పేదల సొమ్ము దోచారు | Congress Has Snatched Away Food From Poor Children | Sakshi
Sakshi News home page

పేదల సొమ్ము దోచారు

Apr 11 2019 5:04 AM | Updated on Apr 11 2019 5:09 AM

Congress Has Snatched Away Food From Poor Children - Sakshi

జునాగఢ్‌/సోనాగఢ్‌: నిరుపేదలు, గర్భిణులకు అందాల్సిన నిధులను కాంగ్రెస్‌ పార్టీ దోచుకుంటోందని ప్రధాని మోదీ విమర్శించారు. ఢిల్లీలోని తుగ్లక్‌ రోడ్డులోని మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌నాథ్‌ సన్నిహితుల ఇళ్లలో ఇటీవల ఐటీ శాఖ చేపట్టిన సోదాలను ప్రస్తావిస్తూ.. తాజాగా కాంగ్రెస్‌ పార్టీ ‘తుగ్లక్‌ రోడ్డు ఎన్నికల కుంభకోణా’నికి పాల్పడిందని ఎద్దేవా చేశారు. గుజరాత్, మహారాష్ట్ర, గోవా రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారర్యాలీల్లో మోదీ మాట్లాడారు.

మధ్యప్రదేశ్‌.. కొత్త ఏటీఎం
జునాగఢ్‌ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ..‘ కాంగ్రెస్‌ నేతల ఇళ్లలో నోట్లు కట్టలుకట్టలుగా బయటపడటాన్ని మీరు గత 3–4 రోజులుగా టీవీల్లో చూసుంటారు. కానీ వాళ్లు మధ్యప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చి 6 నెలలు కూడా కాలేదు. ఇంతకుముందు వాళ్లకు కర్ణాటక ఏటీఎంగా ఉండేది. ఇప్పుడు మధ్యప్రదేశ్‌ కొత్త ఏటీఎంగా తయారైంది. ఛత్తీస్‌గఢ్, రాజస్తాన్‌లో కూడా పరిస్థితిలో పెద్దగా తేడా లేదు. అధికారంలోకి వచ్చి దోచుకోవడంపైనే కాంగ్రెస్‌ నేతలు ఆసక్తిగా ఉన్నారు. చేసిన కుంభకోణాల ఆధారంగా ఈ పార్టీకి చాలా పేర్లు ఉన్నాయి. కానీ తొలిసారి ఆ కుంభకోణాలకు ఆధారం లభించింది. వీళ్లు తుగ్లక్‌ రోడ్డు ఎన్నికల కుంభకోణానికి పాల్పడ్డారు. నిరుపేదలు, గర్భిణులకు అందించాల్సిన నిధుల్ని కాంగ్రెస్‌ నేతలు వాడుకున్నారు. పాక్‌లోని ఉగ్రమూకలపై వైమానికదాడులు చేస్తే, అవి కాంగ్రెస్‌ పార్టీని బాధించాయి’ అని అన్నారు.  

నెహ్రూ వల్లే కశ్మీర్‌లో మరణాలు..
‘స్వతంత్ర భారత తొలి హోంమంత్రిగా పటేల్‌ లేకుంటే కశ్మీర్‌ మనదేశంలో ఉండేది కాదు. వందలాది సంస్థానాలు భారత్‌లో విలీనమయ్యేలా పటేల్‌ చొరవచూపారు. కశ్మీర్‌ విలీనం విషయంలో నెహ్రూ ఘోరంగా విఫలమయ్యారు. అందువల్లే నేటికీ మన సైనికులు అక్కడ అమరులవుతున్నారు. ఓ చాయ్‌వాలా ఐదేళ్లు పదవీకాలాన్ని పూర్తిచేసుకోవడంపై కాంగ్రెస్‌ నేతలకు బెంగ పట్టుకుంది’ అని మోదీ విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement