Atma Gowrava Yatra
-
‘యాత్ర’తో టీఆర్ఎస్ అంతం
ఎర్రుపాలెం (ఖమ్మం): ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆత్మగౌరవ యాత్రతోనే టీఆర్ఎస్ పార్టీ అంతమవుతుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మధిర తాజా మాజీ ఎమ్మెల్యే భట్టి విక్రమా ర్క అన్నారు. ఎర్రుపాలెం మండలం జమలాపురం గ్రామంలో బుధవారం ఆయన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆయనకు స్వాగతం పలికేందుకు మండలంలోని మీనవోలు నుంచి ముదిగొండ, చింతకాని, మధిర, బోనకల్, ఎర్రుపాలెం మండలాలకు చెందిన కార్యకర్తలు, నాయకులు ట్రాక్టర్లు, మోటారు సైకిళ్లతో ర్యాలీగా జమలాపురం చేరుకున్నారు. స్థానిక శ్రీవేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో కుటుంబ సభ్యులతో కలిసి భట్టి పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి స్వయంగా భట్టి విక్రమార్క ట్రాక్టర్ నడుపుకుంటూ.. మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, సోమ్లానాయక్‌లతో కలిసి కార్యకర్తల్లో జోష్ నింపుతూ.. వెంకటాపురం గ్రామానికి చేరారు. మార్గమధ్యలో మిర్చి తోటలో రైతులతో కలిసి కాసేపు అరక దున్నారు. గ్రామంలోని దివంగత నేత వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పార్టీ మండల అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ప్రచార సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని రైతులు, గిరిజనులు, దళితులు, విద్యార్థులు, మహిళలు ఇలా అన్ని వర్గాలకు ఎన్నికల ముందు మోసపూరితమైన మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసి ఇబ్బందులకు గురి చేశాడని ఆరోపించారు. అన్ని వర్గాల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే కాంగ్రెస్ ఆధ్వర్యం లో ఆత్మగౌరవ యాత్ర చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను నెరవేర్చాలనే ఉద్దేశంతో సోనియా గాంధీ ఇచ్చిన రాష్ట్రాన్ని దొరల తెలం గాణగా, భూస్వాముల తెలంగాణగా కేసీఆర్ కుటుంబం మార్చిందన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ పథకాలకు నిధులు భారీగా మళ్లించి.. కేసీఆర్ కుటుంబంలోని ఆ నలుగురు కమీషన్లు దండుకున్నారని ఆరోపించారు. నీలాం టి పిట్టల దొరలు బెదిరిస్తే బెదిరేది లేదని కేసీఆర్‌ను హెచ్చరించారు. ఇటీవల కొందరు బ్రోకర్లు మధిరలో తిరుగుతున్నారని, భట్టిని ఓడించడానికి ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తామని ప్రచారం చేసుకుంటున్నా.. కాంగ్రెస్ గెలుపును ఎవరూ ఆప లేరని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్ని కల్లో రాష్ట్రంలోని అన్ని రాజకీయ పక్షాలు, వర్గాల ను ఒకే తాటిపైకి తెస్తామన్నారు. దొరల ప్రభు త్వం కావాలో.. ప్రజల ప్రభుత్వం కావాలో ప్రజ లు తేల్చుకునే సమయం ఆసన్నమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమన్నారు. తొలిరోజు వెంకటాపురం, నారాయణపురం, గట్లగౌరారం, లక్ష్మీపురం, కాచారం, బనిగండ్లపాడు, బుచ్చిరెడ్డిపాలెం, నర్సింహాపురం గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కార్యక్రమంలో మండల కమిటీ అధ్యక్షుడు వేమిరెడ్డి సుధాకర్‌రెడ్డి, నాయకులు బొగ్గుల గోవర్ధన్‌రెడ్డి, బండారు నర్సింహారావు, శీలం శ్రీనివాసరెడ్డి, బొగ్గుల శ్రీనివాసరెడ్డి, శీలం నర్సిరెడ్డి, కడియం శ్రీనివాసరావు, వేమిరెడ్డి శ్రీనివాసరెడ్డి, జాన్‌బాషా, సామినేని హన్మంతరా వు, సముద్రాల పురుషోత్తం, యన్నం పిచ్చిరెడ్డి, అనుమోలు కృష్ణారావు, గుడేటి బాబురావు, అయిలూరి సత్యనారాయణరెడ్డి, దోమందుల నాగేశ్వరరావు, పిట్టల శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
రెండో విడత యాత్రపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చ
సాక్షి, హైదరాబాద్: రెండో విడత ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’ ఏ జిల్లా నుంచి చేపట్టాలన్న అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఢిల్లీకి లేఖ రాశాకే సీడబ్ల్యూసీ విభజన నిర్ణయాన్ని వెలువరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోస్తా, రాయలసీమ ప్రాంతంలోని ఏ జిల్లా పర్యటనకు వెళితే ఎలాంటి నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని అధినేతతోసహా టీడీపీ ముఖ్య నేతలందరూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బస్సుయాత్ర మొదట విడతలోనే పశ్చిమగోదావరి జిల్లాలో బాబు పర్యటిం చాల్సి ఉంది. అయితే సమైక్యాంధ్ర ఉద్యమకారుల నుంచి నిరసనలు ఎదురయ్యే ప్రమాదముందని జిల్లానేతలు సూచిం చినందున ఆ జిల్లాకు వెళ్లకుండానే మొదట విడత యాత్రను ముగించారు. ఈ నేపథ్యంలో మరో వారం, పది రోజుల్లో రెండోవిడత యాత్రకు వెళ్లాలన్న యోచనతో ఉన్న చంద్రబాబు శుక్రవారం తన నివాసంలో పార్టీ నేతలతో చర్చించా రు. ప్రస్తుతం పార్టీకి ఏ జిల్లాలో అనుకూల పరిస్థితులున్నాయన్న దానిపై చర్చించారు. ప్రకాశం, నెల్లూరుతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ఏ మేరకు చేయగలుగుతామో పరిశీలించి రూట్‌మ్యాప్‌లు ఖరా రు చేయాలని సూచించారు. ఒక్కో విడతలో రెండు జిల్లాల్లో యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. అధినేత ఢిల్లీ పర్యటన తర్వాతే రెండో విడత బస్సు యాత్ర మొదలు పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు. సోమవారం తరువాతే ఢిల్లీ యాత్ర: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సోమవారం తర్వాతే ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నేతల సమావేశంలో ఢిల్లీ యాత్ర వివరాలపైనా చర్చ జరిగింది. ప్రధాని, రాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులతోపాటు వివిధ పార్టీల జాతీయ నేతల అపాయింట్మెంట్లపై నేతల్ని బాబు ఆరా తీశారు. ఆర్థిక సంక్షోభం పై ఢిల్లీలో పార్టీపరంగా సదస్సు నిర్వహించాలన్న యోచనపై చర్చించారు. భేటీలో నేతలు కె.రామ్మోహనరావు, గరికపాటి రామ్మోహనరావు, నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు. -
చంద్రబాబూ.. ఇప్పుడే ఎందుకు ఢిల్లీ యాత్ర?: అంబటి రాంబాబు
వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్న కాంగ్రెస్‌వారి కాళ్లు పట్టుకొని జగన్ బెయిల్‌ను అడ్డుకునేందుకేనా? ఆత్మగౌరవ యాత్రను ఎందుకు అర్ధంతరంగా ముగించారు? సాక్షి, గుంటూరు: టీడీపీ అధినేత చంద్రబాబు అర్ధంతరంగా తన ఆత్మగౌరవ యాత్ర ముగించుకుని ఎందుకు ఢిల్లీ వెళుతున్నారో, ఏ వాదం వినిపించడానికి బయలుదేరుతున్నారో తెలుగు ప్రజలకు సమాధానం చెప్పాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. చంద్రబాబు పాదయాత్ర చేసినా, బస్సు యాత్ర చేసినా, ఢిల్లీ యాత్ర చేసినా జగన్, వైఎస్సార్‌పై దుమ్మెత్తి పోసే కార్యక్రమాలు చేస్తున్నందునే.. ఇప్పుడు జగన్ బెయిల్ అడ్డుకుంటారనే అపోహలు, అనుమానాలు అందరిలో నెలకొన్నాయని అన్నారు. సీబీఐ దర్యాప్తు పూర్తవుతున్న నేపథ్యంలో జగన్ బెయిల్‌కు అవకాశాలు మెరుగయ్యాయని మేధావులు, సామాన్యులకు అర్థమవుతున్న ఈ తరుణంలో చంద్రబాబు ఢిల్లీ యాత్రపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. శుక్రవారం గుంటూరులో జరిగిన విలేకరుల సమావేశంలో అంబటి మాట్లాడారు. ‘‘జగన్‌కు బెయిల్ రాకుండా, నిర్బంధంలో ఉంచాలనే తాపత్రయం చంద్రబాబులో ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తెలుగు జాతి ఆత్మగౌరవం దెబ్బతిందని ఈనెల 1 నుంచి బాబు బస్సు యాత్ర చేశారు. ఇప్పుడు అర్ధంతరంగా బస్సు యాత్ర ఎందుకు ఆపారు? సమైక్యవాదం బలంగా ఉందని చెప్పేందుకు ఢిల్లీకి వెళ్తున్నారా? రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నానని చెప్పేందుకు వెళ్తున్నారా? లేక జగన్మోహన్ రెడ్డి బెయిల్ అడ్డుకునేందుకు కాంగ్రెస్ వారి కాళ్లు పట్టుకునేందుకు ఢిల్లీ యాత్ర చేస్తున్నారో చెప్పాలి’’ అని డిమాండ్ చేశారు. సమైక్య వాదమా.. ప్రత్యేక వాదమా.. అవకాశవాదమా? ‘‘చంద్రబాబుది సమైక్య వాదమా? ప్రత్యేక వాదమా? అవకాశ వాదమా? ఏదో చెప్పాలి. ఏ వాదం వినిపించడానికి ఆత్మగౌరవ యాత్ర చేశారో.. ఏ వాదనల్ని వినిపించడానికి ఢిల్లీ వెళుతున్నారో.. దయచేసి సమాధానమివ్వాలి. పారదర్శకంగా ఉంటానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు ఇప్పుడైనా నోరు విప్పాలి. జై తెలంగాణ అనే వారిని, జై సమైక్యాంధ్ర అనే వారిని, ఇరు ప్రాంతాల వారిని వెంటబెట్టుకుని ఢిల్లీ వెళతారట. ఇంతకంటే పచ్చి అవకాశంవాదం ఏమైనా ఉంటుందా?’’ అని అంబటి ప్రశ్నించారు. బీజేపీతో కలవడం చారిత్రాత్మక తప్పిదం అన్న చంద్రబాబు ఇప్పుడు బీజేపీ వైపు చూస్తున్నారని, గతంలో మోడీ గద్దె దిగాలని దూషించి, ఇప్పుడు మోడీ ప్రధాని అభ్యర్థి అని బీజేపీ ప్రకటిస్తుందని తెలిసి ఆ పార్టీతో పొత్తు కోసం అర్రులు చాచడం బాబుకు అనైతికతకు నిదర్శనమని మండిపడ్డారు. జగన్‌కు కాంగ్రెస్‌తో రాజీ పడాల్సిన అవసరమేంటి? ‘‘ఈ నెల 9లోపు అన్ని చార్జిషీట్లు వేసేందుకు సుప్రీంకోర్టు.. సీబీఐకి అనుమతి ఇచ్చింది. దీంతో తొమ్మిదో తేదీ నుంచే ఎల్లో మీడియా కథనాలు రాస్తోంది. కాంగ్రెస్‌తో జగన్ కుమ్మక్కై పోయార ని.. రాజీ పడటం వల్లే బెయిలొస్తుందని నిస్సిగ్గుగా రాస్తున్నారు. 15 నెలలుగా జైల్లో ఉన్న జగన్ కాంగ్రెస్‌తో రాజీ పడాల్సిన అవసరం ఏముంది?’’ అని అంబటి ప్రశ్నించారు. దర్యాప్తు పూర్తయిన నేపథ్యంలో సహజంగానే బెయిల్ వచ్చే అవకాశాలు మెరుగుపడతాయే తప్ప ఎవరితోనో కుమ్మక్కైతే బెయిల్ వచ్చే పరిస్థితులు ఉండవన్న సంగతిని తెలుసుకోవాలని సూచించారు. వైఎస్ తనని చూసి బెదిరిపోయేవారని చంద్రబాబు చెప్పుకుంటున్నారని, అయితే వైఎస్ బతికున్నప్పుడు బాబు ఈ గొప్పలు చెబితే బాగుండేదని అన్నారు. జగన్ బయటకొస్తే నీ పార్టీ పుట్టగతుల్లేకుండా పోతుందన్న భయమా? ‘‘చంద్రబాబూ.. ఢిల్లీలో ఉన్న పెద్దపెద్ద పత్రికాధిపతులతో రహస్యంగా మాట్లాడి, జగన్మోహన్ రెడ్డిపై ఇంగ్లిష్ పత్రికల్లో పుంఖానుపుంఖాలుగా కథనాలు రాయించి సుప్రీంకోర్టును ప్రభావితం చేయాలని ఒక విష ప్రయత్నం చేస్తున్నావు. జగన్ బయటకొస్తే నీ పార్టీ పుట్టగతుల్లేకుండా పోతుందని నీకు స్పష్టంగా అర్థమైందనే విషయం అందరికీ అర్థమైంది’’ అని అంబటి అన్నారు. 15 నెలలుగా జగన్ జైల్లో ఉన్నా, విజయమ్మ, షర్మిలమ్మ నాయకత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చెక్కు చెదరకుండా ముందుకు వెళుతోందన్నారు. ఇక జగన్ బయటకొస్తే టీడీపీ పరిస్థితి ఏమిటనే భయం చంద్రబాబును వెన్నాడుతోందని చెప్పారు. -
హైదరాబాద్ చేరుకున్న చంద్రబాబు
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు తొలివిడత ఆత్మగౌరవ యాత్ర ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు. ఆయన ఈరోజు పార్టీ ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. తాజా రాజకీయ పరిస్థితులు, అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించనున్నట్లు సమాచారం. గుంటూరు, కృష్ణా జిల్లాల్లో చేపట్టిన మొదటి విడత ఆత్మగౌరవ యాత్ర బుధవారం రాత్రితో ముగిసింది. చంద్రబాబునాయుడు సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి గుంటూరు జిల్లాలో ఆత్మగౌరవ యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. నాలుగు రోజులు విశ్రాంతి తీసుకున్న తర్వాత రెండో విడత ఆత్మగౌరవ యాత్ర షెడ్యూల్‌ను చంద్రబాబు ప్రకటించనున్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి రెండో విడత యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. -
మీ కంటే పెద్ద రౌడీని : చంద్రబాబు
కంభంపాడు : ఆత్మగౌరవ యాత్ర పేరుతో రాష్ట్రంలో పర్యటిస్తున్న చంద్రబాబునాయుడుకు అడుగడుగునా అవాంతరాలు ఎదురువుతున్నాయి. కృష్ణా జిల్లా ఏ.కొండూరు మండలం కంభంపాడు గ్రామస్తులు సోమవారం రాత్రి బాబు యాత్రను అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఆరోపణలు మాని అసలు రాష్ట్ర విభజనపై వైఖరి ఏంటో స్పష్టం చేయాలని వారు చంద్రబాబును డిమాండ్ చేశారు. చంద్రబాబుకు వ్యతిరేకంగా గట్టిగా నినాదాలు చేశారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు...గ్రామస్తులపై కన్నెర్రజేశారు. రౌడీలు, గుండాల్లా వ్యవహరిస్తున్నారని వారిని దుర్భాషలాడారు. మీ కంటే పెద్ద రౌడీని.... తోకలు కత్తిరిస్తానంటూ కంభంపాడు వాసుల్ని హెచ్చరించారు. పరిస్థితి చేయిదాటిపోతుండటంతో పోలీసులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది గ్రామస్తుల్ని దూరం తీసుకెళ్లారు. అయితే చంద్రబాబును నిలదీసిన గ్రామస్తులపై స్థానిక టీడీపీ నేత ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేశారు. బాబు ఆదేశాలతోనే తమపై కేసు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. -
దేశంలో పాలన అధ్వానం
సాక్షి, గుంటూరు: దేశంలో పాలనా వ్యవస్థ అధ్వానంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ యాత్రలో భాగంగా బుధవారం గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలుచోట్ల మాట్లాడారు. సోనియా చుట్టూ ఉన్న దుష్టచతుష్టయం ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. సొంత రాష్ట్రాల్లో జనాదరణ లేని అహ్మద్‌పటేల్, దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ ఆజాద్, చిదంబరంలు.. ఢిల్లీలో కూర్చొని ఆంధ్రరాష్ట్రాన్ని ముక్కలు చేయాలని లెక్కలేస్తున్నారన్నారు. తెలుగు జాతి విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తే జాగ్రత్త.. అని హెచ్చరించారు. సోనియా చేతిలో తోలుబొమ్మగా ఉన్న ప్రధాని మన్మోహన్.. ఆమె ఆడమన్నట్లు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సోనియాగాంధీ.. ఈ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చిందన్నారు. కళ్లుమూసుకొని పాలు తాగుతున్న పిల్లి చందాన సోనియా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఏదో ఒక సందర్భంలో ఇటలీ పిల్లిని ప్రజలు ఉతికిపారేస్తారని వ్యాఖ్యానించారు. ‘‘దొంగతనం చేసినోళ్లు, అవినీతిని ప్రధాన వృత్తిగా భావించేవారు ఏ విషయంలోనూ ధైర్యంగా ఉండ లేరు. అలాంటివారిని ఎదగనిచ్చే పరిస్థితే లేదు. నాది ఉడుంపట్టు..’’ అని అన్నారు. రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్న సోనియానే కాదు.. ఆమెను పుట్టించిన దేవుళ్లకు కూడా తాను భయపడన ని చెప్పారు. యూరప్‌లోనే ఇటలీకి మాఫియా ప్రాంతంగా పేరుందని, ఆ దేశస్థురాలికి తగిన బుద్ధిచెప్పేందుకే టీడీపీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇటలీ వనిత సోనియాకు.. ఇడుపులపాయ విజయలక్ష్మికి లంకె కుదిరిందని విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో జగన్నాటకం జరుగుతోందని.. ఇందులో సూత్రధారి సోనియా అయితే, పాత్రధారులు టీఆర్ఎస్, వైఎస్ఆర్సీపీ అని విమర్శించారు.రాష్ట్రంలో తన తొమ్మిదేళ్ల పాలన స్వర్ణయుగమన్నారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కేంద్రంలో చాలా ఆర్థిక సంస్కరణలు తెచ్చారని, వాటితో అద్భుతమైన అభివృద్ధిని సాధిం చి ఎన్నెన్నో దేశాలకు ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. హైదరాబాద్‌పై మాట్లాడే హక్కు తనకే ఉందని చెప్పుకొచ్చారు. -
నా మీద మొరుగుడే కానీ... సోనియాని అడగలేరు
గుంటూరు : సీట్లు, ఓట్లు కోసమే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిచ్చు పెడుతోందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు ధ్వజమెత్తారు. ఆత్మగౌరవ యాత్రలో భాగంగా ఆయన మంగళవారం గుంటూరు జిల్లా క్రోసూరులో మాట్లాడారు. ఉత్తరప్రదేశ్‌ను నాలుగు రాష్ట్రాలు చేయాలనే డిమాండ్ ఉన్నా.... సొంత రాష్ట్రం కాబట్టి పట్టించుకోవటం లేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తెలుగు రాష్ట్రాన్ని రెండు ముక్కలు చేయాలనుకుంటుందోని ఆయన మండిపడ్డారు. సీమాంధ్ర కాంగ్రెస్ మంత్రులు, ఎంపీలు సోనియాగాంధీ పెంపుడు కుక్కలని.... తన మీద మొరుగుతారే కానీ, సోనియాని అడగలేరని విమర్శించారు. తాను అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో విభజన సమస్యను పరిష్కరిస్తామని మరోసారి చంద్రబాబు తెలిపారు. సమస్యలు పరిష్కరించకుండా ప్రభుత్వం గుడ్డిగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. -
బాబు సీమాంధ్ర యాత్ర సమర్థనీయం: వినోద్
హైదరాబాద్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు చేపట్టనున్న ఆత్మగౌరవ యాత్రను టీఆర్ఎస్ సీనియర్ నేత వినోద్ సమర్థించారు. శనివారం ఉదయం ఓ ఛానల్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సీమాంధ్రలు తమ హక్కుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని అన్నారు. కొత్త రాష్ట్ర రాజధానితో పాటు, ఇతర వాటి కోసం సీమాంధ్రులు కేంద్రంపై ఒత్తిడి తెచ్చి సాధించుకోవాలని వినోద్ అభిప్రాయపడ్డారు. సీమాంధ్రుల రాజకీయాల వల్లే తెలంగాణ ఏర్పాటు కోరామని ఆయన అన్నారు. యూపీఏ హయాంలో జరిగిన కుంభకోణాలకు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ బాధ్యత వహించక తప్పదని వినోద్ స్పష్టం చేశారు. మన్మోహన్ హయాంలో అనేక కుంభకోణాలు జరిగాయని ఆయన అన్నారు. కాగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి చంద్రబాబునాయుడు గుంటూరు జిల్లా నుంచి ఆత్మ గౌరవ యాత్రను ప్రారంభించనున్న విషయం తెలిసిందే.