
నాగర్ కర్నూలు: తెలంగాణ ఏర్పాటులో కేసీఆర్ పాత్ర శూన్యమని కాంగ్రెస్ సీనియర్ నేత గులామ్ నబీ ఆజాద్ వ్యాఖ్యానించారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మహాగర్జన సభలో బుధవారం ఆజాద్ మాట్లాడారు. మీ కోసం ఒక శుభవార్త.. కేసీఆర్ ఈ సారి చిత్తుగా ఓడిపోతారని జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డిపై జరిగిన కుట్ర బాధాకరమన్నారు. రేవంత్‌ని బంధించి సభ నిర్వహించే దుస్థితికి కేసీఆర్ దిగిపోయారని విమర్శించారు. తెలంగాణ ప్రజానీకానికి కేసీఆర్ తీరని అన్యాయం చేశారని ఆరోపించారు.
యువకులు, వృద్ధులు, రైతులందరినీ మోసం చేశారని ధ్వజమెత్తారు. యువకులకు ఉద్యోగాలు ఇవ్వలేదు..మైనార్టీలకు 12 శాతం రిజర్వేషన్ అని అబద్ధపు వాగ్దానం చేసి వాళ్లని మోసం చేశారని దుయ్యబట్టారు. జిల్లాలు, ప్రముఖ మండల కేంద్రాల్లో నిర్మిస్తానన్న వంద పడకల ఆసుపత్రులు కనపడటం లేదని ఎద్దేవా చేశారు. దేశంల మొత్తంలో ఫాంహౌస్‌లో కూర్చుని రాష్ట్రాన్ని నడుపుతున్న ఏకైక సీఎం కేసీఆర్ మాత్రమేనని అన్నారు.
తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీలైతే..నేను తెచ్చానంటూ బూటకపు మాటలతో కేసీఆర్ పాలిస్తున్నారని మండిపడ్డారు. బిడ్డకు జన్మనిచ్చిన వాళ్లే ఆ బిడ్డ బాగోగులను బాగో చూసుకోగలరని, అలాగే తెలంగాణా మావల్లే ఏర్పడిందని, తామే బాగు చేస్తామని అన్నారు. మహాకూటమిని గెలిపించాలని ప్రజానీకానికి విన్నవించుకుంటున్నామని తెలిపారు. హర్షవర్దన్‌ను గెలిపించండి..ఈ ప్రాంతాన్ని మేం అభివృద్ధి చేసి చూపుతామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment