సాక్షి ప్రతినిధి, కరీంనగర్ : స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి దేశాన్ని పాలించిన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలే దేశంలో సాగు సంక్షోభానికి కారణమని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. ఆ 2 పార్టీల అసమర్థత, వైఫల్యాల వల్లే రైతులు దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించే దమ్ము ప్రధాని మోదీకి లేదని.. దేశంలో నీళ్ల సమస్య తీర్చకుండా కేంద్రం, ప్రధానమంత్రి గడ్డి కోస్తున్నారా.. అని వ్యాఖ్యానించారు.
సోమవారం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ స్టేడియంలో నిర్వహించిన రైతు సమన్వయ సమితుల ప్రాంతీయ అవగాహన సదస్సులో సీఎం కేసీఆర్ మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ 24 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టిందని, అందులో రైతుల కోసం 2 లక్షల కోట్లు కేటాయించలేకపోవడం దారుణమని వ్యాఖ్యానించారు. గతంలో దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన పార్టీలు ఇప్పుడు రోడ్లెక్కి ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోవాలి
కేంద్ర పాలకులు ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకుని, రైతులను ఆదుకునే చర్యలు చేపట్టాలని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. దేశంలో 70వేల టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉంటే.. 40 శాతం నీటిని కూడా వాడలేని దుస్థితి ఉందన్నారు. ‘చాటల తవుడు పోసి కుక్కల కొట్లాట పెట్టినట్లు’తెలంగాణ, ఆంధ్రా ఏర్పడి నాలుగేళ్లయినా గోదావరి నీటి వాటా తేల్చలేకపోయారని మండిపడ్డారు.
‘‘కేంద్రం, ప్రధాన మంత్రి గడ్డి కోస్తున్నరా.. నదులెన్ని ఉన్నయ్.. నీళ్లెన్ని ఉన్నయి.. తేల్చేందుకు మెకానిజం తీయరాదా? పక్కనున్న చైనా దేశం యాంగ్లీ నది ద్వారా 1,400 కిలోమీటర్లు వెయ్యి టీఎంసీల నీళ్లు తీసుకెళ్తున్నది. 70 ఏళ్లలో మనదేశంలో ఏమైనా చేశారా? ఇప్పుడు కర్ణాటక ఎన్నికలు వస్తున్నయని నదుల అనుసంధానమంటూ డ్రామా మొదలుపెట్టిండ్రు. బీజేపీ వచ్చిన మొదటి సంవత్సరంలో ఎందుకు చేయలే.. ఎన్నికలు వస్తేనే గుర్తుకువస్తయా..?’’అని మండిపడ్డారు. గంగ, బ్రహ్మపుత్ర నదుల్లో 40 వేల టీఎంసీల నీళ్లున్నాయని, బ్రహ్మపుత్రలో మూడు శాతం నీటిని కూడా వాడుకోవడం లేదని పేర్కొన్నారు.
తొలి మెట్టు పాడి పంటలే..
కూడు–గుడ్డ, పాడి–పంటలతో తెలంగాణ అన్నదాత కష్టంతో అందరూ సుభిక్షంగా ఉండటమే బంగారు తెలంగాణకు తొలి మెట్టు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రైతులు అప్పులు చేయకుండా, నకిలీ విత్తనాల బారినపడకుండా, పంటలకు కనీస మద్దతు ధర అందేలా రైతాంగాన్ని సంఘటిత పర్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం రైతు సమన్వయ సమితులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. రైతాంగాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పరచడానికి నియంత్రిత పద్ధతిలో పనిచేయాల్సిన అవసరముందన్నారు. దేశంలో సుసంపన్నమైన భూములు, జీవ నదులు ఉన్నాయని.. 70 వేల టీఎంసీల నీటిలభ్యత ఉన్నా 26 వేల టీఎంసీలే వినియోగమవుతున్నాయని చెప్పారు.
అదే చైనాలో సాగుకు అనుకూలమైన నేలలు లేకున్నా ఆహార రంగంలో స్వావలంబన సాధించిందని పేర్కొన్నారు. దేశంలో, రాష్ట్రంలో గత పాలకులు వివక్ష చూపడం వల్లే రైతుల ఆత్మహత్యలు జరిగాయన్నారు. రైతాంగానికి జరుగుతున్న నష్టాన్ని తెలంగాణ ప్రభుత్వం సహించబోదని.. భవిష్యత్తులో తెలంగాణ రైతు సమన్వయ సమితులే నాయకత్వ బాధ్యతలు చేపట్టనున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో నీటి ప్రాజెక్టులను చేపట్టామని, కాళేశ్వరం, సీతారామ, దేవాదుల, నెట్టెంపాడు ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.
పెట్టుబడి సాయం కింద 12 వేల కోట్లు
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా రైతులకు ఎకరానికి రూ.8 వేల చొప్పున రూ.12 వేల కోట్లు అందించనున్నామని సీఎం కేసీఆర్ చెప్పారు. అసైన్డ్ భూముల రైతులకు కూడా సాయం అందిస్తామని తెలిపారు. రైతులు పంటలను నిల్వ చేసుకునేందుకు గతంలో 4 లక్షల టన్నుల సామర్థ్యం కలిగిన గోదాములే ఉండగా.. తమ ప్రభుత్వం వచ్చాక ఏకంగా 23 లక్షల టన్నుల సామర్థ్యమున్న గోదాములను నిర్మించామన్నారు. వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో పంట కాలనీలను (క్రాప్ కాలనీలు) ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్రంలోని 70 లక్షల మంది రైతులకు రూ.5 లక్షల చొప్పున ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తామని, దానికి ప్రీమియం సొమ్మును ప్రభుత్వమే భరిస్తుందని కేసీఆర్ తెలిపారు. ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, స్పీకర్ మధుసూదనాచారి, మంత్రులు ఈటల, తుమ్మల, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పలువురు ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
పేర్లు తప్ప ఏం మారుతయ్..
‘‘వ్యవసాయం చేసుకునే రైతుకు నీళ్లిచ్చే తెలివిలేని ప్రభుత్వాలు ఏలుతున్నయ్. నరేంద్ర మోదీ మీద కోపమొస్తె.. రాహుల్ గాంధో, ఇంకో గాంధో ప్రధాని అయితరు. ఇంతకంటే ఏం జరుగుతది. ఏం తేడా వస్తది. వీడస్తే దీన్‌దయాళ్, శ్యాంప్రసాద్‌లాల్.. వాడస్తే ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ పేర్లు మారుతయ్. అంతే తప్ప రైతుల స్థితిగతులు మారుతలేవు..’’
ప్రధాని మోదీకి దమ్ము లేదు..
‘‘రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఉంటే.. కేంద్ర బడ్జెట్‌లో రూ.2 లక్షల కోట్లు రైతుల కోసం పెట్టడం చేతకాదా..? రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించే దమ్ము ప్రధాని నరేంద్ర మోదీకి లేదు. ఉద్యోగులకు జీతాలు పెంచినట్లు.. రైతులకు మద్దతు ధర ఎందుకు ఇవ్వడం లేదు. జీడీపీ, జీఎస్‌డీపీ అంటూ రైతులను మభ్యపెట్టే మాటలు చెబుతున్నారు. 70 ఏళ్లలో ఈ దేశాన్ని పాలించింది ఆ రెండు (బీజేపీ, కాంగ్రెస్) పార్టీలే.. వాళ్లు అధికారంలో ఉంటే వీళ్లు.. వీళ్లు అధికారంలో ఉంటే వాళ్లు ధర్నాలు చేయడం తప్ప ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు. ఇప్పటికైనా రెండు జాతీయ పార్టీలు చిల్లర రాజకీయాలు మాని రైతుల కోసం పనిచేయాలి..’’
Comments
Please login to add a commentAdd a comment