భవిష్యత్తులో ప్రధానిని కలవను: చంద్రబాబునాయుడు
అపాయింట్‌మెంట్ ఇవ్వకుండా అవమానించారు: చంద్రబాబు ధ్వజం
సాక్షి, న్యూఢిల్లీ: కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి చెప్పడానికి వస్తే, ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్ అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ‘‘ఆరేడుసార్లు అవమానించారు. ఈ అవమానం నాకు కాదు. తెలుగుజాతికి జరిగిన అన్యాయంగా భావిస్తూన్నా. భవిష్యత్‌లో ప్రధానిని కలవకూడదని నిర్ణయించుకున్నా’’ అని పేర్కొన్నారు. చంద్రబాబు మంగళవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.
తాను సొంత పనులు, పైరవీల కోసం ఢిల్లీకి రాలేదని, రాష్ట్రానికి ఎదురైన జీవన్మరణ సమస్య గురించి చెప్పుకోడానికి వచ్చానని.. అయినా అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవటం దుర్మార్గమని ధ్వజమెత్తారు. ‘‘ప్రధానిని కలవటానికి నాలుగు రోజుల నుంచి నిరీక్షిస్తున్నాం. ఇంటర్వ్యూ కోరుతూ శనివారం లేఖ ఇచ్చాం. ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి లేదు. దీనికన్నా మించిన పని ఏమిటని ప్రధానిని అడుగుతున్నా’’ అని ప్రశ్నించారు. తమ మెమోరాండంను కొరియర్ సర్వీసు ద్వారా ప్రధానికి పంపే పరిస్థితి రావటం బాధాకరమన్నారు. ‘మీకు ప్రధాని అపాయింట్‌మెంట్ ఎందుకు ఇవ్వటంలేద’ని విలేకరులు ప్రశ్నించగా.. ‘‘తెలుగువారంటే చులకన. నేనంటే వ్యతిరేకత. ఆవినీతిపరులు, దొంగలకు అపాయింట్‌మెంట్లు ఇవ్వటానికి సిగ్గుండాలి. నీతి నిజాయితీతో సమస్య చెప్పటానికి వస్తే అపాయింట్‌మెంట్ ఇవ్వడు. కనీసం ఎప్పుడు ఇస్తారో సమాధానం చెప్పరు. మేం అడుక్కునే వాళ్లమా?’’ అని బాబు మండిపడ్డారు.
ఇప్పుడున్న ప్రాజెక్టులన్నీ నేనే నిర్మించా...
జస్టిస్ బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పుతో కృష్ణా జలాల పంపిణీలో రాష్ట్రానికి అన్యాయం జరిగిందన్నారు. ఆ తీర్పును రద్దు చేయాలని, తీర్పును నోటిఫై చేయకూడదని, కొత్త కమిషన్‌ను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి న్యాయం చేయకుంటే తీవ్రపరిణామాలు ఉంటాయని కేం ద్రం, కాంగ్రెస్‌ను హెచ్చరించారు. తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో నీటిపారుదల రంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేశారనే విమర్శల గురించి ప్రస్తావించగా.. ‘‘ఇప్పడున్న ప్రాజెక్టులన్నీ ఎన్‌టీఆర్, లేదా నేను నిర్మించినవేనని సవాలు చేసి చెప్తున్నా. ప్రాజెక్టులన్నీ ఒక పద్ధతి ప్రకారం నిర్మించా. 18 లక్షల ఎకరాలు అదనంగా సాగు చేశాం. వారు జలయజ్ఞం పేరిట ధనయజ్ఞం చేశారు’’అని బదులిచ్చారు. ‘‘జైపాల్‌రెడ్డి నన్ను విమర్శిస్తారా..? ఆయన రాష్ట్రానికి ఏమి సాధించారు’’ అంటూ బాబు ధ్వజమెత్తారు.
‘తెలంగాణ’పై మీకూ తెలీదు..నాకూ తెలీదు..!
రాష్ట్ర విభజనపై తనకు ఎలాంటి అయోమయంలేదని, ఖచ్చితమైన వైఖరి ఉందని చంద్రబాబు చెప్పుకొచ్చారు. ‘రాష్ట్ర విభజనపై మీ వైఖరి ఏమిటి? రాయల తెలంగాణకు మద్దతు ఇస్తారా? పార్లమెంటులో తెలంగాణ బిల్లును సమర్థిస్తారా?’ అంటూ జాతీయ మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు బాబు ఇచ్చిన సమాధానాలు తికమకపెట్టాయి. ‘‘ఒకసారి తెలంగాణ, ఇంకోసారి రాయల తెలంగాణ, యూటీ.. ఇలా రకరకాల లీకులు ఇస్తున్నారు. అసలు ఏం చేస్తున్నారో కాంగ్రెస్‌ను ముందు చెప్పమనండి. ఇక్కడ ఉన్నవారి (మీడియా)ని అడుగుతున్నా... అసలు వారు ఏం చేస్తున్నారో మీకు తెలుసా..? మీకు (మీడియా) ఏమీ తెలియదు.. నాకు ఏమీ తెలియదు.. ఎవరికీ ఏమీ తెలియనప్పుడు ఎలా ఎండార్స్ చేస్తాం..? సమస్యను పరిష్కరించలేకుంటే వదలిపెట్టాలి.. మేం అధికారంలోకి వస్తే ఆరు నెలల్లో పరిష్కరిస్తాం’’ అంటూ బాబు వ్యాఖ్యానించారు.
టీడీపీ ఎంపీల అరెస్టు : ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవటాన్ని నిరసిస్తూ టీడీపీ ఎంపీలు ప్రధాని నివాసం 7 రేస్‌కోర్సు వద్ద ధర్నా నిర్వహించడానికి చేసిన ప్రయత్నాలను పోలీసులు విఫలం చేశారు. మీడియా సమావేశం ముగిసాక బాబు నేరుగా విమానాశ్రయానికి వెళ్లగా, టీడీపీ ఎంపీలు ప్రధాని నివాసానికి చేరుకుని ధర్నాకు దిగగా.. పోలీసులు నామా నాగేశ్వరరావు, దేవేందర్‌గౌడ్, సుజనాచౌదరి, నిమ్మల కిష్టప్ప, సి.ఎం.రమేష్, గుండు సుధారాణిలను అరెస్టుచేసి పార్లమెంటు వీధి పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. రెండు గంటల అనంతరం విడుదల చేశారు.
నేడు విజయవాడలో బాబు ధర్నా
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాలపై బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తుది తీర్పును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు బుధవారం విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద ధర్నా చేయనున్నారు. ఉదయం నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఈ ధర్నా కొనసాగుతుంది. కాగా 5వ తేదీన ఆయన ఇదే అంశంపై మహబూబ్‌నగర్ జిౄ్లలోని జూరాల ప్రాజెక్టు వద్ద ధర్నా చేయనున్నారు.