
సాక్షి, హైదరాబాద్: అబద్ధాలు చెప్పడంలో అపద్ధర్మ సీఎం కేసీఆర్ నంబర్ వన్ అని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ రాములునాయక్ ధ్వజమెత్తారు. ఎన్నికల ప్రచారసభల్లో పదే పదే అబద్ధాలు వల్లిస్తున్నారని.. అబద్ధాలు ఆడే రేసులో దేశంలోనే కేసీఆర్ మొదటి స్థానంలో నిలువడం ఖాయమని విమర్శించారు. దళితులను సీఎం చేస్తానని, గిరిజనులు, మైనారిటీలకు 12 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తామని మోసం చేశారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి.. వాటన్నింటిని అమలు చేశానంటూ ప్రజలను మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు.
గాంధీభవన్‌లో బుధవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్టీల రిజర్వేషన్ల అమలుపై ప్రశ్నిస్తే తనను పార్టీ నుంచి బయటికి పంపారని ఆరోపించారు. నాలుగున్నరేళ్ల పాలనలో కేసీఆర్ మహిళలను పూర్తిగా విస్మరించారని.. కులాల మధ్య చిచ్చుపెట్టారని దుయ్యబట్టారు. కేసీఆర్ మళ్ళీ అధికారంలోకి వస్తే ఎమ్మెల్యేలంతా ఆయనకు సాష్టాంగ నమస్కారాలు చేయాల్సిందేనని ఎద్దేవా చేశారు. వంద సీట్లు రాకుంటే కేటీఆర్ రాజకీయాలు వదిలేసి అమెరికా వెళ్తానంటున్నారని.. పోలీస్ అధికారులు ముందస్తుగా కేటీఆర్ పాస్‌పోర్ట్ సీజ్ చేయాలని డిమాండ్ చేశారు.
మాది గ్రాస్ సర్వే.. ఆయనది గ్లాస్ సర్వే
ఎన్నికల్లో కాంగ్రెస్‌కు అధికారం ఖాయమని రాములునాయక్ చెప్పారు. కాంగ్రెస్‌ది గ్రాస్ రూట్ సర్వే అని, కేసీఆర్‌ది గ్లాస్ సర్వే అని విమర్శించారు. మెదక్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో మెజారిటీ స్థానాల్లో కూటమిదే గెలుపని చెప్పారు. గజ్వేల్‌లో కేసీఆర్ ఓటమి ఖాయమన్నారు. ధనప్రవాహంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలవాలని చూస్తున్నారని ఆరోపించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్ రోడ్ షోల్లో ప్రచారం చేస్తారని.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనైనా నెరవేర్చారా అని ప్రశ్నించారు.
టీఆర్‌ఎస్ నుంచి వలసలు ఇంకా ఉంటాయని చెప్పారు. అందరూ కంటి ఆపరేషన్ల కోసం హైదరాబాద్‌కు వస్తే.. కేసీఆర్ మాత్రం ఢిల్లీ వెళ్తారని, అక్కడ ఆయనకు చికిత్స చేసేందుకు ఇద్దరు కంటి స్పెషలిస్టులు ఉన్నారని ఒకరు డాక్టర్ నరేంద్రమోదీ, మరొకరు డాక్టర్ అమిత్ షా అని ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment