హస్తినలోనూ రెండుకళ్ల సిద్ధాంతమే! | TDP to bat for Seemandhra interests in Parliament | Sakshi
Sakshi News home page

హస్తినలోనూ రెండుకళ్ల సిద్ధాంతమే!

Published Thu, Feb 6 2014 4:06 AM | Last Updated on Thu, Jul 11 2019 7:38 PM

హస్తినలోనూ రెండుకళ్ల సిద్ధాంతమే! - Sakshi

హస్తినలోనూ రెండుకళ్ల సిద్ధాంతమే!

బట్టబయలైన టీడీపీ ద్వంద్వ వైఖరి
ఆఖరి సమావేశాల్లో బిల్లేమిటి?: బాబు
బిల్లు ఆమోదించాలని ప్రధానిని కోరాం: నామా
పార్లమెంటు గేటు ఎదుట సీమాంధ్ర ఎమ్మెల్యేల బైఠాయింపు

 
 సాక్షి, న్యూఢిల్లీ: హస్తిన సాక్షిగా తెలుగు తమ్ముళ్ల రెండు కళ్ల సిద్ధాంతం మరోసారి బట్టబయలైంది. తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆ పార్టీ పార్లమెంటరీ నేత నామా నాగేశ్వర్‌రావు ఒకే వేదికగా పరస్పర విరుద్ధమైన వ్యాఖ్యలు చేశారు. ఓటాన్ అకౌంట్ సమావేశాల్లో బిల్లు పెట్టడాన్ని బాబు తీవ్రంగా వ్యతిరేకించగా... ఎవరు అడ్డొచ్చినా ఈ సమావేశాల్లో బిల్లు పెట్టి తీరాల్సిందేనంటూ నామా డిమాండ్ చేశారు. ఢి ల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్‌లో బుధవారం సాయంత్రం చంద్రబాబునాయుడు మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత కొద్దిసేపటికే ఎర్రబెల్లి దయాకర్‌రావుతో అక్కడికి వచ్చిన నామా నాగేశ్వర్‌రావు ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను కలిసిన విషయాన్ని ప్రస్తావిస్తూ పైవిధంగా స్పందించారు. సమన్యాయం చేయని బిల్లును అడ్డుకోవాలంటూ చంద్రబాబు పలువురు జాతీయ నేతలను కలిసి అభ్యర్థిస్తుండగా... సాధ్యమైనంత త్వరగా బిల్లును ఆమోదింపచేయాలంటూ నామా ఆధ్వర్యంలో టీటీడీపీ నేతల బృందం ప్రధాని, లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్, రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ, ప్రతిపక్ష బీజేపీ నేత సుష్మా స్వరాజ్‌లను కలిసి వినతిపత్రాలు అందించారు.
 
 మరోవైపు తెలంగాణ బిల్లును వ్యతిరేకిస్తూ బుధవారం పార్లమెంటు గేటు ఎదుట సీమాంధ్ర టీడీపీ ఎమ్మెల్యేలు బైఠాయించారు. దీంతో పోలీసులు వారిని వ్యాన్‌లోకి ఎక్కించారు. అయితే ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వ్యాన్ ముందు టైర్లకు అడ్డంగా పడుకున్నారు. దీన్ని గమనించని డ్రైవర్ వ్యాన్‌ను ముందుకు కదిలించబోగా గట్టిగా అరిచి వ్యాన్‌ను ఆపారు. తర్వాత ఎమ్మెల్యేలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. బైఠాయింపులో పయ్యావుల కేశవ్, దేవినేని ఉమామహేశ్వరరావు, పల్లె రఘునాథరెడ్డి, ధూళిపాళ్ల నరేంద్ర చౌదరి, బల్లి దుర్గాప్రసాద్, లింగారెడ్డి సహా దాదాపు 15 మంది పాల్గొన్నారు.
 
 సమన్యాయం చేశాకే విభజన చేయాలి: చంద్రబాబు
 మా పొలిట్‌బ్యూరో 2008లో ఇచ్చిన లేఖను మేం వెనక్కు తీసుకోలేదు. అయితే ఇరు ప్రాంతాలకు సమన్యాయం చేయాలి. ఇరు ప్రాంతాల స్టేక్ హోల్డర్స్‌ను పిలిపించి చర్చించాలి. ఇద్దరిని ఒప్పించి ఆమోదయోగ్యమైన పరిష్కారాన్ని చూపాలి. ఇదే విషయాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి కూడా చెప్పాం. ఎమర్జెన్సీ నుంచి ఎన్టీఆర్‌ను బర్తరఫ్ చేసేవరకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని పలుమార్లు ఉల్లంఘించింది. ఇప్పుడు ఆర్టికల్-3ని దుర్వినియోగం చేస్తుంది. మరి కొద్దిరోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వస్తుంది. ఎన్నికల ముందు చివరి సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ బిల్లులు పెడతారు. కొత్త ప్రభుత్వం వచ్చాక మళ్లీ బిల్లులు పెట్టుకుంటాయి. కానీ కాంగ్రెస్‌కు ఓట్లు, సీట్లు, రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం. అందుకే ఆఖరి సమావేశంలో బిల్లు పెట్టాలనుకుంటోంది. రాష్ట్రంలో విద్వేషాలకు సోనియాగాంధీయే కారణం.
 
 ఈ సమావేశాల్లోనే ఆమోదించాలి: నామా
 ప్రధాని మన్మోహన్‌ను కలిసి తెలంగాణపై సవివరంగా మాట్లాడాం. చివరి సమావేశాల్లో ఉభయసభల్లో తెలంగాణ బిల్లు ఎట్టిపరిస్థితుల్లో ఆమోదం పొందేలా చూడాలని డిమాండ్ చేశాం. విభజన బిల్లు పెడితే తెలంగాణ టీడీపీ ఎంపీలం తప్పకుండా ఓటు వేస్తామని స్పష్టంగా చెప్పాం. సీఎం కిరణ్ ఢిల్లీలో ధర్నా చేయడం ప్రజల్లో అమోమయానికి గురిచేసిందని ప్రధాని దృష్టికి తీసుకెళ్లాం. స్పీకర్ మీరాకుమార్‌ను కూడా కలిసి తెలంగాణ బిల్లు ఆమోదం అయ్యేలా సహకరించాలని కోరాం. పార్లమెంటులో చర్చ జరిగే సమయంలో ఎవరు అడ్డుకున్నాసరే.. బిల్లు ఆమోదం చేయించాలి. బిల్లు ఆమోదానికి పూర్తి హామీ ఇచ్చిన ప్రధాని మన్మోహన్‌కు ధన్యవాదాలు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement