వెంకటాపురం ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతున్న భట్టి విక్రమార్క
ఎర్రుపాలెం (ఖమ్మం): ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మగౌరవ యాత్రతోనే టీఆర్‌ఎస్ పార్టీ అంతమవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర తాజా మాజీ ఎమ్మెల్యే భట్టి విక్రమా ర్క అన్నారు. ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయనకు స్వాగతం పలికేందుకు మండలంలోని మీనవోలు నుంచి ముదిగొండ, చింతకాని, మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ట్రాక్టర్లు, మోటారు సైకిళ్లతో ర్యాలీగా జమలాపురం చేరుకున్నారు.
స్థానిక శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి భట్టి పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి స్వయంగా భట్టి విక్రమార్క ట్రాక్టర్ నడుపుకుంటూ.. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, సోమ్లానాయక్‌లతో కలిసి కార్యకర్తల్లో జోష్ నింపుతూ.. వెంకటాపురం గ్రామానికి చేరారు. మార్గమధ్యలో మిర్చి తోటలో రైతులతో కలిసి కాసేపు అరక దున్నారు. గ్రామంలోని దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు, గిరిజనులు, దళితులు, విద్యార్థులు, మహిళలు ఇలా అన్ని వర్గాలకు ఎన్నికల ముందు మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు.
అన్ని వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే కాంగ్రెస్ ఆధ్వర్యం లో ఆత్మగౌరవ యాత్ర చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఇచ్చిన రాష్ట్రాన్ని దొరల తెలం గాణగా, భూస్వాముల తెలంగాణగా కేసీఆర్ కుటుంబం మార్చిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు భారీగా మళ్లించి.. కేసీఆర్ కుటుంబంలోని ఆ నలుగురు కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. నీలాం టి పిట్టల దొరలు బెదిరిస్తే బెదిరేది లేదని కేసీఆర్‌ను హెచ్చరించారు.
ఇటీవల కొందరు బ్రోకర్లు మధిరలో తిరుగుతున్నారని, భట్టిని ఓడించడానికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని ప్రచారం చేసుకుంటున్నా.. కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆప లేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్ని కల్లో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు, వర్గాల ను ఒకే తాటిపైకి తెస్తామన్నారు. దొరల ప్రభు త్వం కావాలో.. ప్రజల ప్రభుత్వం కావాలో ప్రజ లు తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తొలిరోజు వెంకటాపురం, నారాయణపురం, గట్లగౌరారం, లక్ష్మీపురం, కాచారం, బనిగండ్లపాడు, బుచ్చిరెడ్డిపాలెం, నర్సింహాపురం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు బొగ్గుల గోవర్ధన్‌రెడ్డి, బండారు నర్సింహారావు, శీలం శ్రీనివాసరెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, శీలం నర్సిరెడ్డి, కడియం శ్రీనివాసరావు, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జాన్‌బాషా, సామినేని హన్మంతరా వు, సముద్రాల పురుషోత్తం, యన్నం పిచ్చిరెడ్డి, అనుమోలు కృష్ణారావు, గుడేటి బాబురావు, అయిలూరి సత్యనారాయణరెడ్డి, దోమందుల నాగేశ్వరరావు, పిట్టల శివయ్య తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment