తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు
సాక్షి, హైదరాబాద్ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు జాతీయ రాజకీయాలపై దృష్టి సారించారా.. బీజేపీ, కాంగ్రెస్‌లకు ప్రత్యామ్నాయంగా మూడో ఫ్రంట్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారా.. ఆ దిశగా దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల అధినేతలతో సంప్రదింపులు జరుపుతున్నారా..!? ఈ ప్రశ్నలకు ఔననే సమాధానాలు వస్తున్నాయి. దేశంలో సమాఖ్య స్ఫూర్తిని కాపాడుకునే లక్ష్యంతో.. ‘ఫెడరల్ ఫ్రంట్’పేరిట మూడో ఫ్రంట్‌ను ఏర్పాటు చేయాలని కేసీఆర్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదరణ తగ్గుతోందని, అటు కాంగ్రెస్ బలం కూడా పెరగడం లేదని ఆయన అంచనాకు వచ్చినట్టు సమాచారం. దీనిపై దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులను అధ్యయనం చేసి, ఒక అంచనాకు రావడానికి.. కేసీఆర్ ఇటీవలి ఢిల్లీ పర్యటనను ఉపయోగించుకున్నట్టు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. రాజకీయ విశ్లేషకులు, సీనియర్ పాత్రికేయులు, కొందరు సీనియర్ రాజకీయ నేతలతోనూ కేసీఆర్ ఢిల్లీలో చర్చించినట్టు సమాచారం. ప్రాంతీయ పార్టీలు ఏకమై, బలోపేతమైతే జాతీయ స్థాయిలో పట్టుచిక్కుతుందని ఆయన అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకు అనుగుణంగానే కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని.. ఇటీవల బీజేపీ, కాంగ్రెస్‌లపై చేసిన విమర్శలు అందులో భాగమేనని చెబుతున్నారు.
ప్రాంతీయ పార్టీల అగ్రనేతలతో చర్చలు
జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టిన కేసీఆర్.. దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల నేతలతో సంప్రదింపులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ ఉద్యమ సమయంలోనే దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతీయ పార్టీల అగ్రనేతలతో కేసీఆర్‌కు సంబంధాలున్నాయి. కొందరితో సన్నిహిత స్నేహం కూడా ఉంది. సంప్రదింపుల సందర్భంగా వారు కూడా సానుకూలంగానే స్పందిస్తున్నట్టు తెలుస్తోంది. జేఏంఎం అధినేత శిబూసోరేన్, తమిళనాడులో డీఎంకే నేత స్టాలిన్, ఉత్తరప్రదేశ్‌లోని సమాజ్‌వాదీ నేత అఖిలేశ్ యాదవ్, కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి (జేడీఎస్) వంటి వారితో ప్రాథమికంగా సంప్రదింపులు జరిగినట్టు తెలుస్తోంది. మరిన్ని ప్రాంతీయ పార్టీల ముఖ్యులతోనూ కేసీఆర్ ఫోన్‌లో సంప్రదింపుల్లో ఉన్నట్టు సమాచారం. వారంతా మూడో ఫ్రంట్‌పై స్పష్టమైన అభిప్రాయాలు చెప్పకున్నా.. వ్యతిరేకంగా ఎవరూ లేరని కేసీఆర్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర పెత్తనమే ఉంటే.. ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడ?
రాష్ట్రాలపై కేంద్ర ప్రభుత్వమే పెత్తనం చెలాయిస్తుంటే.. ఫెడరల్ స్ఫూర్తి ఎక్కడ ఉంటుందని కేసీఆర్ ప్రశ్నిస్తున్నారు. రాష్ట్రాల నుంచి వసూలవుతున్న పన్నుల్లో 42 శాతమే తిరిగి రాష్ట్రాలకు ఇవ్వడం, మిగతా 58 శాతం ఆదాయాన్ని ఇష్టారాజ్యంగా కేటాయిస్తుండడంతో... కొన్ని రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని వాదిస్తున్నారు. దీనివల్ల రాష్ట్రాలకు ఆర్థిక అధికారాలు లేకుండా పోతున్నాయని అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రాల భాగస్వామ్యాన్ని పెంచుకోవాలంటే జాతీయ పార్టీల గుత్తాధిపత్యానికి గండికొట్టడమే సరైన మార్గమనే అంచనాలో కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. రాష్ట్రాలకు అధికారాలు సాధించుకోవడం, రైతాంగ సమస్యలు వంటి నినాదాలతో దేశవ్యాప్తంగా పనిచేయడం వల్ల సానుకూల ఫలితాలు ఉంటాయని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రాల వారీగా రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహం వంటివాటిపై ఇంకా స్పష్టత రాకున్నా.. ఫెడరల్ ఫ్రంట్ పేరుతో మూడో ఫ్రంట్ యోచనకు బీజం పడిందని కేసీఆర్ సన్నిహితులు వ్యాఖ్యానిస్తున్నారు.
కాంగ్రెస్, బీజేపీలపై విమర్శల పదును
జాతీయ రాజకీయాలపై దృష్టి సారించినందువల్లే బీజేపీపై, కాంగ్రెస్‌పై కేసీఆర్ విమర్శల దూకుడు పెంచినట్టు చెబుతున్నారు. ప్రధాని మోదీని, ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని నేరుగా విమర్శించడం అందులో భాగమేనని.. జాతీయ పార్టీలపై తిరుగుబాటుతో తన వైఖరిని బహిర్గతం చేశారని అంటున్నారు. దేశంలో రైతు సమస్యల పరిష్కారంకోసం జరిగే పోరాటానికి, ఉద్యమానికి తెలంగాణ నాయకత్వం వహిస్తుందనే మాట కూడా జాతీయ రాజకీయాలపై కేసీఆర్ దృష్టిని తేటతెల్లం చేస్తోందని చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment