దేశంలో పాలన అధ్వానం
సాక్షి, గుంటూరు: దేశంలో పాలనా వ్యవస్థ అధ్వానంగా మారిందని టీడీపీ అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవ యాత్రలో భాగంగా బుధవారం గుంటూరు జిల్లాలోని పెదకూరపాడు నియోజకవర్గంలో పర్యటించిన ఆయన పలుచోట్ల మాట్లాడారు. సోనియా చుట్టూ ఉన్న దుష్టచతుష్టయం ఈ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించేందుకు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. సొంత రాష్ట్రాల్లో జనాదరణ లేని అహ్మద్‌పటేల్, దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ ఆజాద్, చిదంబరంలు.. ఢిల్లీలో కూర్చొని ఆంధ్రరాష్ట్రాన్ని ముక్కలు చేయాలని లెక్కలేస్తున్నారన్నారు. తెలుగు జాతి విచ్ఛిన్నానికి ప్రయత్నిస్తే జాగ్రత్త.. అని హెచ్చరించారు.
సోనియా చేతిలో తోలుబొమ్మగా ఉన్న ప్రధాని మన్మోహన్.. ఆమె ఆడమన్నట్లు ఆడుతున్నారని దుయ్యబట్టారు. సోనియాగాంధీ.. ఈ రాష్ట్రాన్ని కుక్కలు చింపిన విస్తరిలా మార్చిందన్నారు. కళ్లుమూసుకొని పాలు తాగుతున్న పిల్లి చందాన సోనియా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. ఏదో ఒక సందర్భంలో ఇటలీ పిల్లిని ప్రజలు ఉతికిపారేస్తారని వ్యాఖ్యానించారు. ‘‘దొంగతనం చేసినోళ్లు, అవినీతిని ప్రధాన వృత్తిగా భావించేవారు ఏ విషయంలోనూ ధైర్యంగా ఉండ లేరు. అలాంటివారిని ఎదగనిచ్చే పరిస్థితే లేదు. నాది ఉడుంపట్టు..’’ అని అన్నారు. రాష్ట్రాన్ని తాకట్టుపెడుతున్న సోనియానే కాదు.. ఆమెను పుట్టించిన దేవుళ్లకు కూడా తాను భయపడన ని చెప్పారు.
యూరప్‌లోనే ఇటలీకి మాఫియా ప్రాంతంగా పేరుందని, ఆ దేశస్థురాలికి తగిన బుద్ధిచెప్పేందుకే టీడీపీ పనిచేస్తుందని పేర్కొన్నారు. ఇటలీ వనిత సోనియాకు.. ఇడుపులపాయ విజయలక్ష్మికి లంకె కుదిరిందని విమర్శించారు. రాష్ట్ర రాజకీయాల్లో జగన్నాటకం జరుగుతోందని.. ఇందులో సూత్రధారి సోనియా అయితే, పాత్రధారులు టీఆర్‌ఎస్, వైఎస్‌ఆర్‌సీపీ అని విమర్శించారు.రాష్ట్రంలో తన తొమ్మిదేళ్ల పాలన స్వర్ణయుగమన్నారు. మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు కేంద్రంలో చాలా ఆర్థిక సంస్కరణలు తెచ్చారని, వాటితో అద్భుతమైన అభివృద్ధిని సాధిం చి ఎన్నెన్నో దేశాలకు ఆంధ్రప్రదేశ్‌ను ఆదర్శవంతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దామన్నారు. హైదరాబాద్‌పై మాట్లాడే హక్కు తనకే ఉందని చెప్పుకొచ్చారు.