‌ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది.
తిరుపతిలో ఈసారి సిటింగ్‌ ఎమ్మెల్యే సుగుణమ్మకు కాకుండా వేరొకరికి ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు టీడీపీలో ప్రచారం జరుగుతోంది. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యేలపై అధినేత తీవ్ర అసంతృప్తి ఉండటంతో సర్వేలో బాగోలేదని చెప్పి తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.

అమరావతి చుట్టూ ప్రదక్షిణలు
అభ్యర్థులను మార్చుతున్నారని తెలియటంతో కొందరు  అనుచరులతో అమరావతి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. పనులన్నీ పక్కనపెట్టి అమరావతిలో కూర్చొని టికెట్‌ ఖరారు చేసుకునేందుకు చెయ్యని ప్రయత్నమంటూ లేదు. మంత్రి లోకేష్, మంత్రులు, టీడీపీ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు అమరావతిలో హోటళ్లో గదులను అద్దెకు తీసుకున్నారు. అత్యవసరమైతే విమానంలో రేణిగుంటకు వచ్చి పనులను చక్కబెట్టుకుని తిరిగి ఫ్లైట్‌లో అమరావతికి ఎగిరిపోతున్నారు. లోకేష్, మంత్రులు, టీడీపీ పెద్దలు ఏది చెబితే అది చేస్తూ అక్రమంగా సంపాదించిన డబ్బును టికెట్‌ తెప్పించుకునేందుకు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. రోజూ ఉదయం ఉండవల్లిలో సీఎం నివాసం వద్ద, మధ్యాహ్నం సచివాలయం, సాయంత్రం హోటళ్లలో మద్యస్థాలు నెరుపుతున్నారు. టికెట్‌ ఇస్తారో లేదో తెలియదు కానీ... ఎమ్మెల్యేలకు మాత్రం ఆర్మీ సెలెక్షన్‌ కంటే అభ్యర్థిత్వం ఎంపికే కష్టంగా ఉందని టీడీపీ శ్రేణులు వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement