సాక్షి, హైదరాబాద్ : రోజురోజుకూ పెరుగుతున్న ఇంధన ధరలకు నిరసనగా ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్, వామపక్షపార్టీలు సోమవారం (సెప్టెంబర్ 10) నాడు భారత్‌బంద్‌కు పిలుపునిచ్చాయి. అంతకంతకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సగటు వాహనదారుడి జేబుకు చిల్లులు పడుతున్నాయి. మరోవైపు నిత్యావసర ధరలు కూడా మండిపోతున్నాయి. శుక్రవారం దాదాపు 50 పైసల వరకు ఇంధన ధరలు పెరిగాయి. దీంతో ఢిల్లీలో లీటరు పెట్రోలు 79.99, డీజిల్ 72.09 రూపాయలకు చేరింది. గత నెల రోజులుగా డీజిల్ ధర 4 రూపాయలు, పెట్రోలు ధర 3 రూపాయలు వరకు పెరిగింది.
ఇదిలా ఉండగా.. ధరల పెరుగుదలపై నిర్లక్ష్యంగా మాట్లాడుతున్న ఆర్థికశాఖ శాఖ మంత్రి అరుణ్‌జైట్లీపై కాంగ్రెస్ విమర్శలు గుప్పించింది. ఇంత జరగుతున్నా ‘భయపడొద్దు’అని మాట్లాడుతున్న కేంద్రమంత్రి వ్యవహారం ఆక్షేపనీయంగా ఉందని వ్యాఖ్యానించింది. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గినప్పుడు ఆ ఫలాలు దేశవాసులకు అందించడంలో ఎన్డీయే ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి ఆనంద్‌శర్మ విమర్శించారు. సెంట్రల్ ఎక్సైజ్ సుంకం తగ్గించకుండా ప్రజల సొమ్మును దోచుకున్నారని ఆరోపించారు. కాగా, గత నెల రోజులుగా క్రూడ్ ఆయిల్ ధరల పెరుగుదల, డాలర్‌తో రూపాయి క్షీణత ఫలితంగా దేశీయంగా ఇంధన ధరల్లో తీవ్ర పెరుగుదల నమోదైంది.
కాంగ్రెస్ జెండా పండుగ..
కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్ ప్రజల్ని అవస్థలకు గురిచేశారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి అన్నారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడిపై భారం మోపారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 10 (సోమవారం)న భారత్‌బంద్ నిర్వహిస్తామని వెల్లడించారు. తెలంగాణ ఇచ్చిన గాంధీ కుటుంబంపై కేసీఆర్ అడ్డగోలు విమర్శలు సరికావని హెచ్చరించారు. సెప్టెంబర్ 11 నుంచి 18 వరకు కాంగ్రెస్ జెండా పండగ నిర్వహిస్తామని తెలిపారు. రాబోయే ఎన్నికలు కేసీఆర్ వర్సెస్ తెలంగాణ ప్రజల మధ్యేనని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment