రెండో విడత యాత్రపై పార్టీ నేతలతో చంద్రబాబు చర్చ
సాక్షి, హైదరాబాద్: రెండో విడత ‘తెలుగుజాతి ఆత్మగౌరవ యాత్ర’ ఏ జిల్లా నుంచి చేపట్టాలన్న అంశంపై టీడీపీ అధినేత చంద్రబాబు మల్లగుల్లాలు పడుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అంగీకారాన్ని వ్యక్తం చేస్తూ చంద్రబాబు ఢిల్లీకి లేఖ రాశాకే సీడబ్ల్యూసీ విభజన నిర్ణయాన్ని వెలువరించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతం కోస్తా, రాయలసీమ ప్రాంతంలోని ఏ జిల్లా పర్యటనకు వెళితే ఎలాంటి నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని అధినేతతోసహా టీడీపీ ముఖ్య నేతలందరూ ఆచితూచి వ్యవహరిస్తున్నారు. బస్సుయాత్ర మొదట విడతలోనే పశ్చిమగోదావరి జిల్లాలో బాబు పర్యటిం చాల్సి ఉంది.
అయితే సమైక్యాంధ్ర ఉద్యమకారుల నుంచి నిరసనలు ఎదురయ్యే ప్రమాదముందని జిల్లానేతలు సూచిం చినందున ఆ జిల్లాకు వెళ్లకుండానే మొదట విడత యాత్రను ముగించారు. ఈ నేపథ్యంలో మరో వారం, పది రోజుల్లో రెండోవిడత యాత్రకు వెళ్లాలన్న యోచనతో ఉన్న చంద్రబాబు శుక్రవారం తన నివాసంలో పార్టీ నేతలతో చర్చించా రు. ప్రస్తుతం పార్టీకి ఏ జిల్లాలో అనుకూల పరిస్థితులున్నాయన్న దానిపై చర్చించారు. ప్రకాశం, నెల్లూరుతోపాటు ఉభయగోదావరి జిల్లాల్లో యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ఏ మేరకు చేయగలుగుతామో పరిశీలించి రూట్‌మ్యాప్‌లు ఖరా రు చేయాలని సూచించారు. ఒక్కో విడతలో రెండు జిల్లాల్లో యాత్ర నిర్వహించాలని నిర్ణయించారు. అధినేత ఢిల్లీ పర్యటన తర్వాతే రెండో విడత బస్సు యాత్ర మొదలు పెట్టాలని సమావేశంలో నిర్ణయించారు.
సోమవారం తరువాతే ఢిల్లీ యాత్ర: చంద్రబాబు ఢిల్లీ పర్యటన సోమవారం తర్వాతే ఉండే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ నేతల సమావేశంలో ఢిల్లీ యాత్ర వివరాలపైనా చర్చ జరిగింది. ప్రధాని, రాష్ట్రపతి, పలువురు కేంద్రమంత్రులతోపాటు వివిధ పార్టీల జాతీయ నేతల అపాయింట్‌మెంట్లపై నేతల్ని బాబు ఆరా తీశారు. ఆర్థిక సంక్షోభం పై ఢిల్లీలో పార్టీపరంగా సదస్సు నిర్వహించాలన్న యోచనపై చర్చించారు. భేటీలో నేతలు కె.రామ్మోహనరావు, గరికపాటి రామ్మోహనరావు, నన్నపనేని రాజకుమారి పాల్గొన్నారు.