
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నేతలు ఎవరికి వారే యమునా తీరే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. రాష్ట్ర స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు నేతల మధ్య విభేదాలు, సమన్వయ లోపం, గ్రూపు రాజకీయాలు ఆ పార్టీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నాయి. ఒకరిని మించిపోవాలని మరొకరు ప్రయత్నించడం, ప్రత్యేక గ్రూపులు ఏర్పాటు చేసుకుని స్వతంత్రంగా వ్యవహరిస్తుండటం ఆ పార్టీలో పరిష్కారం లేని సవాళ్లుగా మిగిలిపోతున్నాయి.
పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి వ్యతిరేకంగా గ్రూపులు కట్టి కొందరు పనిచేసే స్థాయిలో విభేదాలు ముసురుకోవడం గమనార్హం. కాంగ్రెస్‌లో గ్రూపులు, గొడవలు సాధారణమే అని చెప్పుకున్నా.. ప్రస్తుతం ఆ గొడవలు పరిష్కరించలేని స్థాయికి వెళ్లడం ఆందోళనకరంగా మారిందని పార్టీ వర్గాల్లోనే చర్చ జరుగుతోంది. ముందస్తు ఎన్నికలు వస్తాయన్న అంచనా నేపథ్యంలోనూ కాంగ్రెస్ పెద్దలు మేలుకోవడం లేదనే వాదన వినిపిస్తోంది.
వర్గాలుగా విడిపోయి..
రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ఒక నేత (కొన్ని చోట్ల ఇద్దరు, ముగ్గురు కూడా) పార్టీని తానే నడిపించాలనే కోరికతో ఉన్నారు. ఈ క్రమంలో పార్టీ బలోపేతం కోసం తామంటే తాము పాదయాత్రలు చేస్తామని అధిష్టానానికి ప్రతిపాదనలు పంపారు. దీంతో అధిష్టానం అనుమతి ఇవ్వలేదు. కీలక నేతల్లో కొందరు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ వర్గంగా, మరికొందరు ఆయన వ్యతిరేక వర్గంగా బాహాటంగానే చెప్పుకుంటున్నారు. గత నెలలో ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా కొందరు నేతలు ఢిల్లీ వెళ్లారు.
వారంతా రాహుల్‌తో ఉత్తమ్ పనితీరుపై ఫిర్యాదు చేశారని పెద్ద ఎత్తున చర్చ జరిగింది. తర్వాత ఫిర్యాదు అవాస్తవమని తేలినా.. ఢిల్లీ పెద్దలు కొందరిని కలిసి ఉత్తమ్‌కు వ్యతిరేకంగా నివేదికలిచ్చారనే చర్చ పార్టీలో ఉంది. బస్సుయాత్ర విషయంలో కూడా అసమ్మతి నేతలు గుర్రుగానే ఉన్నారు. బస్సుయాత్ర ప్రారంభించే విషయంలోనే నేతల మధ్య విభేదాలు రాగా, యాత్రల సందర్భంగా కొంతమంది నేతలు చేసిన వ్యాఖ్యలు ఉత్తమ్ వ్యతిరేక వర్గం అసహనానికి కారణమయ్యాయి. బస్సుయాత్ర తీరుపై అధిష్టానానికి ఫిర్యాదులు వెళ్లాయని, అందుకే తాత్కాలికంగా నిలిపివేశారనే చర్చ కూడా జరుగుతోంది.
ఉమ్మడి జిల్లాల్లో పరిస్థితి ఇదీ..
కరీంనగర్: మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు మృత్యుంజయం తమ సొంత గ్రూపు రాజకీయాలు నడుపుతున్నారు. పొన్నం కొంతమేర పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌తో సఖ్యతగా ఉంటున్నట్టు కనిపిస్తున్నా తనదైన శైలిలో ముందుకెళుతున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ హోదా రావడంలేదనే అసంతృప్తితో ఉన్నారు. మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆరేపల్లి మోహన్, మహిళా, విద్యార్థి సంఘాల రాష్ట్ర అధ్యక్షులు నేరెళ్ల శారద, బల్మూరి వెంకట్ ఉత్తమ్ వ్యతిరేక వర్గంగా పనిచేస్తున్నారు.
నిజామాబాద్: మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. కాలం కలిసొస్తే సీఎం అభ్యర్థుల్లో షబ్బీర్ ఒకరని ఆయన అనుచరులు చెప్పుకుంటున్నారు. మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, పార్టీ నేత మహేశ్‌కుమార్ గౌడ్ ఉత్తమ్ వ్యతిరేక వర్గంగా ఉన్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి మాత్రం పార్టీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా లేరు.
వరంగల్: పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య స్వతంత్రంగానే వెళ్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డి కూడా అదే బాటలో ఉన్నారు. తన నియోజకవర్గంలో మరో నేతను ప్రోత్సహిస్తున్నారనే అసంతృప్తితో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఉన్నారు.
ఆదిలాబాద్: డీసీసీ అధ్యక్షుడు ఎ.మహేశ్వర్‌రెడ్డి ఉత్తమ్ వర్గంలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయనకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్సీ ప్రేంసాగర్‌రావు పనిచేస్తున్నారు. ప్రేమ్‌కు ఏపీకి చెందిన కేవీపీ రామచంద్రరావు మద్దతుందనే ప్రచారం ఉంది.
ఖమ్మం: పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఎవరికి వారే అనే రీతిలో వ్యవహరిస్తున్నారు. వీరి మధ్య విభేదాలతో డీసీసీ అధ్యక్షుడిని ఖరారు చేయడంలో జాప్యం జరుగుతోందని చర్చ జరుగుతోంది.
మెదక్: మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ స్వతంత్రంగానే వ్యవహరిస్తున్నారు. గీతారెడ్డి, విజయశాంతి కూడా అదే బాటలో ఉన్నారు. ముత్యంరెడ్డి, ప్రతాపరెడ్డి, జగ్గారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి తమ నియోజకవర్గాలకు పరిమితమై రాజకీయాలు చేస్తున్నారు.
నల్లగొండ: ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య కూడా సమన్వయం లేదు. నాగార్జునసాగర్‌తోపాటు మిర్యాలగూడ, దేవరకొండ నియోజకవర్గాల్లో తమ అనుచరులకు జానారెడ్డి ప్రాధాన్యమిస్తున్నారు. వెంకటరెడ్డి నల్లగొండతోపాటు నకిరేకల్, మిర్యాలగూడ స్థానాల్లోని తన అనుచరులను ప్రోత్సహిస్తున్నారు. ఆలేరు, దేవరకొండ, భువనగిరి నియోజకవర్గాల ఇన్‌చార్జులు ఉత్తమ్‌కు అనుకూలంగా ఉన్నారు. కోదాడ, నకిరేకల్ నియోజకవర్గాల్లో కూడా ఆయన అనుచరులు పనిచేస్తున్నారు.
మహబూబ్‌నగర్: మాజీ మంత్రి డి.కె.అరుణ, ఎంపీ నంది ఎల్లయ్య ఒక వర్గంగా వ్యవహరిస్తున్నారు. కేంద్ర మాజీ మంత్రి జైపాల్‌రెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి చిన్నారెడ్డి మరో వర్గంగా పనిచేస్తున్నారు. వీరిలో ఎవరికీ ఉత్తమ్‌తో సఖ్యత లేదు. ఎమ్మెల్యేలు సంపత్ కుమార్, వంశీచంద్‌రెడ్డి, ఇటీవల పార్టీలోకి వచ్చిన మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి స్వతంత్రంగానే పని చేసుకుంటున్నారు. టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరి హల్‌చల్ చేసిన రేవంత్‌రెడ్డి గుంభనంగానే ఉంటున్నారు. తన ఇమేజ్‌కు తగినట్టు పార్టీ తనను ఉపయోగించుకోవడం లేదనే అసంతృప్తి ఆయనలో ఉంది. మాజీ ఎంపీ మల్లు రవి ఉత్తమ్ వర్గంలో క్రియాశీలకంగా ఉన్నారు.
రంగారెడ్డి: సబితా ఇంద్రారెడ్డి చేవెళ్ల, వికారాబాద్, మహేశ్వరం సెగ్మెంట్లలోని అనుచరులతో కలిసి ముందుకు వెళ్తున్నారు. మల్‌రెడ్డి రంగారెడ్డి, సుధీర్‌రెడ్డి, భిక్షపతియాదవ్, లక్ష్మారెడ్డి, శ్రీశైలంగౌడ్, రాజిరెడ్డి ఎవరికి వారేగా పని చేసుకుంటున్నారు.
హైదరాబాద్: ఇక్కడ నేతల మధ్య సమన్వయం అనే ఊసే లేదు. వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని ఆశించిన మాజీ మంత్రి దానం నాగేందర్ పార్టీ వదిలి వెళ్లిపోగా, ఆయన స్థానంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా అంజన్‌కుమార్ యాదవ్ నియమితులయ్యారు. అయితే ఆ పదవి వద్దన్నా కట్టబెట్టారనే అసంతృప్తితో ఆయన ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మాజీ ఎంపీ వీహెచ్, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి తమదైన శైలిలో ముందుకు వెళ్తున్నారు.
అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి
జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో కూడా గ్రూపు తగాదాలు తారస్థాయికి చేరాయి. రాష్ట్రస్థాయి నేతల మధ్య సమన్వయం లేకపోవడం, జిల్లాలు, నియోజకవర్గాల స్థాయిల్లో విభేదాల కారణంగా స్థానిక కేడర్‌లో మనోస్థైర్యం నింపలేకపోతున్నార నే అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది.
కొత్తగా ఏఐసీసీ నుంచి వచ్చిన బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాసకృష్ణన్ జిల్లాస్థాయిల్లో పర్యటిస్తున్నప్పుడు ఈ విభేదాలు కనిపిస్తున్నాయని పార్టీ వర్గాలంటున్నాయి. ఖమ్మం జిల్లాలో కొత్త కార్యదర్శుల ముందే గ్రూపు గొడవలు జరుగుతున్న పరిస్థితి నెలకొంది. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నేతల విషయంలో పాత నాయకులు ఆధిపత్య ధోరణితో వ్యవహరిస్తున్నారనే చర్చ జరుగుతోంది.